గ్యాస్ ధరలపై ప్రజాగ్రహం : రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసనలు
కొరత లేదంటూనే ధరల పెంపు
నవతెలంగాణ- విలేకరులు
ఇజ్రాయిల్-అమెరికా, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చయురు రవాణాకు పెద్దఎత్తున ఆటంకాలు ఏర్పడిన నేపథ్యం లో ప్రస్తుతం దేశంలో ఇంధనం, గ్యాస్ కొరత లేదు.. సరిపడా నిల్వలున్నా యంటూనే కేంద్ర ప్రభుత్వం ధరలు భారీగా పెంచేసింది. ధరల పెంపుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం సీపీఐ(ఎం), ప్రజాల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడం మహిళా లోకాన్ని అవమానిం చడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం అంబేద్కర్ సెంటర్లో గ్యాస్ సిలిండర్లను రోడ్డుపై పెట్టి నిరసన తెలిపారు. మణుగూరులో ఖాళీ గ్యాస్ సిలిండర్‌తో అంబేద్కర్ సెంటర్‌లో రాస్తారోకో నిరసన వ్యక్తం చేశారు. గుండాల మండలంలో సీఐటీయూ, తెలంగాణ వ్యవసాయ గ్రామీణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. యుద్ధం సాకుతో వంట గ్యాస్ ధర 60 రూపాయలు పెంచి సామాన్య ప్రజలపై ఆర్థిక భారాలు వేయడం దుర్మార్గం అని సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం ఎన్‌ఎస్టీ రోడ్ వద్ద గ్యాస్ బండలతో నిరసన వ్యక్తం చేశారు.
కరీంనగర్ నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద ఖాళీ సిలిండర్లను తలపైకెత్తుకుని నిరసన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. మహబూబ్‌నగర్‌లోని జగ్జీవన్ నగర్ చౌరస్తా దగ్గర నిరసన తెలిపారు. వనపర్తి అంబేద్కర్ చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూరు అచ్చంపేట అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపై గ్యాస్ బండలు పెట్టి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
ములుగు జిల్లా ఏటూర్‌నాగారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.60 పెంచుతూ 60 వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై వేయడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని స్థానిక రహదారిపై సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి అంజాద్ పాషా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో, కేసముద్రం కేంద్రాల్లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో వినూత్న పద్ధతుల్లో నిరసన చేపట్టారు. ఖాళీ సిలిండర్లతో, కట్టెల పొయ్యిపై వంట చేశారు.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని హనుమకొండ-కరీంనగర్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. జనగామ జిల్లా జిల్లా జఫర్‌ఘడ్ మండలంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్టేషన్ ఘనపూర్‌లో క్రిష్ణాజీగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్యాస్ సిలిండర్‌తో నిరసన చేపట్టారు.
నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కట్టెలపొయ్యి, సిలిండర్‌తో ధర్నా నిర్వహించారు. నకిరేకల్ పట్టణంలో ఖాళీ సిలిండర్‌తో నిరసన తెలిపారు. కేతేపల్లి మండల కేంద్రంలో మహిళలు రోడ్డుపై నల్లజెండాలతో కట్టెలపొయ్యితో వంట చేశారు. సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో నిరసన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.జహంగీర్ పాల్గొని మాట్లాడారు. డీవైఎఫ్‌ఐ, ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని హనుమాన్ వార్డులో మహిళలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.
రోడ్లపై ఖాళీ సిలిండర్లు- కట్టెల పొయ్యిపై వంట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



