‘‘బాజీచా – ఎ- అత్ఫాల్ హై
దునియా మేరే ఆగే
హోతా హై షబ్ – ఓ – రోజ్
తమాషా మేరే ఆగే!’’ అంటాడు మీర్జా గాలిబ్. అంటే,
‘‘నాముందు ఈ ప్రపంచం ఒక పిల్లల ఆట స్థలం, రాత్రింబవళ్లు నా ఎదుట ఒక కొత్త నాటకం ప్రదర్శింపబడుతోంది’’ అని దాని భావం. గాలిబ్ మొగల్ సామ్రాజ్యపు చివరి దశకు చెందిన ప్రసిద్ధ ఉర్దూ, పర్షియన్ కవి. అనేక జీవిత సత్యాలను, జీవన తాత్వికతలను తన శాయరీ, గజల్స్ ద్వారా సాహిత్య రంగానికి అందించాడు. ఆయన చెప్పినట్లుగానే రోజుకో కొత్త నాటకాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు నేటి మతతత్వవాదులు.
ఇక్కడ మన హైదరాబాద్‌లోనే ప్రసిద్ధుడయిన మఖ్దూం మొహియుద్దీన్ ఉర్దూ మహాకవి. ఇక్కడి సామాన్య ప్రజల విముక్తి కోసం కవిత్వం రాసి, పాటలు కట్టి, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడాడు. ‘‘ఏ జంగ్ హై జంగే ఆజాదీ, ఆజాదీ కే పర్చమ్ కే తలే, హం హింద్ కే రహ్నే వాలోం కి- మజ్దూరోంకి సారా సంసార్ హమారా హై, పూరబ్ పశ్చిమ్, ఉత్తర్, దక్కన్, హం అమెరికీ, హం ఆఫ్రికీ, హం చీనీ జాం బాజానే వతన్’’ ఈ ప్రపంచమంతా మాదే అంటూ అంతర్జాతీయ గీతాన్ని రాశాడు ఉర్దూలోనే. వీళ్ల శాయరీలను, గజల్స్‌ను, మన దాశరథి, గజ్జెల మల్లారెడ్డి మొదలైన వాళ్లు తెలుగు చేసి మనకందించారు. అవి ఇప్పటికీ మనల్ని కదిలిస్తూనే ఉన్నాయి.
షోయబుల్లాఖాన్ ఈ తెలుగు నేలపైనే అక్షర స్వేచ్ఛను కాపాడటం కోసం రాజీలేని పోరాటం చేసి ప్రాణాల ర్పించాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పండితుడు సామల సదాశివ ఉర్దూ సాహిత్య, సంగీత స్వారస్యాన్ని అవపోసన పట్టి తెలుగు సమాజానికి కానుక చేశాడు. భాషా మాధుర్యాలను హృదయం నిండా ఆస్వాదించారు. ఇవన్నీ భాషకు మతాన్ని అంటగట్టడం ఎంతటి అవివేకమో తెలపడానికి ఉదాహరణలుగా ఇస్తున్నాను.
ఉర్దూ మన దేశంలో ఉద్భవించిన భాష. భారతదేశ చరిత్ర, సాహిత్యం సంస్కృతిలో భాగమైనది ఉర్దూ భాష. దాన్ని ఏదో ఒక రాష్ట్రానికి, ప్రాంతానికి, మతానికి పరిమితం చేయటం మూర్ఖత్వంతో కూడుకొన్నది. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన..సంఘటన, భాషకు, మతాన్ని ఆపాదించి, పెద్ద రగడనే సృష్టించారు. వాళ్లు అంతే చేస్తారు. ఏదో పేరు చెప్పి మత ఉద్వేగాలను రెచ్చగొట్టి ప్రజలను విభజించడం, వైరుధ్యం సృష్టించడం, విద్వేషాగ్నులను పెంచి అధికారంలో కొనసాగడం వారి వ్యూహంలో ఒక భాగం. వారికి చరిత్ర, సంస్కృతికి సంబంధించిన వాస్తవిక జ్ఞానం బొత్తిగా ఉండదు. వక్రీకరణల వక్ర బుద్ధి తప్ప.
ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక టీచరు ఉర్దూ బోధిస్తున్నాడని తెలుసుకుని సంఘీయులు, బీజేపీ గుంపు పాఠశాలలోకి వెళ్లి ప్రిన్సిపాల్‌పై భౌతిక దాడికి పూనుకున్నారు. అదీ పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. విద్యార్థుల ఎంపికలో ఆ భాష లేనట్లయితే, కంప్లయింట్ చేయవచ్చు. ప్రశ్నించవచ్చు. కానీ వీళ్ల ఉద్దేశ్యము ఏమిటంటే ఉర్దూ అనేది ముస్లింల భాష అనీ, దాన్ని బోధించడం నేరమయినట్లు ఒక విద్వేష తగాదాను సృష్టించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు భాషాపరమైన చర్చనూ చేస్తున్నారు. ఉర్దూ నేర్చుకుంటే, బిర్యానీ తింటే మతం మారిపోతారని భావించడం మూర్ఖత్వంతో కూడిన భావన. ఇంగ్లీష్ మాట్లాడితే క్రిస్టియన్లమై పోయేదుంటే, ఇప్పటికి ఎందరు క్రిస్టియన్లుగా మారేవారో కదా! భాషా సంస్కృతులలో ఆదాన ప్రధానాలు ఉంటాయి. కొన్ని సంప్రదా యాలూ ఉంటాయి తప్ప, మతం ఆధారితంగా భాష ఉండదు. అయినా మన రాష్ట్రంలో తెలుగు, ఉర్దూ భాషలు, ప్రభుత్వం గుర్తించిన అధికార భాషలు. ఎవరేది నేర్చుకుంటారు అనేది వారి భాష ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. ఉర్దూ బోధిస్తే నేరం అన్నట్లు మాట్లాడటం, దాన్ని కేవలం మదరసాల లోనే బోధించే భాషగా చూడటం అన్యాయం.
‘ఉర్దూ ఒక భారతీయ భాష. అది దేశం వెలుపల పుట్టలేదు’ అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి చెప్పాడు. ‘‘ఉర్దూ మన సొంత భాష. అది ఇక్కడే పుట్టింది. దాన్ని ముస్లింగా మార్చకండి’’ అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఉర్దూ రాని ముస్లింలు ఎందరో ఉన్నారు. చాలామంది ముస్లింలకు తెలుగు వస్తుంది ఉర్దూ రాదు. వాళ్లందరు హిందువులై పోతారా! పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో చాలామందికి ఉర్దూ రాదు, పంజాబీ, బంగ్లా మాట్లాడుతారు. గల్ఫ్ దేశాలలో సైతం అరబిక్, టర్కిష్, పర్షియన్ భాషలు మాట్లాడుతారు. భాష అనేది, ప్రజలు ఒకరితో ఒకరు సంబంధం పెట్టుకోవడానికి, ఒకరి భావాలు ఒకరు చెప్పుకుని, ఒకరి నొకరు తెలుసుకోవడానికి సామాజిక ఉత్పత్తి ప్రక్రియలో సాధనంగా ఆవిర్భవించింది. మానవ వికాస క్రమానికి, భావాభివృద్ధికి భాష దోహదం చేస్తుంది. తప్ప ఒక మతాన్ని ప్రతిబింబించదు. జీవన విధానంలో మానవ సమూహాల మధ్య పరస్పర కలబోతలకు సాధనంగా భాష ఉంటుంది.
పదిహేడు భాషలు నేర్చుకున్న పి.వి. నరసింహారావు, నలిమెల భాస్కర్ హిందువు కాకుండా పోయారా? తెలుగు నేర్చుకున్న బ్రౌను హిందువై పోయారా? మన దేశంలో వందలాది భాషలు మాట్లాడే ప్రజలున్నప్పటికీ, అనేక సాంస్కృతిక సంప్రదాయ వైవిధ్యాలున్నప్పటికీ ఇంతకాలంగా సమైక్యంగానే ఉన్నాము కదా! భాషా పరిమళాలను ఆస్వాదించాలే కానీ మతద్వేషాలను రగల్చకూడదు.
గుల్‌మొహర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



