మంజూరు చేసిన అన్ని ఇండ్లూ
గ్రౌండింగ్ కావాల్సిందే
లబ్దిదారులను గుర్తించండి : రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తోందనీ, ఈ పథకం ఒక బెంచ్ మార్క్‌గా నిలవబోతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.60 లక్షల ఇండ్లను మంజూరు చేయగా ఇందులో లక్ష ఇండ్లకు ఈనెల 31లోగా గృహప్రవేశాలు జరగనున్నాయని తెలిపారు. త్వరలోనే గృహప్రవేశాలకు తేదీలను అధికారికంగా తెలియజేస్తామన్నారు. ఇండ్లు మంజూరు చేసిన తర్వాత కూడా కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ పూరిగుడిసెలు కనిపిస్తున్నాయనీ, అలాంటి కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వనున్నట్టు తెలిపారు. ఈ పథకాన్ని లబ్దిదారులకు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి ప్రజాపాలన- ప్రగతి నివేదిక 99 రోజుల్లో చేపట్టవలసిన కార్యాచరణపై జిల్లా హౌసింగ్ పీడీలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేసిన ఇండ్లలో 20 శాతం వరకు గ్రౌండింగ్ కాలేదనీ, అలాంటి ఇండ్లకు సంబంధించి లబ్దిదారుల సమ్మతి తీసుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనలతో మార్చి 31లోపు అన్ని ఇండ్లూ గ్రౌండింగ్ అయ్యేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తికి దగ్గరగా ఉన్న ఇండ్లను సమర్థవంతంగా సమన్వయం చేసుకుని జూన్ చివరినాటికి పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఏప్రిల్ నెలలో రెండోదశ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేనాటికి మొదటి దశ ఇండ్లు కొలిక్కిరావాలని సూచించారు. నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల లబ్దిదారులపై అదనపు భారం పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పనిచేయాలని తెలిపారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇటుకల సరఫరా పెంచేందుకు స్థానికంగా ఎస్‌హెచ్‌జీ మహిళా సంఘాల ద్వారా బ్రిక్ యూనిట్లను ప్రోత్సహించాలని సూచించారు. అవసరమైతే ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా సరఫరా పెరిగి ధరలు నియంత్రణలో ఉండే అవకాశముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచిత ఇసుక పంపిణీ చేస్తుందని లబ్దిదారులకు ఎక్కడా సమస్య రాకుండా లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి ఒకటి లేదా రెండు విడతల చెల్లింపులు చేసిన తర్వాత వివిధ కారణాలతో చెల్లింపులు నిలిపివేయడం సరికాదన్నారు. ఇటువంటి చెల్లింపులను తక్షణమే క్లియర్ చేయాలనీ, లేదంటే అధికారులపై కఠిన చర్యలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



