– యూరియా యాప్‌ను తక్షణమే రద్దు చేయండి
– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆగ్రహం
నవతెలంగాణ-సత్తుపల్లి
వ్యవసాయ సీజన్ ప్రారంభమై పంటలు చేతికొచ్చే కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్ విధానం అన్నదాతల పాలిట శాపంగా మారిందని, దీనిని తక్షణమే రద్దు చేసి పాత పద్ధతిలోనే ఎరువుల పంపిణీ చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి సత్తుపల్లిలోని విశ్వశాంతి విద్యాలయ ఆవరణలో తెలంగాణ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బొంతు ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. సాంకేతికతను జోడిస్తున్నామన్న నెపంతో ప్రవేశపెట్టిన యాప్ విధానం వల్ల రైతులు పనులన్నీ పక్కనబెట్టి, ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. నెట్‌వర్క్ సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్లు తరచూ డౌన్ కావడం, ఇతర సాంకేతిక లోపాల వల్ల గంటల తరబడి నిల్చున్నా ఫలితం లేక రైతులు ఉత్తి చేతులతో ఇంటికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన సమయంలో యూరియా అందకపోతే పంట ఎదుగుదల దెబ్బతింటుందన్నారు.
ఈ కనీస జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదా..? అని ప్రశ్నించారు. గతంలో ఎలాంటి గందరగోళం లేకుండా సాగిన పంపిణీని కావాలనే సంక్లిష్టం చేసి రైతులను రోడ్డున పడేశారని విమర్శించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వం, తక్షణమే ఈ తుగ్లక్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ప్రభుత్వ మొండి వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రైతు సంఘం డివిజన్ కార్యదర్శి రావుల రాజబాబు, సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ నాయకులు గంటా శ్రీనివాసరావు, అమర్లపూడి శరత్, టీడీపీ నాయకులు పోట్రు రామారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా నాయకులు మోరంపూడి పాండురంగారావు, సీపీఐ(ఎం) సత్తుపల్లి పట్టణ కార్యదర్శి కొలికపోగు సర్వేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతు సంఘం నాయకులు బాల బుచ్చయ్య, మోరంపూడి వెంకట్రావు, కేశవరెడ్డి, రమణ, అరవపల్లి గోపాలరావు, వెంకటేశ్వరావు, కొత్త సత్యనారాయణ, వేపులపాటి కుమారస్వామి, బండి వేలాద్రి, కంచర్ల వెంకటేశ్వరరావు, చాలా రమేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు తడికమళ్ల దాస్, మహిళా సంఘం నాయకులు జాజిరి జ్యోతి, చెరుకు రత్నకుమారి, పుష్పవల్లి, రజిని, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొని యాప్ విధానాన్ని రద్దు చేయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ తీర్మానాలు చేశారు.



