Monday, July 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఖమ్మం విజయ డెయిరీ తాత్కాలికంగా మూత

ఖమ్మం విజయ డెయిరీ తాత్కాలికంగా మూత

- Advertisement -

లో’పాలు’ చక్కదిద్దేందుకేనట..!
ప్యాకింగ్ ప్లాంట్ క్లోస్.. హైదరాబాద్ కు మిల్క్
డిమాండున్న ప్రాంతం కావటంతో మనుగడపై సందేహాలు
ఆధునికీకరణ తర్వాత తెరుస్తామంటున్న చైర్మెన్ గుత్తాx

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
​ ఏ ప్రభుత్వం వచ్చినా ఖమ్మం విజయ డెయిరీ ప్రస్తావన ఐదేండ్ల కాలంలో ఒక్కసారైనా ఉండాల్సిందే. డిమాండ్ ఉన్న ప్రాంతంలో ఈ డెయిరీ ఉండటంతో ‘పెద్దల’ కన్ను దీనిపై పడాల్సిందే..! యాభై ఏండ్ల చరిత్ర కలిగిన డెయిరీని సరిపడా పాల సేకరణ లేదనే కారణంతో ప్యాకింగ్ ప్లాంట్‌‌ను జూన్ 30న మూసివేశారు. సేకరించిన పాలను హైదరాబాద్‌‌కు తరలిస్తామని చెబుతున్నారు. రకరకాల లో’పాల’ను చూపించి దీనిని తరలించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ జిల్లాకు రవాణా చేయటం వ్యయ ప్రయాసలతో కూడుకొని ఉన్నది. పాలు తక్కువ వస్తున్నాయని, ప్లాంట్‌‌లోని లోపాల కారణంగా సేకరించిన కొద్ది పాలు కూడా దుర్వాసన వస్తున్నాయనే సాకుతో ప్రభుత్వం ఈ తతంగం నడుపుతోంది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలలకు పంపిణీ చేసే విజయ డెయిరీ పాలు పగిలిపోతున్నాయని చైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు.

​​రెండునెలల పాటు మూత..
జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మంలో విజయ డెయిరీని ప్రారంభించారు. దాదాపు 50 ఏండ్ల క్రితం నెలకొల్పిన ఈ డెయిరీలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో పదేండ్ల క్రితం మోడ్రన్ మిషనరీని అమర్చారు. ఈ యంత్రాలను ఎప్పటికప్పుడూ సర్వీసింగ్ చేయాల్సి ఉంటుంది. అలా సర్వీసింగ్ చేస్తున్నా చిన్నచిన్న లోపాలు తరచూ తలెత్తుతున్నాయనే కారణం ఒకటైతే… సరిపడా రైతుల నుంచి పాలు రావటం లేదని మరో సాకు చూపుతున్నారు. ఈ యంత్రాల మరమ్మతులకు సుమారు రెండు నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. అప్పటివరకు హైదరాబాద్‌‌కు పాలను తరలించి.. అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటామని చెబుతున్నారు. దీనివల్ల రవాణా ఖర్చులు అధికమయ్యే ఆస్కారం ఉంది. లీటర్ కు రూ.7 చొప్పున డిస్ట్రిబ్యూటర్లకు రవాణా నిమిత్తం ప్రస్తుతం ఇస్తున్నామని, అదే రేటుతో వారు తిరిగి హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి చేరుస్తున్నారని డెయిరీ డీడీ రవికుమార్ అంటున్నారు. కంపెనీ నుంచి నిష్ణాతులు వచ్చి మరమ్మతులు చేయటానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని చెప్తున్నారు.

​సరిపడా పాలు రావట్లేదట..!
డెయిరీకి సరిపడా పాలు రావట్లేదనే మరో కారణాన్ని కూడా చూపుతున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌కు రోజుకు 7000 లీటర్ల పాలు అవసరం ఉండగా.. ప్రస్తుతం 3500 లీటర్లు మాత్రమే జిల్లాలో సేకరించగలుగుతున్నామని అధికారులు అంటున్నారు. ప్రస్తుత సమయంలో అత్యధికంగా గేదెలు సూడితో ఉంటాయని, సెప్టెంబర్ చివరి వరకూ అత్యధికం ఈని పాలిచ్చేదశకు చేరుతాయని, ఆ లోగా మిషనరీ మరమ్మతులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని డీడీ అంటున్నారు. ప్లాంట్‌‌లో లోపాల కారణంగా పాలు విరుగుతున్నాయని, దుర్వాసన వస్తున్నాయని చైర్మెన్‌ అంటున్నారు.

​సరిపడా ధర ఇవ్వనందునే అరకొర సేకరణ
జిల్లాలో పాడి ఉత్పత్తి ఆశాజనకంగా ఉన్నా ప్రయివేట్ కంపెనీలు ఇచ్చే ధరతో పోలిస్తే విజయ డెయిరీ చెల్లించే రేటు తక్కువ కావడంతో రైతులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. పైగా ప్రయివేట్ కంపెనీలు వారానికి ఒకసారి పేమెంట్ చేస్తుండగా.. విజయ డెయిరీ మాత్రం నెలకు ఒక్కసారి పేమెంట్ చేయడం కూడా సమస్యగా మారింది. లీటర్‌‌కు ప్రస్తుతం విజయ డెయిరీ రూ.84.50 చెల్లిస్తోంది. లీటర్‌‌కు రూ.3 బోనస్ చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రభుత్వం ఇప్పటివరకు దాని ఊసు లేదు. ఉన్న ఈ డెయిరీనే నడిపించలేని ప్రభుత్వం మధిరలో ఇందిరా మహిళా డెయిరీ పేరుతో మరో డెయిరీని నెలకొల్పేందుకు స్థలం సేకరిస్తుండటం గమనార్హం.

అయోమయంలో వేలాది మంది రైతులు
విజయ డెయిరీ మూసివేతతో రైతులు అయోమయంలో పడ్డారు. డెయిరీ మూతతో పాల సేకరణపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీనిపై ఆధారపడిన వందలాది మంది రైతులు, కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఖమ్మంలో విజయ డెయిరీ వైరా రోడ్ లో ఉంది. 12 ఎకరాల స్థలంలో అది నెలవై ఉన్న ప్రాంతం ఎంతో విలువైనది కావడంతో దీనిని ఏదో ఒక రకంగా మూసివేసి ప్రత్యామ్నాయంగా వినియోగించాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఎప్పటినుంచో ఉందనే వాదన వినిపిస్తోంది. గజం ఇక్కడ రూ.లక్ష వరకూ పలుకుతోంది. మొత్తం ఈ స్థలం విలువ రూ.500 కోట్ల పైమాటే.

పాల పెంపునకు చర్యలేవి? : బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి
​కారణాలు ఏవైనా డెయిరీ నిర్వహణ సరిగా లేదు. పదేండ్ల క్రితం అమర్చిన యంత్రాలు అప్పుడే మరమ్మతులకు రావడంపై అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం సరైన రేటు ఇవ్వటంతో పాటు వారానికోసారి చెల్లింపులు చేస్తే రైతులు ప్రభుత్వ డెయిరీపై ఆసక్తి చూపుతారు. హైదరాబాద్‌ నుంచి పాలు దిగుమతి చేసుకోవడం రవాణా పరంగా వ్యయప్రయాసలతో కూడుకొని ఉన్నది. దీనివల్ల నష్టాలు పెరుగుతాయి తప్ప ఏరకంగానూ ఉపయోగం జరగదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -