Thursday, July 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమూణ్నెల్లు ఇరిగేషన్‌‌ శాఖ అప్పగించు

మూణ్నెల్లు ఇరిగేషన్‌‌ శాఖ అప్పగించు

- Advertisement -

నీళ్లు పారించి చూపుతా
లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా : సీఎంకి మాజీమంత్రి హరీశ్ సవాల్
సమ్మక్క బ్యారేజీ వద్ద నీళ్లున్నా లేవంటూ
నేరపూరిత నిర్లక్ష్యం
రేవంత్‌, ఉత్తమ్‌‌ను ఉరితీసినా తప్పులేదు
తెలంగాణ భవన్‌‌లో గోదావరి జలాలు, కాళేశ్వరం
ప్రాజెక్టుపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్‌
సమ్మక్క బ్యారేజీ వద్ద 1.08 లక్ష‍ల క్యూసెక్కుల వరద నీరు పారుతున్నా ఎందుకు మోటార్లు ఆన్‌‌ చేయడం లేదని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నీళ్లు పుష్కలంగా ఉండి కూడా ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో చెరువులు ఎండిపోతున్నా, ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతున్నదని విమర్శించారు. నీళ్లున్నా ఎత్తిపోయకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని అన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డిని ఉరితీసినా తప్పులేదని చెప్పారు. కేసీఆర్‌ అవసరం లేదనీ, మూడు నెలలు తనకు ఇరిగేషన్ శాఖ అప్పగించాలని, నీళ్లు పారించి చూపుతానని రేవంత్‌‌ను కోరారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ ‌మోటార్లను ఆన్‌ ‌చేసి ఎల్లంపల్లికి నీళ్లు తెస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ నీళ్లు తేకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డికి సవాల్‌ ‌విసిరారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన గోదావరి జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌ ‌పాయింట్‌ ‌ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇరిగేషన్‌‌పై కనీస అవగాహన లేదని సీఎం రేవంత్‌‌రెడ్డి మరోసారి నిరూపించుకున్నారన్నారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌‌రెడ్డి, ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి పోటీపడ్డారని తెలిపారు. అబద్ధాలకు నోబెల్‌ ‌బహుమతి ఉంటే రేవంత్‌‌కు వస్తుందని చెప్పారు. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. సమ్మక్క బ్యారేజీ వద్ద 1.08 లక్ష‍ల క్యూసెక్కుల వరద పారుతున్నదనీ, రోజుకు 2,542 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయడానికి అవకాశముందని వివరించారు. కానీ ప్రభుత్వం 900 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నదని తెలిపారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని చెరువులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గురుదక్ష‍ిణ కింద నీటిని కిందికి వదులుతున్నారని విమర్శించారు. రేవంత్‌‌రెడ్డి, ఉత్తమ్‌ ‌సమాధానం చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. తుమ్మిడిహెట్టికి అనుమతి ఉంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఎందుకు తట్టెడు మట్టి తీయలేదని ప్రశ్నించారు. రూ.6,157 కోట్లు ఖర్చు చేసినా పనులు చేయకుండానే మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ ‌పేరుతో రూ.2,328 కోట్లు తిన్నారని అన్నారు. అక్కడ నీళ్లు లేవని సీడబ్ల్యూసీ చెప్పిందనీ, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమే అనుమతి ఆపిందని గుర్తు చేశారు. 152 మీటర్లకు కాంగ్రెస్ అనుమతి ఇచ్చినట్టు ఒక్క లెటర్ చూపించినా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. అబద్ధం చెప్పినందుకు రేవంత్‌‌రెడ్డి ప్రజలకు క్ష‍మాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని సీడబ్ల్యూసీ చెప్పినందునే బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అక్కడ రిజర్వాయర్‌ ‌కట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదించిందనీ, 18 సంస్థలు అనుమతులు ఇచ్చాయని గుర్తు చేశారు. 160 టీఎంసీల నుంచి 240 టీఎంసీలకు పెరిగిందని తెలిపారు. ఆయకట్టు 16 లక్ష‍ల ఎకరాల నుంచి 37 లక్ష‍లకు పెరిగిందని వివరించారు. ప్రాణహిత- చేవెళ్లకు భూసేకరణలో ఎకరాకు రూ.రెండు లక్ష‍ల పరిహారం ఇస్తే కాళేశ్వరం కోసం తాము సగటున రూ.11 లక్ష‍లు చెల్లించామని అన్నారు. అందుకే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని తెలిపారు. దేశంలో అంచనాలు పెరగని ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదని చెప్పారు. కొడంగల్‌-‌నారాయణపేట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు రూ.1,400 కోట్ల నుంచి రూ.4,350 కోట్లకు పెరిగిందని వివరించారు. కాళేశ్వరం లేకుంటే మూసీకి నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అయితే మేడిగడ్డ వద్ద రిజర్వాయర్‌ ‌కట్టొద్దని రిటైర్డ్‌ ఇంజినీర్ల కమిటీ చెప్పలేదని అన్నారు. రూ.ఏడు వేల కోట్లు కొట్టుకుపోయిన పోలవరం సీఈఓనే ఇప్పుడు ఎన్‌‌డీఎస్‌ఏ కమిటీ చైర్మెన్‌‌గా ఉన్నారని గుర్తు చేశారు. పోలవరంలో రూ.వేల కోట్ల నష్టం జరిగితే ఎన్‌‌డీఎస్‌ఏ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద పిల్లర్‌ కుంగిపోతే ఎన్నికల ముందు రావడం రాజకీయ కుట్ర కాదా?అని అడిగారు. 15 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకుని కాళేశ్వరం నిలబడిందని చెప్పారు. కానీ రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలోనే సుంకిశాల గోడలు కూలాయనీ, వట్టెం పంప్ హౌస్ మునిగిందనీ, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిందని అన్నారు. ఇంకో ఏడాది అయితే రేవంత్‌‌రెడ్డి గద్దె దిగడం ఖాయం, బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చేది ఖాయం, కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం, మేడిగడ్డకు మరమ్మతులు చేయించడం ఖాయం, రైతులకు నీళ్లిచ్చేది ఖాయమని చెప్పారు. ఎల్‌‌నినో వచ్చినా, కరువు వచ్చినా తెలంగాణలో నీళ్లు ఉండే ఒకే ఒక్క ప్రాజెక్టు మేడిగడ్డ అని వివరించారు. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 7.5 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయనీ, ఆ నీటిని ఒడిసి పడితే రాష్ట్రమంతా సస్యశ్యామలం చేయొచ్చని అన్నారు. కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -