ఓటర్ల ఎన్యూమరేషన్ పై
ప్రజల్లో అవగాహన కల్పించాలి : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల ఎన్యూమరేషన్ (సర్) ప్రక్రియను మరో నెల రోజులపాటు పొడిగించాలని ఎన్నికల కమిషన్‌ను సీపీఐ(ఎం) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఎన్యూమ రేషన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం, గందరగోళం నెలకొని ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఫారాలు కేవలం 30 శాతం మందికి కూడా చేరలేదని, ఇంకా 70 శాతం మందికి అందాల్సి ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ప్రజలు ఈ ప్రక్రియపై దృష్టి సారించడం కష్టంగా మారిందని తెలిపారు. ఎన్యూమరేషన్ ప్రక్రియ పట్ల సామాన్య ప్రజల్లో సరైన అవగాహన లేదనీ, ఫారాలు నింపే విషయంలో ప్రజలు అనేక అనుమానాలు, అపోహలకు లోనవుతు న్నారన్నారు. కొంతమంది బీఎల్‌వోలు ఇంకా పూర్తిస్థాయిలో పనిలోకి దిగలేదని వివరించారు. ఓటర్ల అనుమానా లను నివృత్తి చేసే విషయంలో కొంత అవగాహన లోపం కనిపిస్తుందనే ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల వివరాలను నమోదు చేసి బీఎల్‌వోలకు అందజేయడానికి మరింత సమయం అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ వెంటనే గ్రామస్థాయిలో పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అపోహలను తొలగించి, ‘సర్’ ప్రక్రియను సరళతరం చేయాలని వెస్లీ విజ్ఞప్తి చేశారు. వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, ఎన్యూమరేషన్ గడువును మరో నెల రోజుల పాటు, అంటే ఆగస్టు 30 వరకు పొడిగించాలని ఆయన కోరారు.


