Monday, July 6, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమెట్రోపై ప్రత్యేక చొరవ చూపండి

మెట్రోపై ప్రత్యేక చొరవ చూపండి

- Advertisement -

తెలంగాణకు ఫేజ్‌-1
అప్పగింతలో వేగం పెంచాలి
ఫేజ్-2 నిర్మాణానికి తక్ష‍ణమే అమోదం తెలపాలి
ఎస్‌బీఐ క్యాప్స్‌ను తక్షణమే నియమించండి
ఆలస్యమయ్యేకొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం
కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌‌రెడ్డి వేర్వేరు లేఖలు

‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
హైదరాబాద్‌ మెట్రో రైలు ‌విస్తరణకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌‌లాల్‌ ‌ఖట్టర్‌, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. మెట్రో ఫేజ్‌-1ను తెలంగాణకు బదిలీ చేసే విషయంలో వేగం పెంచాలనీ, ఫేజ్‌-2 నిర్మాణానికి తక్ష‍ణమే ఆమోదం తెలపాలని ఆయన విన్నవించారు. ఎస్‌‌బీఐ క్యాప్స్‌‌ను తక్ష‍ణమే నియమించాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసే కొద్దీ మెట్రో రైలు ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మనోహర్‌‌లాల్‌ ‌ఖట్టర్‌, జి.కిషన్‌‌రెడ్డిలకు సీఎం రేవంత్‌‌రెడ్డి ఆదివారం వేర్వేరుగా లేఖలు రాశారు. గత నెల 23, 24 తేదీల్లో కిషన్‌‌రెడ్డి సమక్ష‍ంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, మనోహర్‌‌లాల్‌ ‌ఖట్టర్‌‌తో జరిగిన సమావేశాల్లో హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 బదిలీ, ఫేజ్-2 విస్తరణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, వాటిల్లో ఏ ఒక్కటీ అమల్లోకి రాలేదని సీఎం ఎత్తిచూపారు. ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్‌బీఐ క్యాప్స్)కు హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసేందుకు అవసరమైన ఆర్థిక పరిశీలన బాధ్యతలు అప్పగించేందుకు అంగీరించిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రస్తుతమున్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే రీఫైనాన్సింగ్ అవకాశాలను కూడా ఎస్‌బీఐ క్యాప్స్ పరిశీలించాలంటూ నిర్ణయించిన విషయాన్ని ప్రస్తావించారు. మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి భారీ స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతాయని వివరించారు. అందుకే అదే సంస్థ ద్వారా అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాలు, నిధుల సమీకరణ మార్గాలు, ప్రాజెక్టు అమలుకు కావాల్సిన ఆర్థిక వ్యూహాన్ని రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిపారు. ఈ ప్రక్రియ కోసం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను వెంటనే ఖరారు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మున్సిపల్ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించినట్టు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్రం ఎస్‌బీఐ క్యాప్స్‌ను అధికారికంగా నియమించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి పంపలేదని గుర్తుచేశారు.

దీంతో మెట్రో ఫేజ్-1 బదిలీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందనీ, రోజువారీ నిర్వహణలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌‌బీఐ క్యాప్స్‌ జాప్యం వల్ల మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు కేంద్ర అనుమతులు కూడా ఆలస్యమవుతున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల నిధుల సమీకరణ ముందుకు సాగట్లేదనీ, ప్రాజెక్టు ప్రారంభం మరింత ఆలస్యమవుతున్నదని తెలిపారు. ఇలా ఆలస్యమయ్యే కొద్దీ ధరల పెరుగుదల, వడ్డీ భారం, నిర్మాణ సామగ్రి వ్యయం పెరగడం వంటి కారణాలతో ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటనీ, పెరుగుతున్న జనాభా, వాహనాల రద్దీ, విస్తరిస్తున్న నగర పరిధి, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే మెట్రో విస్తరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఫేజ్-1 బదిలీ పూర్తయి, ఫేజ్-2 వేగంగా అమలైతే నగర ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా నగరాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు మనోహర్‌‌లాల్‌ ‌ఖట్టర్‌, కిషన్‌‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత శాఖలతో సమన్వయం చేయాలని సీఎం కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -