Friday, July 17, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచైనా గురించి ఆయాస పడాలా!

చైనా గురించి ఆయాస పడాలా!

- Advertisement -

‘దీనమ్మ జీవితం’ అన్నట్లుగా చైనాలో ఏ పరిణామం జరిగినా మీడియాలో కొందరు పెద్దలకు పండగే. అధినేత షీ జిన్‌పింగ్ మీద తిరుగుబాటు చేసి కొత్త నేతను ఎన్నుకుంటారంటూ గతంలో ఎంత యాగీ చేసిందీ చూశాము. తరువాత తేలుకుట్టిన దొంగల మాదిరి ఉన్నారు. చైనా ప్రభుత్వం, అభివృద్ధి, సాధించిన విజయాల గురించి ప్రకటించినపుడు అవన్నీ ఉత్తుత్తి అంకెలే అని పిట్టకతలు చెబుతారు. తాజాగా తొలి ఆరునెలల్లో ఆర్థిక రంగంలో తలెత్తిన వడిదుడుకుల గురించి ప్రస్తావించి వివరాలను ప్రకటించింది. దీన్ని పట్టుకొని ఇంకేముంది చైనా అధోగతి పాలవుతోందంటూ చిలవలు పలవలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వర్తమాన సంవత్సరంలో తమ వృద్ధి రేటు లక్ష్యం 4.5 నుంచి ఐదు శాతం వరకు నిర్ణయిం చినట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే ఆరు నెలల్లో వృద్ధి రేటు 4.7శాతమే నమోదైంది. మొదటి మూడు నెలల్లో ఐదుశాతం నమోదు కాగా తదుపరి అది 4.3శాతమే అయింది గనుక సంబర పడుతున్నారు. ‘ఇంకా ఆరు నెలల సమయం ఉంది, ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది అనేక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. తాజా తగ్గుదలను గుణపాఠంగా తీసుకోవాలని’ దేశ పౌరులకు ప్రభుత్వం చెప్పింది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్నప్పటికీ ఆరునెలల్లో 4.7శాతం పెరుగుదలను తక్కువ అంచనావేసి చంకలు కొట్టుకొంటే ఆయాసం తప్ప ఇతర దేశాలకు ఒరిగేదేమీ ఉండదు.

చైనాలో వృద్ధి రేటు ఎందుకు తగ్గిందో తులనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వస్తూత్పత్తి ఫ్యాక్టరీగా పేరు తెచ్చుకున్న చైనా ఇటీవలి కాలంలో తక్కువ ధరల్లో తయారు చేసే వినిమయ వస్తువుల మీద కేంద్రీకరణ తగ్గించింది. అధునాతన సాంకేతిక ప్రక్రియలతో తయారయ్యే, హరిత ఉత్పత్తుల మీద కేంద్రీకరించి పశ్చిమ దేశాలకు సవాలు విసురుతోంది. మార్కెట్‌లో తీవ్రమైన పోటీని ఎదుర్కోవటం అంతతేలిక కాదు, అయినా ‘పరుగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం’ మేలన్నట్టు ముందుకు పోతోంది. చిప్స్, మొబైళ్ల తయారీకి ప్రోత్సాహకంగా రూ.1.89లక్షల కోట్లు కేటాయించినట్లు మన కేంద్ర ప్రభుత్వం పన్నెండేండ్ల తరువాత గొప్పగా ప్రకటించింది.అసలు లేనిదాని కంటే కుంటిదో గుడ్డిదో ఏదో ఒక గుర్రం ఉంటే బండిలాగించవచ్చ న్నట్లుగా ఈ చర్యను పరిగణించాలి. వర్తమాన ప్రపంచంలో యంత్రం నుంచి కాఫీ తీసుకోవాలన్నా, యుద్ధ విమానాలను నడపాలన్నా చిప్ కావాల్సిందే. గూగుల్ కృత్రిమ మేధ చెప్పిన సమాచారం ప్రకారం ప్రస్తుతం చైనా రోజుకు 140 కోట్ల చిప్స్ తయారు చేస్తున్నది. మోడీ ప్రకటించిన రాయితీలు అమల్లోకి వచ్చిన తరువాత మన ఉత్పత్తి రోజు 7.5నుంచి ఎనిమిది కోట్ల వరకు పెరుగుతుందట, అప్పటి వరకు చైనా చేతులు ముడుచుకు కూర్చుంటుందా? చిప్స్ తయారీలో ప్రస్తుతం చైనా తిరుగుబాటు ప్రాంతమైన తైవాన్ రాష్ట్రం, అమెరికా, మొత్తంగా ఐరోపా దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. వాటిని వెనక్కు నెట్టేందుకు చైనా ముందుచూపుతో వ్యవహరిస్తే తిరోగామి ఆలోచనలతో ఉన్న బీజేపీ, దాన్ని సమర్ధించే పార్టీలు దేశాన్ని ఎంత వెనక్కు నెట్టాయో అర్ధం చేసుకోవచ్చు.

వివిధ రంగాలలో దేశం వెనుకబడి ఉండటానికి గాంధీ, నెహ్రూ నాయకత్వాలే కారణమని ఎంతకాలం పనికిరాని మాటలు చెబుతారు? చైనాతో ముడిపడిన సరఫరా గొలుసును బద్దలు కొట్టాలని, భారత్‌ను ప్రత్యామ్నాయంగా తయారు చేయాలని పశ్చిమదేశాలు ప్రయత్ని స్తున్నాయి. నిజమే కదా అనుకొని కేంద్ర ప్రభుత్వం పన్నెండేళ్లు చూసింది. చైనా జెట్ వేగంతో వెళుతుంటే మన భుజాలను మనమే చరుచుకుంటూ విదేశీ పెట్టుబడి అనే కరువని మబ్బులను చూస్తూ ఎడ్ల బండిలో ప్రయాణిస్తున్నాం. వర్తమాన సంవత్సరం జనవరి-జూన్ మాసాల్లో రెండు దేశాల వాణిజ్య లావాదేవీలు రికార్డులను బద్దలు కొట్టి 91.72 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మొత్తంలో మన దిగుమతులే 79.41 బి.డాలర్లు, చైనా వాణిజ్య మిగులు 67.1బి.డాలర్లు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే చైనాకు మనం ఆరునెలల్లోనే అంత మొత్తాన్ని పళ్లెంలో పెట్టి సమర్పించుకున్నాం. ప్రస్తుతం చైనాలో 15వ పంచవర్ష ప్రణాళిక(2026-30) అమలు చేస్తున్నారు. మోడీ అధికారానికి వచ్చిన తరువాత ఏ యేటికాయేడు లక్ష్యాల నిర్దేశంతో దేశాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తానని నిటి ఆయోగ్ అని పేరుపెట్టారు. దాన్ని వంది మాగధులు మోడినోమిక్స్ అని ప్రచారం చేశారు. ప్రధాని ఆర్థిక సలహాదారులు, ఆ సంస్థ సారధులుగా ఎవరు వస్తే వారి బుర్రలో తలెత్తిన ఆలోచనల గురించి చెప్పారు తప్ప మరొకటి కాదు. మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్‌ ఇలా ఎన్ని పేర్లుపెట్టినా పారిశ్రామిక ఉత్పాదకత పెరగలేదు. దిగుమలే దిక్కుగా మారాయి. యావత్ దేశాన్ని దిక్కులేనిదిగా మార్చేశారు. ఎవరైనా ఉద్యోగాలు, ఉపాధి గురించి అడిగితే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల వంటి వారే పరాన్న జీవులు, బొద్దింకలని వర్ణించటాన్ని చూశాము. దాని గురించి మోడీ స్పందించలేదు, మౌనంగా ఉన్నారంటే అర్ధం ఆయనదీ అదే భావజాలం, కాదంటారా!

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -