– ‘సుప్రీం’ గడువు ముగిసిన నేపథ్యంలో స్పీకర్ ప్రకటన
– కడియం, దానం కేసు తీర్పు రిజర్వ్
– దానం..కీం కర్తవ్యం..!?
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాజకీయాల్లో ఏడాది కాలంగా ప్రకంపనలు సష్టిస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తుదిదశకు చేరింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ శనివారం తుది విచారణను ముగించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు కూడా శనివారంతో ముగియనున్న నేపథ్యంలో స్పీకర్ వెలువరించబోయే తీర్పుపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ ఛాంబర్లో కీలక విచారణ జరిగింది. దాదాపు రెండుగంటలపాటు విచారణ జరిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఆవరణ లోకి మీడియా రాకుండా ఆంక్షలు విధించారు. ఉస్మానియా గేటు వద్దే ఆపేశారు. ఎమ్మెల్యేల విచారణ నేపథ్యంలో అసెంబ్లీ సెక్యూరిటీ మీడియాను, ఇతరులనూ లోపలికి అనుమతించలేదు.
పది మంది విచారణ పూర్తి
ఇప్పటివరకు పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. అనేక అంశాలపై స్పీకర్ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. కాగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులో తీర్పు రిజర్వ్ చేశారు. ఉభయ పక్షాల న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం ఈ కేసులో కూడా విచారణ ముగిసినట్టు స్పీకర్ కార్యాలయం ప్రకటించింది. స్పీకర్ విచారణను ఎదుర్కొన్నవారిలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజరుకుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై తీర్పు రిజర్వ్ చేయగా, మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు క్లీన్‌చీట్ ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్టుగా ఎలాంటి ఆధారాల్లేవని స్పీకర్ సంబంధిత తీర్పులో పేర్కొన్నారు. కడియం శ్రీహరి విషయంలోనూ ఇదే తీర్పు వచ్చే అవకాశముంది. ఇదిలావుండగా దానం నాగేందర్ అనర్హతపై భిన్నమైన తీర్పు వచ్చే అవకాశాలు లేకపోలేదని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండగానే, గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఆయనకు అనర్హత వర్తించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. బీఆర్ఎస్ నాయకత్వం సైతం నాగేందర్ విషయంలో న్యాయ స్థానాల్లో గట్టిగా వాదనలు వినిపిస్తూ పట్టుబడు తున్నది. కడియం, దానం విషయంలో రెండూ మూడు రోజుల్లోనే తీర్పు వెలువరించే అవకాశాలు లేకపోలేదు.
దానంపై అనర్హత వేటు ?
ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే న్యాయవాదులతో చర్చించారు. ఒకవేళ అనర్హత వేటుపడే అవకాశం ఉంటే, తనంతటా తాను రాజీనామా చేసి మళ్లీ తాజాగా కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని ఇప్పటికే ప్రకటించారు. ఆ స్థానం నుంచి తనకే టికెట్ ఇవ్వాలని సీఎం, పీసీసీ చీఫ్‌తోపాటు కాంగ్రెస్ అధిష్టానంతోనూ దానం సంప్రదింపులు చేసుకున్న విషయం విదితమే.
ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



