Friday, July 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యక్తిగతంగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

వ్యక్తిగతంగానే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు

- Advertisement -

సొసైటీలతో సంబంధం లేకుండా ఇచ్చేలా కృషి
న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉంటాయని స్పష్టత
సీఎంకు సూచిస్తానని ఉపముఖ్యమంత్రి భట్టి హామీ
జర్నలిస్టు ఇండ్ల స్థలాలపై టీడబ్ల్యూజేఎఫ్ నేతలు వినతిపత్రం అందజేత

నవతెలంగాణ-చింతకాని
​సొసైటీలతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఎఫ్ హెచ్-2843) ఖమ్మం జిల్లా కమిటీ గురువారం చింతకాని మండలం లచ్చగూడెం పర్యటనకు వచ్చిన మల్లు భట్టి విక్రమార్కకు వినతిపత్రం అందజేశారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని సంఘం నేతలు కోరారు. దీనిపై స్పందించిన భట్టి.. సొసైటీల ద్వారా అయితే న్యాయపరమైన చిక్కులు ఉంటాయని, కాబట్టి అవేవీ లేకుండా వ్యక్తిగతంగానో, బీపీఎల్ కోటాలోనూ మరో రకంగానూ ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం నేతలు మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై అనేక సార్లు విజ్ఞప్తులు, పోరాటాలు నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం వెలుగుమట్ల వీవీ పాలెం రెవెన్యూలో 23 ఎకరాలకు పైగా కేటాయిస్తూ జీవో ఇచ్చినా కార్యరూపం దాల్చలేదని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దీనిపై కొంత సందిగ్ధత ఏర్పడిందని, న్యాయపరమైన చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసేలా చూడాలన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న సభలో సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన చేయించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఖదీర్‌, కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, టీబీజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, మానుకొండ రవికిరణ్, జిల్లా కమిటీ సభ్యులు రాంపుడి నాగేశ్వరరావు, కొత్త యాకేష్, మంకెన నాగేశ్వరరావు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు నల్లబోలా మధు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -