గ్రామ పంచాయితీ ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేస్తున్న సర్పంచ్
నవతెలంగాణ – బోనకల్
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ గ్రామం తో పాటు పలు గ్రామాల ప్రజలను వానరాలు గత కొన్ని సంవత్సరాలుగా ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ప్రధానంగా బోనకల్ చిరునోముల రావినూతల తదితర గ్రామాలలో వానరాలు వందల సంఖ్యలో ఉన్నాయి. మండల కేంద్రంలో వానరాలతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇళ్లల్లో ఉన్న ఆహార పదార్థాలను వస్తువులను దుస్తులను ఎత్తుకెళుతున్నాయి. చిన్నపిల్లలపై పడి కరుస్తున్నాయి. రోడ్డు వెంట వెళ్తుంటే కొన్ని కోతులు వెంటబడి కరుస్తున్నాయి.
మండల కేంద్రానికి వివిధ రకాల పనులపై వచ్చే ప్రజల వెంటపడుతూ వానరాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ప్రజలు కూరగాయలు, పండ్లు తీసుకెళ్తున్న, చేతిలో కవర్లు, సంచులు ఉన్న బలవంతంగా మీద పడి లాక్కొని పోతున్నాయి. ఈ క్రమంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తనను గెలిపిస్తే బోనకల్ గ్రామంలో కోతుల బెడదను నివారిస్తానని సర్పంచ్ బానోతు జ్యోతి ఉపసర్పంచ్ బానోతు కొండ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం విజయవాడకు చెందిన కోతులను పట్టేవారితో సర్పంచ్ బానోత్ జ్యోతి ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒక్కొక్క కోతిని పట్టేందుకు రూ. 300 రూపాయలు చొప్పున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం మంగళవారం సుమారు 250 కోతులను పట్టుకున్నారు. ఇటీవల కాలంలో బోనకల్ లో వానరాల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామస్తులు వానరాల సమస్యను గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లగా బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి ఉపసర్పంచ్ బానోతు కొండ, పాలకవర్గ సభ్యులు స్పందించారు. సర్పంచ్, ఉపసర్పంచ్ బానోతు జ్యోతి, కొండ ఆధ్వర్యంలో కోతులను పట్టే వారిని పిలిపించారు. కోతులను పట్టిస్తున్నారు. అయితే కొన్ని కోతులు బోనులోకి వచ్చినట్లే వచ్చి భయంతో పారిపోతున్నాయి.
కొన్ని కోతులు మాత్రం ఆహారం కోసం వచ్చి బోనులో చిక్కుతున్నాయి. ఒక్క రోజుతో వానరాలను పట్టుకోలేమని విజయవాడకు చెందిన కోతులు పట్టే వారు చెప్తున్నారు. కోతులు పట్టే సందర్భంలో కొన్ని కోతులు భయంతో బోనులోకి రావని అటువంటి వాటికి కొంత సమయం ఇచ్చి మరల ప్రయత్నం చేయాలని కోతులు పట్టే వారు చెప్తున్నారు.ఈ సందర్భంగా బోనకల్ సర్పంచ్ బానోతు జ్యోతి, ఉపసర్పంచ్ కొండ మాట్లాడుతూ కోతులను పట్టించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని, ఈ ఖర్చు పంచాయతీ ఖర్చు కింద రాదని, గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, వారి అభ్యర్థన మేరకు కోతులను పట్టించడం జరుగుతుందని తెలిపారు.
ఇది భారీ ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అన్నారు. బోనకల్ గ్రామంలో కోతుల నివారణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు వస్తుందని దాతలు సహకరించాలని వారు కోరారు. తమ శక్తి మేరకు వానకాల గ్రామంలో వానరాలను నివారించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పట్టుబడిన వానరాలను సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పరిశీలించారు.ఈ కార్యక్రమంలో బోనకల్ గ్రామ పెద్దలు గుండపనేని సుధాకర్ రావు, తెల్లాకుల శ్రీనివాసరావు, మోర్ల శ్రీనివాసరావు, తేళ్లూరి రమేష్, మరీదు శివ, అంతోటి రవి ప్రసాద్, యార్లగడ్డ రమేష్, జరుపుల శివకృష్ణ, షేక్ బాజీ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు మరీదు శేషు, అంతోటి శ్రీను, అంతటి సునీత, షేక్ మీరా సాహెబ్, జరపల లావణ్య, ఉప్పర శ్రీను తదితరులు పాల్గొన్నారు.



