Tuesday, July 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసంగీత రాజ్ఞి

సంగీత రాజ్ఞి

- Advertisement -

‘‘దుర్యోధన దుశ్శాసన దుర్వినీత’’ లోకాలను భయ కంపితుల్ని చేసేంత ధీరత్వం ఉందాగళానికి. ‘‘మనసా తుళ్లిపడకే’’ అంటూ సముదాయించే మెత్తదనమూ ఉంది. ఆ గొంతు ఇప్పుడు లేదు…ఆ తంత్రి తెగిపోయింది… ఆ గూటిలో కోయిల ఎగిరిపోయింది… జనహృదయాలను తన పాటలతో ఓలలాడించిన జానకి మన నుంచి దూరమైంది. ఎస్. జానకి సంగీత ప్రస్థానం భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. అమాయకత్వం ఉట్టిపడే పసిపిల్లల గొంతు నుంచి ముసలి ముత్తవ్వల స్వరాల వరకు, భక్తి భావనలు పండించే కీర్తనల నుండి హుషారైన నృత్య గీతాల వరకు ఆమె పలికించిన భావాలు అద్వితీయం. ఎనభై ఎనిమిదేండ్ల జీవనయానంలో అరవై ఏండ్ల గానం ఆమెది. ఐదు తరాల నటులకు తన స్వరంతో ప్రాణం పోసిన జానకమ్మ కేవలం ఒక గాయని మాత్రమే కాదు, అసంఖ్యాక స్వరాల అద్భుత సృష్టికర్త. ఇప్పుడామె తనువు చాలించారు. ఇక నుంచి జానకి కనిపించరు. కానీ… ఎన్నో భాషల్లో ఆమె పాడిన పాటలు ‘నీలి మేఘాలలో…గాలి కెరటాలలో..’ మనల్ని పరవశింప చేస్తూనే ఉంటాయి.

పాట ఏ భాషలో ఉన్నా సరే, ఆయా ప్రాంతాల ఉచ్ఛారణను, అక్కడి మట్టి వాసనను పక్కాగా పట్టుకోగలగడం ఆమె గొంతు ప్రత్యేకత. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె పాడిన వేలాది పాటలు ఆయా రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయాయి. శాస్త్రీయ సంగీతంలో ఎలాంటి అధికారిక శిక్షణా లేకపోయినా, కేవలం ఏకసంథా గ్రహిగా, శ్రవణ జ్ఞానంతోనే ఆమె సాధించిన ప్రగతి ఈనాటి యువ గాయనీ గాయకులకు ఒక గొప్పపాఠం. రేపల్లె తాలూకాలో కనుతెరచి… మన సిరిసిల్లలో ‘సరిగమపదని’ నేర్చి, జాతీయ స్థాయికి ఎదిగిన తెలుగింటి ఆడపడుచు మన జానకమ్మ!
పేరుకు తెలుగు గాయనే అయినా దక్షిణ భారతంలోని ప్రతి చిత్ర పరిశ్రమ ఎస్‌.జానకి స్వరాన్ని తమదిగా భావించింది. దక్షిణ భారత గాన కోకిలగా పేరుగాంచిన ఆమె స్వరాలకు సరికొత్త సొబగులు అద్దారు. సాహిత్యానికి వేడుక చేశారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం… ఇలా మనవైన భాషలు మొదలుకొని సింహళం, జర్మనీ, జపాన్‌ వరకూ పదిహేడుకు పైగా భాషల్లో దాదాపు యాభై వేల పాటలు ఆలపించారు. ఇందులో పదహారు వేల పైచిలుకు పాటలు సినిమాల కోసం ఆలపించినవే. దక్షిణాదిలో తొలి ఆంగ్ల గీతాన్ని పాడిన ఘనతనూ సొంతం చేసుకున్నారు. చంద్రుడిపై మానవుడు కాలు మోపిన అపురూప ఘట్టం సందర్భంగా రూపొందించిన మ్యూజిక్‌ ఆల్బమ్‌ కోసం ‘మాన్‌ హాస్‌ సెట్‌ హిజ్‌ పుట్‌ ఆన్‌ ది మూన్‌’’ అనే గీతాన్ని పీబీ శ్రీనివాస్‌తో కలిసి ఆలపించారామె. అందుకే ఏ భాషలోకి వెళ్లినా ‘మా జానకమ్మ’ అంటూ ఆమెని సొంతం చేసుకుంటారు. నాలుగు జాతీయ పురస్కారాలతో పాటు, పలు రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులు ఆమె సొంతమయ్యాయి.

గానం, సంగీత దర్శకత్వం, రచన… ఇలా ఎన్నో రూపాలుగా తన ప్రతిభని చాటిన జానకి చదువుకోలేదు. కానీ తన పాటల ప్రయాణంలోనే ఎన్నో భాషలు నేర్చుకున్నారామె. ఊహ తెలిసినప్పటి నుంచి పాటే ఆమె ప్రపంచం. గళంతో గారడి చేస్తూ.. సినీ సంగీత ప్రియుల్ని పాటల పూదోటలో విహరింపజేయడంలో దిట్ట. కులాలు, వర్ణాలు అన్నీ మనం కల్పించు కొన్నవే. మనుషులంతా ఒక్కటే అనే పరమోన్నత సందేశాన్ని ఇచ్చిన ‘గోవుల్లు తెల్లన’ పాట జానకమ్మ గొంతు చల్లిన గోధూళి ఎర్రని స్వరార్ణవ అరుణారుణ వర్ణాలు. పిల్లల్లా గాత్రం మార్చి పాటలతో అల్లరి చేయాలన్నా.. వయసు పైబడిన ముదుసలిలా స్వరంలో భావాలు ఒలికించాలన్నా ఆమెకి ఆమే సరిసాటి. ఇలా వైవిధ్యభరితమైన స్వరంతో ఆమె చేసే మాయలన్ని నేడు సంగీతపాఠాలుగా నిలిచిపోతాయి.
భాష ఏదైనా… బాణీ ఎలాంటిదైనా తన మధుర గాత్రంతో పాటను అమృతతుల్యం చేసిన గొప్ప గాయని ఎస్‌.జానకి. స్వరాలకు అనుగుణంగా గాత్రాన్ని మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. తన పాటలతో దశాబ్దాలుగా శ్రోతల్ని ఆనందడోలికల్లో ఉర్రూతలూగించి.. తెలుగు నేలలో జానకమ్మగా ఖ్యాతిగాంచిన స్వర సామ్రాజ్ఞి. స్వరంలో ఎంతటి వైవిధ్యం ఉన్నా, నిజజీవితంలో అంతటి సరళత, నిరాడంబ రతను ప్రదర్శించడం ఆమెకే చెల్లింది. అవార్డులు, సత్కారాల కంటే ప్రేక్షకుల గుండెల్లో దక్కే స్థానమే మిన్న అని నమ్మిన మహోన్నత వ్యక్తిత్వం ఆమెది. పద్మభూషణ్ వంటి పురస్కా రాన్ని కూడా ఎంతో హుందాగా తిరస్కరించి, కళాకారులకు దక్కాల్సిన అసలైన గౌరవం కోసం నిలబడిన తీరు ఆమె ఆత్మగౌరవానికి నిదర్శనం. ఆమె పెదవి పలికితే గేయాలు. మన గుండె గొంతుల్లో నిండే పాటలు. ‘ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదంటూ…’పాటల ‘సిరిమల్లె పువ్వు’లను తన జ్ఞాపకంగా వదిలి వెళ్లిన సంగీత రాజ్ఞికి జోహర్లు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -