Saturday, July 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమంత్రి జూపల్లి రాజీనామా చేయాలి

మంత్రి జూపల్లి రాజీనామా చేయాలి

- Advertisement -

సీఎం, మంత్రి జూపల్లికి పొంతనేది.?
మంత్రులు గోల్‌ కొట్టబోయి..సెల్ఫ్‌ గోల్‌ అయ్యారు
సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి: ప్రాజెక్టుల కోసం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పాదయాత్రలు
ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలి : మాజీ మంత్రి, 
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు

నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి జూపల్లి కష్ణారావు చెబుతున్న లెక్కల్లో పొంతన లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం సంగారెడి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం, సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమంలో హరీశ్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శిం చారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన అప్పుల వివరాలకు, మంత్రి జూపల్లి విడుదల చేసిన లేఖలోని లెక్కలకు తేడా ఉందని హరీశ్‌ రావు అన్నారు. ఇందులో ఎవరు నిజం చెబుతున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు బిడ్డవైతే.. పౌరుషం ఉంటే వెంటనే రాజీనామా చెయ్యి మిస్టర్‌ జూపల్లి అని సవాల్‌ విసిరారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్లేనని, దీనికి కాగ్‌ నివేదికే సాక్ష్యమని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అభివద్ధిని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టులను అటకెక్కించడంతో పాటు సింగూరు ప్రాజెక్టు మరమ్మతులను విస్మరించిందన్నారు. అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు గిరిజనుల భూములను లాక్కుంటోందని విమర్శించారు. మూసీ సుందరీకరణ పేరుతో ప్రచారం చేస్తున్న ప్రభుత్వం, హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తున్న మల్లన్నసాగర్‌ గురించి మాట్లాడడం లేదని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు, పాదయాత్రలు చేపడతా మని హెచ్చరించారు. కాంగ్రెస్‌ మంత్రులు గోల్‌ కొడుదాం అనుకుంటే సెల్ఫ్‌ గోల్‌ అయిపోయిందని ఎద్దేవా చేశారు.

అటకెక్కిన సంగమేశ్వర-బసవేశ్వర
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉండగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అటకెక్కించి సంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తోందని హారీశ్‌రావు ఆరోపించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల గురించి జిల్లా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఒక్కరోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. జిల్లాకు చెందిన మంత్రి ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇస్తే, మా సంగారెడ్డి జిల్లాకు, మా రైతులకు ఉపయోగపడే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదన్నారు. తక్షణమే ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, లేకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పాదయాత్రలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతు చేస్తాం అని చెప్పి ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. ఓట్ల తొలగింపు కుట్రలను తిప్పికొట్టాలని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సంగారెడ్డిలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్‌ భూములు లాక్కుంటున్న కాంగ్రెస్‌ సర్కార్‌ కు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, ఎమ్మెల్యేలు మాణిక్‌ రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్‌, శశిధర్‌ రెడ్డి, మాజీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, నాయకులు డా.శ్రీహరి, కాసాల బుచ్చిరెడ్డితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -