ఇది ప్రత్యేక సామాజిక సందర్భం. అనేకానేక పరిణామాల చోటు చేసుకుంటున్న కాలం… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి దశాబ్ది కాలం దాటిన ప్రత్యేక సందర్భంలో వున్నది. సాహిత్య సాంస్కృతిక అంశాలలో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంలో మనవైన సంవేదనలు, మనదైన సందిగ్థత, సంక్లిష్టత వున్న ప్రత్యేక కాలాన గతం నుండి వర్తమానంలోకి పయనిస్తున్నప్పుడు, సాహిత్యంలో ఏం జరిగినది? ప్రస్తుతం ఎటువంటి సృజన జరుగుతున్నది? రానున్న కాలంలో మన గమ్యం, గమనం ఏమిటనేది బేరీజు వేసుకోవాల్సిన సమయంలో మనం వున్నామని గుర్తెరగడం, గుర్తించాల్సిన, చర్చించాల్సిన సాహిత్య దృక్పథాల తీరుతెన్నులను, వివిధ ప్రక్రియల్లో ఏ విధంగా ప్రదీప్తమైనదనే ఆలోచనకు ప్రతిరూపమే తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యోత్సవాల ప్రధాన ఎజెండా ఇది. తెలంగాణ సమాజం సృజనకారులు గుర్తించాల్సిన ప్రత్యేకాంశం.
ఇటీవల ఎటు చూసినా సాహిత్య పండుగలే జరగడం తెలంగాణ సాహిత్య సృజనకున్న చారిత్రక ప్రాధాన్యతను, సాంస్కృతిక ప్రత్యేకతలను నిలుపుకుంటున్న స్వరూపస్వభావాలను బలంగా చాటుతున్నది. మరోవైపు సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతున్నది. ఇప్పుడు కృత్రిమ మేధకాలం. ఈ తరుణంలో సమాజం ఎటు పోతున్నది? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని మార్క్స్ ఏనాడో చెప్పిన మాట… ఇప్పుడు 2026లో ఆక్టోపస్‌లా అల్లుకున్న సందిగ్ద సందర్భం. తెలంగాణ సాహిత్యకారులు వివిధ ప్రక్రియల్లో గత దశాబ్ద కాలంలో ఏ ఉద్యమ ఊపుతో ఏయే దృక్పథ నిష్టతో కొనసాగించారో, భవిష్యత్తులో ఎట్లా రేపటి తరానికి అందిస్తారో బేరీజు వేయడానికి తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్ 2026 ఒక దీపదారిగా నిలుస్తుంది. ఫిబ్రవరి 21, 22 తేదీలలో హైదరాబాద్ తంగిరాల చక్రవర్తి ప్రాంగణంలో రెండు రోజులపాటు పునర్మూల్యాంకనం చేయడం తెలంగాణ సాహిత్యానికి సరికొత్త దశను, దిశను ఇచ్చినది. ఫొటో ఎగ్జిబిషన్ నుంచి కవిత్వం, కథ, నవల, విమర్శ, సినిమా, పాట, మహిళ, సబాల్ట్రన్ సాహిత్యం, బాల సాహిత్యాలపై చర్చలు, విశ్లేషణలు, కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు తెలంగాణ సాహిత్య చైతన్యానికి ప్రతీకలుగా నిలిచాయి.
తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి కె.ఆనందాచారి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ప్రముఖ కవి, విమర్శకులు, తెలంగాణ సాహిత్య అకాడమి పూర్వ అధ్యక్షులు నందిని సిద్ధారెడ్డి ముఖ్య అతిథిగా కీలకోపన్యాసం చేస్తూ సాటి మనిషి పట్ల ప్రేమ, కరుణ, జాలి కనుమరుగవుతున్న తీరు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీధి పోరాటాలకు మించిన వీడియో పోరాటాలు, రేటింగులు, లైకులు, షేర్లు, వ్యూవర్షిప్లే లక్ష్యంగా కొనసాగుతున్న కాలంలో, సమాజాన్ని గాడిలో పెట్టాల్సింది సాహితీవేత్తలేనని పిలుపునిచ్చారు. సాహిత్యం తెలిస్తేనే లోకం తెలుస్తుందని, విద్యార్థులు, యువత సాహిత్యాన్ని చదవాలని సిద్ధారెడ్డి సూచించారు. దశాబ్ది క్రితం ప్రారంభమైన తెలంగాణ సాహితి ఎన్నో ఆటుపోట్లు, సవాళ్లను ఎదుర్కొని నిలబడటం తెలంగాణ సాహిత్యానికి ఎంతో మేలు చేసిందన్నారు. మున్ముందు ఇలాగే సమాజానికి దశ, దిశ నిర్దేశం చేయాలని ఆకాంక్షించారు.
గౌరవ అతిథి, ప్రజావాగ్గేయకారులు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల విష కౌగిలి నుంచి ముందుగా సాహితీవేత్తలు బయటపడాల్సిన అవసరముందన్నారు. మతోన్మాదం జడలు విప్పుతూ మనుషుల మధ్య వైషమ్యాలను సృష్టిస్తున్న తరుణంలో కవులు, రచయితలు అప్రమత్తంగా వుంటూ ప్రజల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా||రియాజ్ మాట్లాడుతూ ప్రగతిశీల సాహితీవేత్తలు నేటి సామాజిక మాధ్యమాల వేగాన్ని అందుకోవాలని సూచించారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న తెలంగాణ భాషా సాంస్కృతిక సంచాలకులు డా|| ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాహిత్యం నిత్యం చలనశీల, ప్రగతి శీలమైనదని, నేటి జెన్జీలు సాహిత్యాన్ని చదవాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ… తెలంగాణ సాహితితో కలిసి భవిష్యత్తులో వివిధ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత (కన్నడ) శివలింగప్ప మాట్లాడుతూ… ప్రజాహితమైన సాహిత్యం వచ్చినప్పుడే అది పదికాలాల పాటు నిలుస్తుందన్నారు. కాళోజీ అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవి, విశ్రాంత ప్రొఫెసర్ బన్న అయిలయ్య, ప్రముఖ కవులు యాకూబ్, మువ్వా శ్రీనివాసరావు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్.రఘు, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏ.వీ.కళాశాల ప్రిన్సిపాల్ డా||రాజలింగం ప్రారంభించారు. తెలంగాణ కథ – చర్చకు వహీద్‌ఖాన్ అధ్యక్షతన బి.వి.ఎస్.స్వామి అతిథిగా, శరత్ సుదర్శి సమన్వయంలో సమ్మెట ఉమాదేవి, చందు తులసి, తాళ్లపల్లి యాకమ్మ, హుమాయూన్సంఘీర్, మన్‌ప్రీతమ్, సాయివంశీ వంటి వర్దమాన కథారచయితలు తమ రచనానుభవాలను, కథని రాసేటప్పుడు దృక్పథ, వ్యక్తీకరణల అనుభవాలను పంచుకున్నారు.
తెలంగాణలో కథా ప్రక్రియ, కొత్త వస్తువు, అభివ్యక్తి రీత్యా విభిన్నంగా కన్పిస్తుందని తెలిపారు. రెండవ సెషన్లో తెలంగాణ కవిత్వం – చర్చలో కవి కటుకోఝ్వల రమేష్ అధ్యక్షతన, ప్రముక కవి అన్నవరం దేవేందర్ అతిథిగా సయ్యద్ ముజాహిద్ అలీ సమన్వయంలో హనీఫ్, తగుళ్ల గోపాల్, కుంజా కళ్యాణి, తండ హరీష్, శ్రీనిధి, విప్లవశ్రీ తమ కవితలను, కవితా నిర్మాణ పద్ధతులను వస్తువు ఎంపిక నుంచి, తమను ప్రభావితం చేసిన సంఘటనల నేపధ్యాన్ని వివరించారు. మూడవ సెషన్లో సబాల్ట్రన్ సాహిత్య చర్చకు ప్రముఖ కవి గాజోజు నాగభూషణం అధ్యక్షతన మనువాడ శంకర్ సమన్వయంతో సంగిశెట్టి శ్రీనివాస్, స్కైబాబా, సిద్దెంకి యాదగిరిలు వర్తమాన భారతీయ సమాజంలో జరుగుతున్న మతోన్మాద ప్రమాదకర అంశాలను ప్రస్తావించి, కవులు ముఖ్యంగా సబాల్ట్రన్ సాహిత్యంపై జరగాల్సిన చర్చల ఆవశ్యకతను తెలిపారు. సాయంత్రం పాట చర్చ – ప్రముఖ కవి, గాయకుడు పసునూరి రవీందర్ అధ్యక్షతన విప్లవ్‌కుమార్ సమన్వయంతో తెలంగణ ఉద్యమానికి, పాటకున్న ప్రత్యేకతల్ని వివరించారు.
మౌనశ్రీ మల్లిక్ సినిమా పాట కూడా ప్రాధాన్యతను సంతరించుకుందని తెలిపారు. పల్లె నర్సింహ, సాంబరాజు యాదగిరి, సి.అనితాకుమారి, తొట్ల వెంకటలక్ష్మి, తిరునగరి శరత్చంద్ర, బండి సత్తన్నలు తమ పాటలతో ఉర్రూతలూగించారు. తెలంగాణ సాహిత్యంలో పాటకు, ప్రణమిల్లిన తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక నేపధ్యాలను వివరించారు. రెండోరోజు ఆదివారం మహిళాంతరంగం ఆవిష్కరణ – సలీమ అధ్యక్షతన ఓల్గా ముఖ్య అతిథిగా డా||అమృతలత యాభైమూడు మంది కవయిత్రుల, రచయిత్రుల అంతరంగాన్ని ఆవిష్కరించారు. స్వేచ్ఛలోనే రచనల్లో సృజనాత్మకత వ్యక్తమౌతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నేటి కాలంలో మహిళా సాహిత్యం వృద్ధి చెందడం శుభ పరిణామమని ఓల్గా తెలిపారు. మహిళలు తమ అంతరంగాలను పూర్తిస్థాయిలో బయటపెడితే బావుంటుందని తెలిపారు. విద్యావేత్త, రచయిత్రి డా||అమృతలత మాట్లాడుతూ అంతరంగ ఆవిష్కరణ పుస్తకం మహిళలకు దిక్సూచి ప్రేరణ కావాలని అభిలషించారు. ఉప్పల పద్మ పుస్తకాన్ని సమీక్షించారు. మహిళా సాహిత్యంపై జరిగిన చర్చలో జ్వలిత, సంధ్యా విప్లవ్, వురిమళ్ల సునంద, రూపరుక్మిణి పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ సినిమా చర్చలో ప్రముఖ కవి, విమర్శకులు, సినిమా సమీక్షకులు ప్రసేన్ అధ్యక్షతన, గంగాధర్ సమన్వయంతో జరిగిన చర్చలో పొన్నం రవిచంద్ర, వంశీకృష్ణ, హెచ్.రమేష్‌బాబులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక సినిమారంగంలో వున్న పరిస్థితులను, నటీనటులు, దర్శకులు ఈ ప్రాంత సామాజిక, సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుతున్న పరిణామాల్ని వివరించారు. సినిమా కూడా సాహిత్య ప్రక్రియేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ నవల – చర్చకు వర్థమాన నవలా రచయిత నర్రా ప్రవీణ్‌రెడ్డి అధ్యక్షతన కొండా రవీందర్ సమన్వయంతో కె.పి.అశోక్‌కుమార్ అతిథిగా, రూప్‌కుమార్ డబ్బీకర్, వి.శాంతి ప్రబోధలు తెలంగాణ నవలా చరిత్రను, ఇప్పుడు వస్తున్న నవలల గురించి లోతైన చర్చ చేశారు. అనంతరం విమర్శపై జరిగిన చర్చకు ప్రముఖ కవి, విమర్శకులు బెల్లి యాదయ్య అధ్యక్షత వహించగా, పి.జ్యోతి ముఖ్య అతిథిగా, బండారి రాజ్‌కుమార్, చంద్ర శివన్న ఇమ్మిడి మహేందర్, ఎం.వి.రమణలు తెలంగాణ దశాబ్ది సాహిత్యంలో విమర్శ ప్రక్రియ తీరుతెన్నులను చర్చించారు. కుకుడాల గోవర్ధన్ సమన్వయం చేశారు.
అనంతరం జరిగిన కవి సమ్మేళనం గోలకొండ కలాలు పుస్తకాన్ని కోయి కోటేశ్వరరావు, యాకూబ్, రాధాకుసుమలు ఆవిష్కరించారు. ఈ సభకు భాస్కర్ యాదవ్, ఏభూషి నర్సింహ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. అనంతరం సలీం కందికొండ, భానుచందర్, హరిప్రియ, ఎ.అజయ్ కుమార్, తాతోలు దుర్గాచారి, బూరుగు గోపీకృష్ణ, భాస్కర రెడ్డి, శ్రీసుధ, పేర్లరాము, చిక్కొండ్ర రవి తదితరులు కవిత్వాన్ని చదివి, భవిష్యత్ తెలంగాణ వచన కవిత్వ ప్రత్యేకతల్ని ఆవిష్కరించారు. పిల్లలతో సాహిత్య సందడి పుప్పాల కృష్ణమూర్తి అధ్యక్షతన చొక్కాపు వెంకట రమణ నిర్వహణలో పత్తిపాక మోహన్, అనీల, జనకీరామ్ పాల్గొని, భావి తెలంగాణ బాలసాహిత్య ఔన్నత్యాన్ని చాటారు. పిల్లలు స్వయంగా తమ కథలను చెప్పడం విశేషం. ఆట పాటలతో పిల్లలు సాహిత్య సందడి చేయడం ఈ సాహిత్యోత్సవం ప్రత్యేకత. ఇందులో వురిమళ్ల సునంద రాసిన బడి ఇచ్చిన బహుమతి కథా సంకలనాన్ని సాహిత్య అకాడమి కార్యదర్శి డా|| నామోజు బాలాచారి ఆవిష్కరించారు.
అంతేకాదు, తెలంగాణ సాహితీ స్ఫూర్తి పేరుతో సాహిత్య మూర్తులైన నిఖిలేశ్వర్, ముదిగంటి సుజాతారెడ్డి, బి.ఎస్.రాములు, ఆశారాజు, మోతుకూరి నరహరి, కాలువ మల్లయ్య, తాటికొండాల నరసింహారావు, నాళేశ్వరం శంకరం, శిలాలోలిత, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఎలనాగ, అమ్మంగి వేణుగోపాల్, కపిల రాంకుమార్లను సత్కరించడం మరో విశేషం. ఈ సందర్భంగా తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచికను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. మొత్తంగా ఈ సాహిత్యోత్సవంలో పది పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. తెలంగాణ సాహిత్యం ప్రజాసాహిత్యం అనుభవం, అనుభూతి, ఆలోచనలతో కలగలిసిన ప్రత్యేక సాహిత్యంగా, ప్రాంతీయ చైతన్యం, భాషా సంస్కృతుల సమ్మేళనంగా కొనసాగుతున్న తీరును తెలంగాణ సాహితీ దశాబ్ది ఉత్సవాలు కలిగించాయి. సాహిత్య చరిత్రలో నిలుస్తాయి.
- ఎం.వి.రమణ, 9989000265



