గురుకుల విద్యార్థులకు నాణ్యమైన సామగ్రి
రూ.687.78 కోట్లతో విద్యార్థి అవసరాల కొనుగోళ్లు
చేనేత, తోలు పరిశ్రమలకు ఊతం…
14 వేల మహిళా టైలర్లకు ఉపాధి
ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్ల ఖరారు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని సాంఘీక గిరిజన, బీసీ , మైనారిటీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు అవసరమైన యూనిఫాంలు, బెడ్డింగ్ సామగ్రి, పాఠశాల బ్యాగులు, పాదరక్షలు, భోజన పాత్రలు, ట్రంక్ బాక్సులు తదితర వస్తువుల కొనుగోలును రాష్ట్ర ప్రభుత్వం ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో పూర్తి చేసింది. విద్యార్థులకు నాణ్యమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయడం, చేనేత రంగానికి చేయూతనివ్వడం, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి బహుముఖ లక్ష్యాలతో ఈ కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్టు అధికారిక వివరాలు తెలిపాయి. 2026–27 విద్యా సంవత్సరానికి అవసరమైన విద్యార్థి సామగ్రి కొనుగోలు కోసం ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) రాష్ట్ర స్థాయిలో కార్యాచరణ ప్రారంభించింది. ఏప్రిల్ 2న రాష్ట్ర ఈ-ప్రొక్యూర్మెంట్ పోర్టల్‌లో జాతీయ స్థాయి టెండర్లను ఆహ్వానించింది. యూనిఫాం వస్త్రం, స్కూల్ బ్యాగులు, బూట్లు, సాక్సులు, బెడ్డింగ్, ట్రంక్ బాక్సులు, భోజన పాత్రలు, స్టేషనరీ తదితర తొమ్మిది విభాగాల్లో బిడ్లు స్వీకరించింది. టెండర్ల ప్రక్రియలో పారదర్శకతను పాటించేందుకు ఏప్రిల్ 8న ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించి, పాల్గొన్న సంస్థల సూచనలను పరిశీలించింది. అవసరమైన మార్పులను ప్రకటించింది. అనంతరం టెక్నికల్ అర్హతలు, ఉత్పత్తి సామర్థ్యం, నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన తరువాత మాత్రమే ఆర్థిక బిడ్లను తెరిచింది. ప్రతి వస్తువుకు తక్కువ ధరను కోట్ చేసిన సంస్థలను ఎంపిక చేసి టెండర్లను ఖరారు చేసింది. అధికారిక రికార్డుల ప్రకారం తుది టెండర్ల మొత్తం విలువ రూ.687.78 కోట్లు. వివిధ విభాగాలకు మొత్తం 27 బిడ్లు అందగా, నిబంధనలకు అనుగుణంగా పరిశీలన పూర్తయిన తరువాతే పనులు కేటాయించినట్టు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ రంగ సంస్థలకు కీలక బాధ్యతలు
ఈ కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వ రంగ సంస్థలకు విశేష ప్రాధాన్యనివ్వడం గమనార్హం. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ (టీజీఎస్‌సీఓ), తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీజీఎల్ఐపీసీ), తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (టీజీటీపీసీ)లకు పలు కీలక బాధ్యతలు అప్పగించారు. యూనిఫాం వస్త్రంలో 25 శాతం వాటాను టీజీఎస్‌సీఓ ద్వారా సరఫరా చేయనున్నారు. అదనంగా బెడ్డింగ్ సామగ్రిలో కూడా ఈ సంస్థకు ప్రధాన భాగస్వామ్యం కల్పించారు. రూ.70.86 కోట్ల విలువైన అదనపు పనులు అప్పగించడంతో పాటు 56 లక్షల మీటర్ల వస్త్రం, 6.49 లక్షల దుప్పట్ల సరఫరా బాధ్యతలను కూడా ఈ సంస్థే నిర్వర్తించనుంది. చేనేత రంగానికి స్థిరమైన పనులు లభించడం ద్వారా సహకార రంగానికి ఆర్థిక ఊతం లభిస్తుందని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. బెల్టులు, టైలు, ఐడీ కార్డుల తయారీ బాధ్యతలను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు అప్పగించారు. దీంతో ప్రభుత్వ రంగంలోని తోలు పరిశ్రమకు కొత్త ఆర్డర్లు లభించనున్నాయి. నోట్‌బుక్స్ సరఫరా బాధ్యతలను తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్‌కు కేటాయించారు.
పోటీ విధానంలో ఎంపిక
యూనిఫాం వస్త్రం సరఫరాలో మఫత్‌లాల్ ఇండస్ట్రీస్ రూ.298.10 కోట్ల విలువైన టెండర్‌ను దక్కించుకుంది. 2.44 కోట్ల మీటర్ల వస్త్రం సరఫరా చేయనుంది. స్కూల్ బ్యాగులు, నల్ల బూట్లు, తెల్ల బూట్లు, సాక్సుల సరఫరాకు రూ.263.47 కోట్ల విలువైన పనులు కూడా అదే సంస్థకు లభించాయి. మొత్తం 11.39 లక్షల బ్యాగులు, 28.35 లక్షల నల్ల బూట్లు, 7.74 లక్షల తెల్ల బూట్లు, 67 లక్షలకు పైగా జతల సాక్సులు సరఫరా చేయనుంది. వరల్డ్ ఫా ఎంటర్‌ప్రైజెస్‌కు 5.10 లక్షల ప్లేట్లు, గ్లాసులు, బౌల్స్, స్పూన్ల సరఫరా బాధ్యతలు అప్పగించగా, చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్‌ప్రైజెస్‌కు 3.24 లక్షల ట్రంక్ బాక్సుల సరఫరా బాధ్యతలు కేటాయించారు. బెడ్డింగ్ సామగ్రి కొనుగోలు కూడా పోటీ టెండర్ల ద్వారానే ఖరారైనట్టు అధికార వర్గాలు తెలిపాయి.
మహిళల ఉపాధికి ప్రాధాన్యం
ఈ కొనుగోలు ప్రక్రియలో సామాజిక కోణానికీ ప్రాధాన్యం ఇచ్చారు. యూనిఫాంల కుట్టు పనులను ప్రభుత్వ టైలర్స్ ఫెడరేషన్‌కు అప్పగించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 వేల మంది మహిళా టైలర్లకు ఉపాధి లభించనుంది. మహిళా స్వయం ఉపాధికి ఇది తోడ్పడటమే కాకుండా స్థానిక స్థాయిలో ఆదాయ వనరులను పెంచుతుందని అధికారులు తెలిపారు. విద్యార్థులకు పంపిణీ చేసే ప్రతి వస్తువుకు నాణ్యత ప్రమాణాలు నిర్దేశించారు. నమూనాలను పరిశీలించి ఆమోదించిన తరువాతే భారీ స్థాయిలో తయారీ చేపట్టనున్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా సరఫరాలను తనిఖీ చేసి, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొనుగోలు ప్రక్రియతో ఒకవైపు లక్షలాది మంది గురుకుల విద్యార్థులకు అవసరమైన సామగ్రి సమయానికి అందనుండగా, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, చేనేత సహకార సంఘాలు, తోలు పరిశ్రమ, మహిళా టైలర్లు ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. విద్యార్థి సంక్షేమంతో పాటు ప్రజా రంగ సంస్థలకు పనులు కల్పించడం, స్థానిక ఉపాధిని ప్రోత్సహించడం, నాణ్యమైన వస్తువులను అందించడం అనే మూడు లక్ష్యాలతో ప్రభుత్వం ఈ కొనుగోలు విధానాన్ని అమలు చేసినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రభుత్వ రంగానికి చేయూత…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



