Wednesday, July 8, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్రానికి ఎదురుదెబ్బ‌

కేంద్రానికి ఎదురుదెబ్బ‌

- Advertisement -

సీజేపీ ఎక్స్ ఖాతాను త‌క్ష‌ణ‌మే పున‌రుద్ధ‌రించాలి
కేంద్ర ప్రభుత్వ అభ్యంతరాల్లో అర్థం లేదు : ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్ర‌భుత్వానికి ఢిల్లీ హైకోర్టుల్లో ఎదురుదెబ్బ త‌గిలింది. మ‌రోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి భారీ ఊరట లభించింది. కేంద్రం నిషేధించిన ఆ పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ఖాతాను త‌క్ష‌ణ‌మే తిరిగి పునరుద్ధరించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. నీట్‌ పరీక్షపై ఆ పార్టీ ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులతో ఇప్పుడు వచ్చే ఇబ్బందేమీ లేదని, ఆ పరీక్ష పూర్తైనందున ఏ సమస్య ఉండదని, అందువల్ల ఎక్స్ ఖాతా తిరిగి పునరుద్ధరించాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం స్ప‌ష్టం చేశారు. మే 15న ప్రారంభించిన ‘ఎక్స్’ ఖాతాకు ప్రజల నుంచి విస్తృత ఆమోదం లభించడంతో మే 21న దానిని నిషేధించారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశంలో మే 29న హైకోర్టు కేంద్రానికి, ఎక్స్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సీజేపీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయడంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్ధించుకుంది. ‘‘సిజెపి ఎక్స్ ఖాతాలో ఆ పార్టీ నీట్ పరీక్షపై పలు పోస్టులు చేసింది.

ఇప్పటికే పేపర్ లీకేజీతో ఆందోళనతో ఉన్న విద్యార్థుల్లో సీజేపీ పోస్టులు ఇంకా గందరగోళాన్ని క్రియేట్ చేసేలా ఉన్నాయి. మరింత అభద్రతకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ పార్టీ ఎక్స్ ఖాతాను బ్లాక్ చేశాం’’ అని కేంద్రం తెలిపింది. ఆ పార్టీ పోస్టులు పరీక్ష ప్రక్రియకు భంగం కలిగించే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. నీట్ పరీక్ష ముగిసిన నేపథ్యంలో, ఈ అకౌంట్‌పై కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. నీట్ ఎగ్జామ్స్ పూర్తయిన ప్రస్తుత తరుణంలో, సదరు పార్టీ సోషల్ మీడియా ఖాతాను ఇంకా హోల్డ్‌లో ఉంచడం లేదా నిషేధాన్ని కొనసాగించడంలో ఎలాంటి అర్థం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. పరీక్షల నిర్వహణ సమయంలో శాంతిభద్రతలు లేదా ఇతర సాంకేతిక కారణాల దృష్ట్యా ఆంక్షలు విధించినప్పటికీ, ఇప్పుడు వాటిని పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

ఇప్పుడు నీట్ పరీక్షకు సంబంధించిన పరిస్థితులు మారిపోయాయని, పైగా పరీక్ష కూడా పూర్తైంది కాబట్టి ఇకపై ఎలాంటి గందరగోళానికి తావులేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇప్పటి పరిస్థితుల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎలాంటి భయాలు ఉండవని కోర్టు చెప్పింది. ఇప్పుడు కూడా సిజెపి ఎక్స్ ఖాతాను బ్లాక్ చేయడం న్యాయం కాదని పేర్కొంది. వీటిని పరిగణనలోకి తీసుకుని సీజేపీ ఎక్స్ ఖాతాను తిరిగి పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో సిజెపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నిషేధం ఎత్తివేసిన తరువాత‌, ఎక్స్‌ ఖాతా తిరిగి వచ్చింది. ఆ ఖాతాకు 2.24 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. నిషేధం తర్వాత కొత్తగా ప్రారంభించిన ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ అనే ఎక్స్‌ ఖాతాకు 2.83 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇదొక విజయం
‘‘మా ఎక్స్‌ ఖాతా జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొంటూ ప్రభుత్వం దానిని నిషేధించింది. అయితే, విద్యార్థులలో ఆందోళన కలిగిస్తున్నందున ఈ చర్య తీసుకున్నామని అదే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు అసంబద్ధంగా ఉన్నాయి’’ అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై స్పందిస్తూ, సీజేపీకి, ఉద్యమానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు, డిజిటల్ హక్కులకు ఇది “ఒక పెద్ద విజయం” అని అభివర్ణించారు.

సీజేపీ ఉద్య‌మానికికు ఎస్కేఎం నేత‌లు సంఘీభావం
నీట్ ప‌రీక్ష ప‌త్రం లీక్‌, సీబీఎస్ఈ అవ‌క‌త‌వ‌క‌లకు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహిస్తున్న ఉద్య‌మానికి సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేత‌లు సంఘీభావం తెలిపారు. నిరాహార దీక్ష చేస్తున్న ప‌ర్యావ‌ర‌ణ కార్య‌క‌ర్త‌ సోనమ్ వాంగ్‌చుక్‌తో కూడా నాయకులు మాట్లాడారు. మంగ‌ళ‌వారం జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద జ‌రుగుతున్న‌ ఆందోళన ప్ర‌దేశాన్ని ఎస్కే ఎం నేత‌లు హన్న‌న్‌ మొల్లా, పి. కృష్ణప్రసాద్, పుష్పేంద్ర త్యాగి, రాజన్ క్షీర సాగర్, దలీజీత్ సింగ్ దాగర్, పురుషోత్తం శర్మ, మనీష్ భారతి, రాజ్ బాల యాదవ్, శశికాంత్, అర్జున్ ప్రసాద్ సింగ్, విమల్ త్రివేది, కుల్దీప్ సింగ్, చరణ్ సింగ్, అనురాగ్ చౌహాన్, దల్జీత్ సింగ్ సంద‌ర్శించారు. దేశంలోని రైతాంగం త‌ర‌పున త‌మ పూర్తి మ‌ద్ద‌తు విద్యార్థులు, యువ‌త నాయ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ ఉద్య‌మానికి ఉంటుంద‌ని రైతు నేత‌లు స్ప‌ష్టం చేశారు.

మా డిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళనే
జంతర్ మంతర్ వద్ద జూన్ 20న ప్రారంభమైన సీజేపీ ఆందోళ‌న‌ మంగళవారంతో 18 రోజులు పూర్తి చేసుకుంది. అలాగే వాంగ్‌చుక్‌తో పాటు విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్షప‌ది రోజులు పూర్తి చేసుకుంది. మంగ‌ళ‌వారం జోరు వ‌ర్షంలో ఆందోళ‌న కొన‌సాగింది. వంద‌లాది మంది విద్యార్థులు, యువ‌త జోరువ‌ర్షంలో కూడా తమ ఆందోళ‌న‌ను కొన‌సాగించారు. మండుటెండైనా, కుండపోత వర్షమైనా సరే ఈ ఉద్యమం వెనక్కి తగ్గదని, పైగా మరింత ఉత్సాహాన్ని పుంజుకుంటుందని చెప్పడానికి ఇదే నిదర్శనమంటూ సీజేపీ నేత‌లు పేర్కొన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కచ్చితమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ ఉద్యమం ఏదో ఒకే సంస్థకు సంబంధించిన ఆందోళనల చుట్టూ కాకుండా, విద్య, ప్రజాస్వామ్య హక్కుల చుట్టూ కేంద్రీకృతమై ఉందని పేర్కొన్నారు. విద్యా రంగానికి సంబంధించిన పలు కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను తీవ్రంగా పరిగణించి, జవాబుదారీతనం కల్పించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘మా నిరాహార దీక్షను ఎంతకాలం కొనసాగించాలనే దానిపై గడువు లేదు. ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసి, మరింత ముందుకు తీసుకెళ్లడమే దీని ఉద్దేశం. ప్రధాన్ రాజీనామా చేసే వరకు మేము కొనసాగిస్తాము” అని నేహా అన్నారు. తొలుత ఆరుగురు విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారని, అయితే వారిలో ఒకరు అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -