మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి భూమిపూజ
నవతెలంగాణ – జగిత్యాల
విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం సమీపంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి మంత్రి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కేంద్రీయ విద్యాలయం కోసం వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలోని ఐదు ఎకరాల విలువైన భూమిని కేటాయించినట్టు తెలిపారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, జగిత్యాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంలో అండగా ఉంటామని అన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా నిలుస్తున్నాయని చెప్పారు. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయడం జిల్లాకు గొప్ప అవకాశమని, త్వరలో తాత్కాలిక భవనంలో తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం రావడం గర్వకారణమని, విద్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. మంత్రివర్గ ఆమోదంతో జాతీయ రహదారి సమీపంలోని ఐదు ఎకరాల భూమిని కేంద్రీయ విద్యాలయానికి కేటాయించినట్టు తెలిపారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు తాత్కాలిక భవనంలోనే విద్యాలయం ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం తదితర విద్యాసంస్థలతో జగిత్యాలను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎస్.దినేష్, జగిత్యాల మార్కెట్ కమిటీ చైర్మెన్ నారాయణరెడ్డి, చలగల్ గ్రామ సర్పంచ్ జున్ను రాజేందర్, ఆర్డీవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



