– దేశంలో పేలుళ్లకు ఉగ్రసంస్థ వ్యూహం
– భగం చేసిన ఎన్ఐఏ
– దక్షిణాది రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థ దాడులు
– 8 మంది ఉగ్రవాదుల అరెస్ట్
– భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాంబుదాడులతో విధ్వంసానికి కుట్రపన్నిన ఐసిస్ ఉగ్రవాదుల వ్యూహాన్ని ఎన్ఐఏ భగం చేసింది. ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాల్లో దాడులు జరిపిన ఎన్ఐఏ మొత్తం 8 మంది ఉగ్రవాదులను అరెస్టు చేసింది. వారి నుంచి పేలుడు పదార్థాలతో పాటు వాటిని ప్రయోగించే ఎలక్ట్రానిక్ వస్తువులను పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నది. ఎన్ఐఏ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఐసిస్ భావజాలానికి లోనైన కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లను జరిపి భారీ ఎత్తున విధ్వంస వ్యూహ రచన చేసినట్టు ఎన్ఐఏకు సమాచారమందింది. దాంతో మహారాష్ట్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోని 19 అనుమానిత ప్రాంతాలపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. ముఖ్యంగా, పూణే, నాగ్పూర్, బళ్లారి, హుబ్లీ, కేరళలోని తిరుచ్చి, త్రివేండ్రం తదితర ప్రాంతాల్లో దాడులు సాగాయి. ఈ దాడుల సందర్భంగా విధ్వంస రచనకు ప్రధాన సూత్రధారి అయిన మినాజ్తో సహా మొత్తం 8 మంది ఉగ్రవాదులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. అలాగే, దాడుల సందర్భంగా వీరి దగ్గర నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనపర్చుకున్నారు. త్వరలోనే పేలుళ్లకు కుట్రపన్నిన వీరి వ్యూహాన్ని.. ఈ ఉగ్రవాదులను పట్టుకోవటంతో భగం చేయగలిగామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. కాగా, తెలంగాణ, ఏపీలలోని కొన్ని ప్రాంతాల్లో ఐసిస్ సానుభూతిపరుల కదలికలు సాగుతున్నట్టు తమకు అనుమానాలున్నాయని అధికారులు తెలిపారు. మొత్తమ్మీద దక్షిణాదిలో ఉగ్రవాదుల కార్యకలాపాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ విభాగాలతో కలిపి గట్టి నిఘా వేసి ఉంచినట్టు ఎన్ఐఏ అధికారులు చెప్పారు.