Thursday, July 16, 2026
E-PAPER
Homeఖమ్మంఆయిల్ ఫామ్ సాగులో ఉత్తమ వ్యవసాయ పద్ధతుల అధ్యయనం

ఆయిల్ ఫామ్ సాగులో ఉత్తమ వ్యవసాయ పద్ధతుల అధ్యయనం

- Advertisement -

– భద్రాద్రి జిల్లాలో సీఆర్‌బీ ప్రతినిధుల బృందం పర్యటన
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆయిల్ పామ్ రంగ అభివృద్ధికి మార్గదర్శకంగా ఈ అధ్యయనం దోహదపడుతుందని ఆయిల్ ఫెడ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా డివిజనల్ అధికారి శభావత్ శంకర్ తెలిపారు. సెంటర్ ఫర్ రెస్పాన్సిబుల్ బిజినెస్ (సీఆర్‌బీ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆయిల్ పామ్ రంగంలో అమలవుతున్న ఉత్తమ వ్యవసాయ పద్ధతులు, వినూత్న కార్యక్రమాలు, రైతుల అనుభవాలను నమోదు చేసేందుకు జూలై 13 నుంచి 17 వరకు ప్రత్యేక అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఉన్న ఆయిల్ పామ్ నర్సరీలను సీఆర్‌బీ ప్రతినిధుల బృందం సందర్శించింది. ఆయిల్ ఫెడ్ పూర్వ అధికారి కాముని అశోక్, ఇతర సభ్యులతో కూడిన బృందం ఆయిల్ పామ్ సాగు పురోగతి, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సాంకేతిక పద్ధతులు, రైతుల అనుభవాలు, ఆయిల్ పామ్ విలువ శ్రేణికి సంబంధించిన అంశాలను పరిశీలించింది.

పర్యటన సందర్భంగా రైతుల క్షేత్రాలు, నర్సరీలు, ప్రాసెసింగ్ మిల్లులను సందర్శించిన బృందం రైతులు, అధికారులు, ఇతర భాగస్వాములతో సమావేశమై ఆయిల్ పామ్ సాగులో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను నమోదు చేసింది. ముఖ్యంగా నీటి నిర్వహణ, నేల ఆరోగ్య పరిరక్షణ, సమీకృత చీడపీడల నిర్వహణ (ఐపీఎం), కార్మిక సంక్షేమం, భద్రతా ప్రమాణాలు, సుస్థిర వ్యవసాయ విధానాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ సందర్భంగా డివిజనల్ అధికారి శభావత్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలు, సాంకేతిక సూచనలు, శిక్షణ కార్యక్రమాలు, ఇతర అవసరమైన సేవలను అందిస్తోందన్నారు. ఈ అధ్యయనం ద్వారా తెలంగాణలో అమలవుతున్న ఉత్తమ వ్యవసాయ పద్ధతులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ అధ్యయనం తుది ఫలితంగా తెలంగాణలో అమలవుతున్న సుస్థిర ఆయిల్ పామ్ సాగు విధానాలు, విజయవంతమైన కార్యక్రమాలు, రైతుల అనుభవాలను ప్రతిబింబించే సమగ్ర నివేదిక రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ నివేదిక భవిష్యత్తులో ఆయిల్ పామ్ రంగ అభివృద్ధికి మార్గదర్శకంగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమంలో రజత, ప్రసీత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -