”త్వరగా రా.. లేదంటే అయిపోతుంది” అంది ఆమె.
”ఏంటి?”
”ఈ నగరంలో చివరిగా దొరికే మంచి చారు.’
రాత్రి అప్పటికే పన్నెండున్నర దాటిపోయింది. ట్రాఫిక్ తగ్గిపోయింది. నగరం కాస్త నెమ్మదిగా రాత్రి ఒడిలోకి జారుకుంటోంది. ఫ్లైఓవర్ కింద బైక్ ఆపి మేమిద్దరం ఒక చిన్న గల్లీలోకి నడిచాం.
”నువ్వు నన్ను ఎప్పుడూ ఇలాంటి చోట్లకే తీసుకెళ్తావ్ ఎందుకు?” అన్నాను.
ఆమె నవ్వింది.
”ఎందుకంటే నువ్వు చూడని నగరాన్ని నీకు చూపించాలి కాబట్టి.”
గల్లీ చివర టీ బండి ఒకటి రాత్రిని ఇంకా మెలకువలో ఉంచుతోంది. కెటిల్ మీద నుంచి ఎగిసే ఆవిరి, లైటు వెలుతుర్ని తాకి మళ్లీ గాల్లో కలిసిపోతోంది. రెండు ప్లాస్టిక్ స్టూల్స్ మీద పారిశుధ్య కార్మికులు అలసటను చారుతో మింగేస్తున్నారు. ఒక డెలివరీ బారు మాత్రం చారు కంటే ఫోన్ వైపే ఎక్కువగా చూస్తున్నాడు. వాచ్‌మెన్ తన కర్రను పక్కన పెట్టి గ్లాస్‌ను రెండు చేతులతో పట్టుకున్నాడు. నగరం కోసం రాత్రంతా మేల్కొనే మనుషులు.. కాసేపు ఒకే చోట ఆగిపోయినట్టున్నారు. బండి దగ్గర చారు కలుపుతున్న వ్యక్తిని చూసి ఆమె ముఖం వెలిగిపోయింది.
”రహీం అన్నా.. ఇంకా మూసేయలేదా?”
అతను నవ్వాడు.
”నువ్వు వస్తానని చెప్పాక, రాకముందే ఎలా మూసేస్తా అమ్మా?”
ఆ తర్వాత నా వైపు చూసి నవ్వుతూ అన్నాడు..
”ఇతనేనా?”
ఆమె ఏమీ మాట్లాడలేదు. కానీ నవ్వు మాత్రం సమాధానం చెప్పేసింది.
”చారు అమ్మేవాళ్లకి ఒక అలవాటు ఉంటుంది అమ్మా,” అన్నాడు రహీం.
”ఏంటి?”
”మనుషుల్ని గుర్తుంచుకోవడం”
ఆమె నవ్వుతూ తల దించుకుంది. చారు వచ్చింది. ఆమె నా గ్లాస్ తీసుకుని ఒక గుక్క తాగింది.
”ఏంటి?”
”నీ టేస్ట్‌కి సరిపోతుందో లేదో చూశా”
”నా గ్లాస్‌లోనా?”
”అవును.”
”ఎందుకు?”
”నాకు తెలియాలి కదా?”
”మరి తెలిసిందా”
ఆమె చిన్నగా నవ్వుతూ..
”ఓ.. నా సర్వే పూర్తయింది” అంది.
రహీం ఒక్కసారిగా నవ్వేశాడు. అది అక్కడి గ్లాస్‌ల మీదుగా అందరినీ తాకింది. ఓ చిన్న ప్రతిధ్వనిలా గాల్లోనే నిలిచిపోయింది. పక్కన కూర్చున్న పారిశుధ్య కార్మికుడు గ్లాస్ చేతిలో తిప్పుకుంటూ అన్నాడు.
”ఈ వేడి చారు లేకపోతే రాత్రి డ్యూటీ కష్టమయ్యేది రహీం భారు.”
ఆమె వెంటనే అతని వైపు తిరిగింది.
”ఎప్పటి నుంచి పని?”
”రాత్రి పది నుంచి అమ్మా.”
”ఎప్పటివరకు?”
”తెల్లవారేదాకా..”
”అలసిపోరా?”
అతను నవ్వాడు.
”అలసిపోతాం. కానీ ఉదయం అయ్యేసరికి వీధులు శుభ్రంగా ఉండాలి కదా”
”ఇంటికి ఎప్పుడు వెళ్తారు?”
”ఉదయం ఏడు గంటలకు”
”పిల్లలు?”
అతను గ్లాస్ కింద పెట్టి చిన్నగా నవ్వాడు.
”అప్పటికి స్కూల్‌కి వెళ్లిపోతారు అమ్మా”
”అంటే రోజూ కలవరా?”
”ఆదివారం అయితే కొంచెం ఎక్కువ కనిపిస్తారు”
అతను చాలా సహజంగా చెప్పాడు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. అతని వైపు చూసింది ఆమె.
”ఇలా రాత్రంతా పని చేస్తే.. మీకు ఏమి మిగులుతుంది?”
అతను గ్లాస్ కింద పెట్టాడు.
”మిగిలేదేమీ ఉండదమ్మా.”
”అయినా ఎందుకు చేస్తారు?”
”చేయకపోతే తినడానికి కూడా ఉండదు” అంటూ చిన్నగా నవ్వాడు.
ఆమె కళ్లలో ఒక్క క్షణం మదుత్వం మెరిసింది. అది జాలి కాదు. గౌరవం. గాలి కాసేపు నిశ్శబ్దంగా మారింది. అప్పుడే డెలివరీ బారు ఫోన్ మోగింది. అతను గ్లాస్ పూర్తిగా తాగకముందే లేచిపోయాడు.
”అయ్యో… వెళ్లాలి.”
”చారు పూర్తిగా తాగలేదే?” అంది ఆమె.
అతను గ్లాస్ పక్కన పెడుతూ,
”అక్కా… యాప్‌కి చారు అర్థం కాదు. టైమ్ మాత్రమే అర్థమవుతుంది” అన్నాడు.
ఆమె చిన్నగా నవ్వింది.
”ఏ ఊరు?”
”ఖమ్మం.”
”ఇక్కడ ఒక్కడివేనా?”
”ఇంకా ముగ్గురం కలిసి ఉంటాం.”
”చదువు?”
”డిగ్రీ ఆపేశా.”
అతను భుజాలు ఎగరేశాడు.
”ఇప్పుడు ఈ యాప్‌నే కాలేజీ.. ఈ బైకే క్లాస్‌రూమ్” అని చెప్పి నవ్వాడు.
ఆ నవ్వులో అలసట ఎక్కువ, సంతోషం తక్కువ.
”బై అక్కా”
అతను వేగంగా బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయాక కూడా ఆమె కొద్దిసేపు అదే వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు నాకు మరో విషయం అర్థమైంది. ఆమె మనుషుల్ని ప్రశ్నించదు, వారి జీవితాల తలుపు తడుతుంది. అందుకే ఆమె వైపు చూస్తూ ఉండిపోయాను.
ఆమె నవ్వింది.
ఆ నవ్వు నాకు ఎప్పుడూ నచ్చుతుంది. కానీ ఆ రాత్రి ఇంకాస్త ఎక్కువగా నచ్చింది. రహీం కెటిల్ దించేశాడు.
”అయిపోయింది అమ్మా… ఇవాళ్టి చివరి చారు.”
”రేపు మళ్లీ ఉంటుంది కదా?”
”చారు ఉంటుంది అమ్మా… కానీ ఈ రాత్రి మళ్లీ రాదు.”
కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. మేమిద్దరం గల్లీ నుంచి బయటకు నడవడం మొదలుపెట్టాం. కొన్ని అడుగులు వేసిన తర్వాత ఆమె సహజంగానే నా చేతిని పట్టుకుంది. నేను ఆమె వైపు చూశాను.
”ఏంటి అలా చూస్తున్నావ్?” అంది.
”నువ్వు చూపించే నగరం, నేను రాసేదానికంటే చాలా పెద్దది.”
ఆమె ఒక్క క్షణం ఏమీ మాట్లాడలేదు. నా చేతిని పట్టుకుని, క్షణం పాటు తన గుండెలకు హత్తుకుని వదిలేసింది.
అలా ఆ రాత్రి ముగిసిపోయింది. కానీ ఆ చివరి చారు… ఇప్పటికీ చల్లారలేదు.
– రామ్
చివరి చారు
- Advertisement -
- Advertisement -



