కుమ్మెర ఘటనపై న్యాయం చేయకపోతే అసెంబ్లీని ముట్టడిస్తాం
నేడు, రేపు ప్రజాసంఘాలు తలపెట్టిన నిరసనలకు మద్దతు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక, దళిత కుటుంబాలపై జరిగిన దాడి, రెండు నెలల పసిపాప హత్య కేసులో నిందితులను తక్షణమే శిక్షించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. శుక్ర, శనివారాల్లో ప్రజాసంఘాలు తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు ఆయన మద్దతు ప్రకటించారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం హైదరాబాద్‌లో ప్రజాసంఘాలు చేపట్టిన నిరసన సందర్భంగా అరెస్టయిన వారిని చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో జాన్‌వెస్లీతో పాటు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, సీనియర్ నేత డీజీ నరసింహారావు కలిశారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ..కుమ్మెర గ్రామ సర్పంచ్ రాంరెడ్డి, ఇతర నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు.
రాష్ట్రమంతటా ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఘటనను ఖండిస్తున్నా సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పైగా, బాధితులకు అండగా నిరసన తెలుపుతున్న ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి, నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే రాబోయే శాసనసభ సమావేశాల సందర్భంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.



