ఎన్‌టీఏ ప్రశ్నల రూపకర్త నుంచే
కెమిస్ట్రీ ప్రశ్నలు కొనుగోలు : సీబీఐ
రూ.5 లక్షలు చెల్లించి 111 ప్రశ్నలు ముందుగానే సేకరణ
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన కోచింగ్ సెంటర్ యజమాని శివరాజ్ రఘునాథ్ మోటేగావంకర్ ఎన్‌టీఏ ప్రశ్నల రూపకల్పన కమిటీలో సభ్యుడిగా ఉన్న పి.వి కులకర్ణి నుంచి కెమిస్ట్రీ ప్రశ్నలను ముందుగానే పొందేందుకు రూ.5 లక్షలు చెల్లించినట్టు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ).. ప్రత్యేక న్యాయస్థానానికి తెలిపింది. మోటేగావంకర్ బెయిల్ పిటిషన్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ ఈ విషయాలను వెల్లడించింది. మోటేగావంకర్ కుమారుడు కులకర్ణి నిర్వహించే కోచింగ్ తరగతులకు హాజరవుతుండగా.. ఆ తరగతుల ద్వారానే ప్రశ్నలు అందినట్టు సీబీఐ ఆరోపించింది.దర్యాప్తులో భాగంగా మోటేగావంకర్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న సీబీఐ.. అందులో 36 ఫోటోలను గుర్తించింది. వీటిలో ఐదు ఫోటోలు డూప్లికేట్లు కాగా మొత్తం 132 చేతిరాత కెమిస్ట్రీ ప్రశ్నలు ఉన్నాయని తెలిపింది. వీటిలో 111 ప్రశ్నలు ఎన్‌టీఏ రూపొందించిన నీట్-యూజీ 2026 మాస్టర్ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలతో సరిపోలినట్టుగా గుర్తించినట్టు వెల్లడించింది. ఈ ప్రశ్నలను మోటేగావంకర్ స్వయంగా చేతిరాతతో నోట్ చేసుకున్నట్టు అనుమానిస్తున్న సీబీఐ.. ఫోన్ మెటాడేటా విశ్లేషణలో ఆ ఫోటోలు మే 3న జరిగిన పరీక్షకు దాదాపు పది రోజుల ముందే తీసినట్టు తేలిందని పేర్కొంది. అలాగే లీకైన ప్రశ్నలను పొందేందుకు చెల్లించినట్టు ఆరోపిస్తున్న రూ.5 లక్షల నగదును సహనిందితుడు మనోజ్ భగవన్‌రావ్ షిరురే సూచన మేరకు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. నీట్ పశ్న్రాపత్రం లీక్ కేసులో ఇప్పటి వరకు 13 మందిని సీబీఐ అరెస్టు చేయగా.. వారందరూ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ ఏడాది మే 3న నిర్వహించిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అదేనెల 12న పరీక్షను రద్దు చేసిన విషయం విదితమే. అనంతరం జూన్ 21న మళ్లీ పరీక్షను నిర్వహించింది.



