హనుమంతుడికి ధ్యాన భంగం అయ్యింది. కలియుగం వచ్చినప్పటి నుండీ గంధమాదన పర్వతంపై తన రాముడిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. హనుమంతుడు చిరంజీవిగా వర్ధిల్లాలని రాముడు వరమిచ్చాడు.
అందువల్ల అన్ని యుగాల్లోనూ హనుమంతుడు జీవిస్తూనే ఉంటాడు.
ధ్యానభంగం కావటంతో హనుమంతుడు గుహలో నుండి బయటకు వచ్చి అంతా పరికించి చూశాడు! ఎవరూ కనబడలేదు! మరింత శ్రద్ధగా చూశాడు. సుదూరంలోని చెట్టు కింద నుండి ఎవరో ఏడుస్తున్నారు! తన ధ్వానాన్ని భగ్నం చేసేంతగా రోదిస్తున్నదెవరో తెలుసుకోవటానికి ఆ చెట్టు కిందికి వెళ్లాడు.
చూడముచ్చటగా ఉన్న ఒక అందమైన బాలుడు చెట్టు కింద కూర్చుని వెక్కి, వెక్కి ఏడుస్తున్నాడు! అంత అందమైన బాలుడు ఏడుస్తుండటం చూసి, హనుమంతుడి గుండె తరుక్కుపోయింది!
‘‘ఏమి జరిగినది బాలకా? ఎందుకలా ఏడ్చుచున్నావు?’’ అడిగాడు హనుమంతుడు.
“నా నగలు, డబ్బు దొంగలు ఎత్తుకెళ్లారు!” అంటూనే బాలుడు ఏడుస్తున్నాడు.
“ఇంత చిన్న వయస్సులో నీ వద్ద నగలు, డబ్బు ఉన్నాయా? అవి ఎంత మొత్తం? ఇంతకూ నీవెవరు?” అన్నాడు హనుమంతుడు.
“నేనెవరో నీకు ఇంకా తెలియదా?” ఆశ్చర్యంగా అడిగాడు బాలుడు.
‘నీవెవరో తెలసినచో అడగవల్సిన అవసరమేమున్నది?” బదులిచ్చాడు హనుమంతుడు.
“నా పేరు రామ్‌లల్లా !” అన్నాడు ఆ అందాల బాలుడు.
“రామ్‌లల్లా అనగా నేమి?” అమాయకంగా అడిగాడు హనుమంతుడు.
“రామ్‌లల్లా అనగా బాలరాముడు. మాది అయోధ్య!” అన్నాడు రామ్‌లల్లా. హనుమంతుడు పెద్దగా నవ్వాడు.
“ఎందుకు నవ్వుతున్నావు! మాది ఆయోధ్య, నేను బాలరాముడినీ!” అన్నాడు రామ్‌లల్లా.
“అయోధ్య రాముడు ఎలా ఉంటాడో చూపిస్తాను చూడు!” అంటూ తన గుండెను చీల్చబోయి ఆగిపోయాడు. తన రాముడిని మనసారా స్మరించాడు హనుమంతుడు .
“సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమ య్యాడు. అందరి శరీరాలపై వజ్ర వైడూర్యములతో బంగారు ఆభరణాలు మెరిసిపోతున్నాయి. ప్రత్యేకించి సీతమ్మ కంఠసీమలో చింతాకు పతకం కాంతులీనుతున్నది.
హనుమంతుడు పరమానంద భరితుడైపోయాడు. రాములవారితో పాటు, సీతామాత, లక్ష్మణ స్వామి దర్శనం కూడా జరిగింది. ఆనందంతో గంతులు వేస్తున్నాడు.తన భక్తుడి ఆనందాన్ని చూసి రాముడు కూడా సంతృప్తి చెందాడు.
కాని రాముడిని, రాముడు ధరించిన నగలను చూసి రామ్‌లల్లా ఆశ్చర్యపోయుడు.
తన వద్ద నగలకన్నా మంచి, మంచి నగలు, ఆభరణాలు ఉన్నాయి!
“మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు!” అని అడిగాడు రామ్‌లల్లా.
“బాలరామా! నన్ను గుర్తించలేదా? నేను భద్రాద్రిరాముడను, నేనే శ్రీరామ చంద్రుడిని!” అన్నాడు రాముడు.
ఒకపక్క హనుమంతుడు, మరోపక్క రామ్‌లల్లా ఆశ్చర్య పోయారు.
“నా రాముడు అయోధ్యకు రాజు! ఇప్పుడేమిటి కొత్తగా భద్రాద్రి రాముడినని చెబుతున్నాడు!’’ అని హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.
తనను గుర్తించలేదా! అని రాముడిగా పిలువబడుతున్న వ్యక్తి అడుగుతున్నాడు! తనకేమో ఆయన్ను ఎక్కడో చూసినట్లుంది కాని ఎవరో తెలియటం లేదు అని రామ్‌లల్లా ఆశ్చర్యపోయాడు.
శ్రీరామచంద్రుడు చిన్నగా నవ్వాడు.
“నేను శ్రీరాందుచంద్రుడిని, అయోధ్యకు రాజును. అయితే ఈ రామ్‌లల్లాను అయోధ్యలో గుడి నిర్మించి, అక్కడ నెలకొల్పారు. ఈ బాల రాముడు నేను ఒక్కరేనని ప్రచారం చేస్తున్నారు. ఈ రామ్‌లల్లాను ఆయోధ్యలో నెలకొల్పిన తర్వాత నేను భద్రాచలంలో నివసిస్తున్నాను” అన్నాడు రాముడు.
“నేను బాలరాముడిని, నీవు రాముడివి అయితే నీవు నేను ఒకటి కాదా? నీవు ఆయోధ్యను విడిచి, భద్రాచలం ఎందుకు వెళ్లావు! ఇప్పుడేమో నా కోసం ఇచ్చిన డబ్బులు, నగలు, ఆభరణాలు అంతా దొంగలు ఎత్తుకెళ్లారు! ఏమిటి ఇదంతా?” అడిగాడు రామ్‌లల్లా.
హుమమంతుడు కూడా ఆ ప్రశ్నలకు బదులివ్వమన్నట్లు చూశాడు.
‘‘నీవు, నేను ఒక్కటి కానే కాదు! నా అవతారానికి ఒక లక్ష్యం ఉన్నది. నీవు నా యొక్క రూపానివి మాత్రమే! నిన్ను ప్రతిష్టించిన వారు, నిన్ను ఉపయోగించుకుంటున్నారు! వారికి నిజంగా నీ మీద భక్తి లేదు. నీ పేరు మీద అధికారాన్ని, డబ్బును పొందుతున్నారు. అందుకే వందల కోట్ల రూపాయలు, కిలోల కొద్దీ బంగారం దొంగలు ఎత్తుకుని పోయినా వారు నోరు మెదపటం లేదు! దొంగలను పట్టుకునే విధంగా చర్యలు తీసుకోవటం లేదు! అసలు దొంగతనం జరగకుండా ఉండటమే అసలైన భక్తి!” అన్నాడు రామచంద్రుడు.
“నీవు గందరగోళంగా మాట్లాడుతున్నావు! గుడి కట్టింది నా భక్తులే అంటావు, నన్ను ప్రతిష్టించిందీ వారేనంటావు! మరి దొంగలను పట్టుకోవటం లేదంటావు! దొంగలు చేసిన దానిని నా భక్తులను విమర్శి స్తున్నావు! ఇది దేశ ద్రోహం లాగా భక్త ద్రోహం అవుతుంది!” అన్నాడు రామ్‌లల్లా.
రాముడు మరోసారి నవ్వాడు.
“చూశావా! నీకూ నిన్ను ప్రతిష్టించిన వారి భాష వంటబట్టింది! దేశద్రోహం, భక్తద్రోహం అంటున్నావు. భక్తి ఉన్న చోట దొంగతనం జరగదు అన్నాను. తిరుపతిలో ప్రతిరోజూ కోట్లాది రూపాయలు, కిలోల కొద్దీ బంగారం వేంకటేశ్వరుడి హుండీలో భక్తులు వేస్తుంటారు! కాని దొంగతనం జరగటం లేదు, ఆసలైన భక్తికి మరో ఉదాహరణ చెప్పనా?” అడిగాడు రాముడు.
చెప్పమన్నట్లు చూశాడు రామ్‌లల్లా.
“భద్రాచలంలో తహసీల్దారుగా పనిచేస్తున్న గోపన్న ఆనాడు ప్రజలు నైజాం ప్రభుత్వానికి కట్టిన పన్నులతో నాకు, సీతకు నగలు, ఆభరణాలు చేయించాడు! అందుకే రామదాసు అయ్యాడు. రామదాసును హింసించినా, అది ప్రజల సొమ్ము దేవుడికి పెట్టాను తప్పేమిటి అని ఎదురు తిరిగాడు. అందుకే నేను, లక్ష్మణుడు రామదాసును చెర నుండి విడిపించాము! అది అసలైన భక్తి” అన్నాడు రాముడు.
పూర్తిగా అర్థం కాలేదన్నట్లు చూశాడు రామ్‌లల్లా.
భక్తి ఒకటే! గాని భక్తులు మాత్రం రెండు రకాలు, దేవుడి కోసం సర్వస్వం త్వాగం చేసి, భగవంతుడిలో కలసిపోవాలనుకునేవారు ఒక రకమైన వారు! దేవుడి పేరు మీద అన్నీ స్వాహా చేస్తూ, దేవుడినే తనలో కలిపేసి, తానే భగవదాంశ సంభూతుడినని, అలౌకిక శక్తినని చెప్పుకునే వారు రెండవ రకం! గత కొంత కాలంగా రెండవ రకం భక్తులు పెరిగిపోయారు, అందుకే అయోధ్యను విడిచి మొదటికోవకు చెందిన భక్తులున్న దక్షిణాపథానికి వచ్చి, భద్రాచలంలో కొలువుంటున్నాను!” అంటూ వివరించాడు రాముడు.
“అంటే నా డబ్బు, ఆభరణాలు తిరిగిరావా?” అడిగాడు రామ్‌లల్లా.
“ప్రస్తుతం నీ డబ్బు, ఆభరణాల కన్నా, నీ పేరు మీద జరుగుతున్న మోసాలను గుర్తించు. నీ పేరు మాటున నీ భక్తులైన ప్రజలను దోచుకుంటున్న తీరును తెలుసుకో!
నీ భక్తులమని చెబుతున్నవారే నీ ఆలయంలో దొంగతనానికి ఒడిగట్టారంటే, నీ కన్నా డబ్బు, నగల మీద వారికింత ఆపేక్ష ఉందో అర్థం చేసుకో. నిన్ను ఆసరాగా చేసుకుని అందలమెక్కినవారు, ఈ రోజు నీ గుళ్లో జరిగిన దొంగతనం గురించీ, ఒక్క మాట మాట్లా డటం లేదంటే, వారి భక్తిలోని మర్మమేమిటో తెలుసుకో, ఇవన్నీ అర్థమైననాడు, నీవు రామ్‌లల్లా నుండి భక్తి రాముడివి అవుతావు. అసలు నీవు కూడా అయోధ్యను తప్పక వీడతావు!’’ అంటూ సీతారామలక్ష్మణులు అంతర్థానమయ్యారు.
– ఉషాకిరణ్
‘భక్త’ద్రోహం!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



