Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల అంచనాలను పూర్తిగా చేరలేకపోయాం

ప్రజల అంచనాలను పూర్తిగా చేరలేకపోయాం

- Advertisement -

భూ భారతి విజయవంతానికి భూ రీ-సర్వేనే కీలకం
మార్చి-2027 నాటికి మూడు విడతల్లో పూర్తి
రీ-సర్వేలో పనిచేసే లైసెన్డ్స్
సర్వేయర్లకు ఎకరానికి రూ.60
వేగంగా సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం
ఆగస్టు 15 నాటికి ప్రతి విద్యార్థికీ కనీసం ఒక జత యూనిఫాం అందించాలి
లైసెన్డ్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలే..: జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌‌లో మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్

​భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. ​భూ రీ-సర్వే, భూ భారతి అమలు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, 2బీహెచ్‌కే ఇండ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ తదితర అంశాలపై శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీఎస్.లోకేష్ కుమార్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. భూభారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించినా.. అధిక సంఖ్యలో తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని అన్నారు. తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి పరిష్కరించాలన్నారు.
భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే భూ రీ-సర్వే తప్పనిసరి అని మేధావులు సూచించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. లైసెన్స్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్టుగా నక్ష‍లు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ-సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి ములుగుమాడు గ్రామ రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్‌లు పంపిణీ చేశారని గుర్తు చేశారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో రీ-సర్వే చేపట్టినట్టు చెప్పారు.

మార్చి-2027 నాటికి మూడు విడతల్లో రీ-సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్స్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 కలిపి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విధుల్లో చేరని లైసెన్స్ సర్వేయర్లకు గడువిచ్చి, ఆ తర్వాత వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. ​సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు జారీ చేయాలని చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న 2బీహెచ్‌కే ఇండ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్దిదారులకు అందజేసి, మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హులను కూడా రెండో విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు.
​​రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ మాట్లాడుతూ.. తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీ-సర్వేను నవంబర్‌ లోపు పూర్తి చేయాలని, రెండో విడత మరో 70 గ్రామాల్లో మార్చి-2027లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ-సర్వే పూర్తయితే సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు. ​తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో గుర్తించిన గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
​సెర్ప్ సీఈవో దివ్య మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థుల యూనిఫాంలన్నీ స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారానే కుట్టిస్తున్నామని తెలిపారు. టెండర్ ఆలస్యంతో వస్త్రం ఆలస్యంగా వచ్చినప్పటికీ జులై 15లోపు రెసిడెన్షియల్ బాలికలకు, జులై 30లోపు బాలురకు యూనిఫాంలు అందించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికీ కనీసం జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, డీఆర్‌డీఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో భూ రీ-సర్వే చేపట్టామని, నాలుగు యంత్రాలను సీఎస్‌ఆర్ నిధుల ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. ​ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, ఖమ్మం ఆర్డీఓ ఎన్. శ్రీనివాస్, అన్ని జిల్లాల కలెక్టర్లు, తహసీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -