నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దుద్దిళ్ల శ్రీపాద రావు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నిష్పక్షపాతంగా వ్యవహరించిన గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. స్పీకర్ హోదాలో ఆయన చూపిన క్రమశిక్షణ, పారదర్శకత, నైతిక విలువలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన నాయకుడిగా ఆయన చిరస్మరణీయులని తెలిపారు.
ఈతరం యువత ఆయన సేవాభావం, నాయకత్వ లక్షణాలు , ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య, మాజీ ఎంపీపీ సమ్మయ్య, మాజీ ఎంపిటిసి జాడి మహేశ్వరి, టిఫిసిసి ఉప అధ్యక్షురాలు అంగోత్ సుగుణ, జిల్లా ఉప అధ్యక్షులు గద్దె సమ్మి రెడ్డి, కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు.



