Tuesday, July 14, 2026
E-PAPER
Homeజాతీయంలోపాలు సరిదిద్దాకే ముందుకెళ్తాం

లోపాలు సరిదిద్దాకే ముందుకెళ్తాం

- Advertisement -

బనకచర్లను అడ్డుకోవాలన్న పిటిషన్ పై సుప్రీం స్పష్టత
​ఏపీకి ఇంజక్షన్ నోటీసులు ఇవ్వాలన్న అభ్యర్థనకు నో
నవతెలంగాణ- న్యూఢిల్లీ బ్యూరో

​ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రం నిర్మిస్తోన్న పోలవరం –బనకచర్ల(నల్లమల్లసాగర్) ప్రాజెక్ట్ ను అడ్డుకోవాలని దాఖలు చేసిన పిటిషన్ లో అన్ని లోపాలు సరిదిద్దాకే ముందుకెళ్తామని సర్వోన్నత న్యాయస్థానం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో కోర్టు పేర్కొన్న అవసరమైన అన్ని షరతులు పూర్తి చేయాలని సూచించింది. బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వాన్ని నిలుపుదల చేసేలా ఇంజెక్షన్ ఆదేశాలు ఇవ్వాలని ఈ ఏడాది మార్చిలో తెలంగాణ ప్రభుత్వం తొలిసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఈ రిట్ పిటిషన్ లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ), గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులు, సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఇలా మొత్తం 13 మందిని ప్రతివాదులుగా చేసింది. అయితే ఈ పిటిషన్ లో పలు లోపాలు ఉన్నాయని పేర్కొంటూ కోర్టు ప్రాథమిక దశలోనే విచారణను తిరస్కరించింది. అంతేకాక ఈ పిటిషన్ విచారణకు అర్హత లేదనీ, దీనిపై ఒరిజినల్ సూట్ వేసుకోవాలని స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున సుమంత్ నూకల మధ్యంతర పిటిషన్ (ఐఏ) దాఖలు చేసింది. ఈ ఐఏపై జస్టిస్ ఎన్.వి అంజరియ(ఛాంబర్ బెంచ్) మే 22న ఛాంబర్ కోర్టులో విచారణ జరిపింది. ఈ సందర్భంగా రీ–ఫైలింగ్ లో జరిగిన జాప్యాన్ని మన్నిస్తూనే, ఐఏను అనుమతించింది. దీని ఆధారంగా ఒరిజినల్ సూట్ ను కోర్టు వెకేషన్ తర్వాత రెగ్యులర్ బెంచ్ విచారించనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఒరిజినల్ సూట్ ను సోమవారం జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వీ, గోపాల శంకర్ నారాయణ, తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డిలు హాజరయ్యారు.

అందరికీ ఒకటే రూల్
తొలుత ధర్మాసనం జోక్యం చేసుకొని ఈ పిటిషన్ ను జాబితా నుంచి తొలగించినట్టు వెల్లడించింది. ఈ సూట్ కు సంబంధించి పలు ప్రక్రియలను పిటిషనర్ పూర్తి చేయాల్సి ఉందనీ, అందువల్ల ప్రస్తుతం కేసు విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. మధ్యలో తెలంగాణ తరపు అడ్వొకేట్లు సింఘ్వీ, నారాయణ జోక్యం చేసుకొని, గత ఆదేశాల్లో కేవలం నాలుగు లైన్ల ఉత్తర్వులు పేర్కొందని, ఈ విషయంలో విచారణ చేపట్టాలని అభ్యర్థించారు. మరోసారి జస్టిస్ విక్రమ్ నాథ్ స్పందిస్తూ… తాము కోర్టు రూల్స్ (నిబంధనల) ప్రకారమే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. శంకర్ నారాయణ అభ్యర్థిస్తూ మొత్తం 15 మందిని ప్రతివాదులుగా చేర్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. బనకచర్లపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఆ రాష్ట్రానికి మాత్రమే ఇంజక్షన్ ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నట్టు నివేదించారు. ధర్మాసనం మాత్రం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. ‘అందరికీ ఒకటే రూల్’ అని పేర్కొంటూ… ఈ సూట్ విచారణపై నిబంధనల ప్రకారం రావాల్సిందే అని తేల్చి చెప్పింది. అవసరమైన అన్ని షరతులు పూర్తి చేసిన తర్వాతే ఈ పిటిషన్ ను తిరిగి విచారణకు తీసుకుంటామని జస్టిస్ విక్రమ్ నాథ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా… ఈ పిటిషన్ మరోసారి ఈ నెల 27న కోర్టు ముందుకు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -