నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కదలిరండి
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-కంఠేశ్వర్
నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం జులై 15న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గతంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని అన్నారు. పైగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ ఉన్న ఉద్యోగాలను తగ్గిస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా ప్రజలను మాయ చేస్తున్నదని అన్నారు. ఫలితంగా అనేకమంది నిరుద్యోగులు.. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్, తదితర ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లకు లక్షల ఫీజులు కడుతూ సంవత్సరాల తరబడి ఉద్యోగ అన్వేషణ కోసం పరితపిస్తున్నారన్నారు. అప్పుల పాలై నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించడంతో పాటు నోటిఫికేషన్లT జారీ చేయాలని, 20వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని, రిటైరయిన వారి స్థానంలో వెంటనే నియామకాలు చేపట్టాలని, నిరుద్యోగ భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రమేష్‌బాబు, కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు పాల్గొన్నారు.


