నవతెలంగాణ – హైదరాబాద్: కమ్యూనిస్టు విలువలతో, గ్రామ పరిపాలనలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గంగదేవిపల్లి గ్రామాన్ని దేశంలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దిన కూసం రాజమౌళి మరణం పేద ప్రజలకు తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఈరోజు ఉదయం గంగదేవిపల్లి గ్రామంలో రాజమౌళి భౌతికకాయానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాన్‌వెస్లీ మీడియాతో మాట్లాడుతూ, చిన్న వయసులోనే కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడై రాజమౌళి నిస్వార్ధంగా పంచాయతీ పాలనకు ఒక రోల్ మోడల్‌గా నిలిచారన్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం, బెల్టుషాపుల రద్దు, రక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, ప్రతీ వీధికి సిసి రోడ్లు, వీధిలైట్లు, పచ్చదనం పరిశుభ్రతతో ఒక పల్లెటూరు ఎలా ఉండాలో తన స్ఫూర్తిదాయకమైన పరిపాలన ద్వారా రుజువు చేశాడు.
జీవితాంతం తాను నమ్ముకున్న కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి నిలబడ్డారు. ఆయన కృషిని గుర్తించి నాటి రాష్ట్రపతి, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. అనేకమంది సినీ ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు, ప్రముఖులు సైతం గంగదేవిపల్లిని సందర్శించి ప్రశంసించడం రాజమౌళి దక్షతకు నిదర్శనం. నాడు కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ తరహాలో 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం పంచాయితీలకు 50 శాతం నిధులు కేటాయించాలని ఆయన నిరంతరం పోరాడారు. నేడున్న సర్పంచులు రాజమౌళిని స్ఫూర్తిగా తీసుకుని, నిధుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి నాగయ్య, ఎండి అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు టీ స్కైలాబ్ బాబు, జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు



