జ్యోతిరావు, అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రాములు
నవతెలంగాణ-మిడ్జిల్
మహిళా సమస్యల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, అణగరిన వర్గాల సమస్యల కోసం కామ్రేడ్ అరుణ పోరాటం మరువలేనిది అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ రాములు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ అన్నారు. వాడియాల మాజీ సర్పంచ్ కామ్రేడ్ ఏ అరుణ 6 వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో 18 మంది ఇంటర్మీడియట్, పదవ తరగతి మంచి మార్కులు సాధించిన విద్యార్థిని ,విద్యార్థులకు పారితోషకంతో పాటు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ముఖ్య అతథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ విద్యా రంగ సంస్థలను కాపాడుకోవాలని కామ్రేడ్ అరుణ ఎన్నో పోరాటాలు చేశారని చెప్పారు. పేద విద్యార్థుల విద్యా బలోపేతానికి ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వాలు విద్యా వైద్యానికి అధిక నిధులు కేటాయించాలని కోరారు. అరుణ చిన్నప్పటినుంచి జ్యోతిరావు పూలే ,సావిత్రిబాయి పూలే అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని, చదువుకున్నారని ప్రతి విద్యార్థి కూడా కష్టపడి చదువుకోవాలని వారు సూచించారు. చదువుకుంటేనే సమాజంలో మార్పు వస్తుందని , కష్టంతో అనుకోకుండా ఇష్టపడే చదువుకుంటే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెప్పారు. అనంతరం విద్యార్థులను తల్లిదండ్రులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు రాజేందర్ గౌడ్, ప్రభావతి, కుటుంబ సభ్యులు రేణుక, సృజన్ చక్రవర్తి, డాక్టర్ రసజ్ఞ , డాక్టర్ సుదీప్తి, గ్రామ పెద్దలు భీమయ్య ,జంగయ్య, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.




