అంతరిక్ష కార్యక్రమానికి అనూహ్య సవాళ్లు
అధిక వేతనాలు, ఆవిష్కరణలతో శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్న ప్రయివేటు సంస్థలు
సంస్థాగత అడ్డంకులతో వెనుకబడుతున్న ఇస్రో
ప్రభుత్వ రంగ సంస్థల్నికేంద్రం హోల్ సేల్ గా అమ్మేస్తోంది. కార్పొరేట్ల కోసం దేశాన్నే తాకట్టు పెట్టేలా మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉద్యోగుల్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థల్నే కాదు..రక్షణ, అంతరిక్ష సంస్థలను ప్రయివేటుపరం చేయటానికి అడ్డదిడ్డమైన జీవోలను జారీ చేస్తోంది. పైగా ఉద్యోగుల తొలగింపు విషయంలో అడ్డంకుల్లేకుండా చేయటానికి వీఆర్ఎస్ ఇవ్వటమో లేక ఇన్నేండ్ల సర్వీసుకు ఇంత ఇస్తామంటూ బీజేపీ సర్కార్ ఉద్యోగులతో మైండ్ గేమ్ ఆడుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ లో కన్నా ప్రయివేటు ఉద్యోగంలోనే బెటర్ ఆఫర్ వస్తుండటంతో..ఇస్రో శాస్త్రవేత్తల్లో సర్వీసులో ఉన్నప్పుడే సెట్ చేసుకుందామన్న ధోరణి వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే వెయ్యిమందికి పైగా ఉద్యోగులు రాజీనామాలు సమర్పించారు. అయితే దీన్ని ఆమోదించవద్దని కేంద్రం హుకుం జారీచేసింది. ఇది ఇస్రో ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : భారత అంతరిక్ష కార్యక్రమం అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రయోగ వైఫల్యాలో లేదా సాంకేతిక ఎదురు దెబ్బలో దీనికి కారణం కాదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో నిష్క్రమించడమే దీనికి కారణం. గత కొద్ది నెలల కాలంలో అంతరిక్ష సంస్థకు వంద మందికి పైగా శాస్త్రవేత్తలు రాజీనామా చేయడమో లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయడమో జరిగింది. శాస్త్రవేత్తల నిష్క్రమణతో అంతరిక్ష విభాగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పరిస్థితిని చక్కదిద్దడానికి… గగన్‌యాన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు రాజీనామా చేయకుండా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ పొందకుండా ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అంతరిక్ష లక్ష్యాలను నిర్దేశించుకుంటున్న సమయంలో ఇస్రోను శాస్త్రవేత్తలు ఎందుకు వదిలిపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది.
స్టార్టప్‌ల జోరు
ఇస్రో నుంచి శాస్త్రవేత్తల నిష్క్రమణకు అనేక కారణాలు కన్పిస్తున్నాయి. మన దేశంలో ప్రయివేటు రంగంలో అంతరిక్ష రంగం అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. అదే సమయంలో ఇస్రోలో ఎదురవుతున్న సంస్థాగత అడ్డంకులతో పాటు ప్రధాన జాతీయ కార్యక్రమాల చుట్టూ అనిశ్చితి నెలకొంది. వీటన్నింటికీ మించి శక్తివంతమైన ప్రయివేటు అంతరిక్ష పర్యావరణ సంస్థ ఆవిర్భావం. ఇవన్నీ ఇస్రో నుంచి శాస్త్రవేత్తల వలసలకు కారణమవుతున్నాయని పరిశ్రమ నిపుణులు, ఆ సంస్థలోని సీనియర్ అధికారులు అభిప్రాయపడ్డారు. 2020లో భారత అంతరిక్ష రంగంలోని ప్రయివేటు భాగస్వామ్యాన్ని అనుమతించినప్పటి నుంచి స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మోస్, పిక్సెల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, ధృవ స్పేస్, దిగంతర వంటి అనేక స్టార్టప్‌లు భారత ఏరోస్పేస్ రంగం యొక్క స్వరూపాన్నే మార్చేశాయి. ఈ స్టార్టప్ కంపెనీలు అనూహ్య వేగంతో రాకెట్లు, ఉపగ్రహాలు, ప్రొపల్షన్ వ్యవస్థలు, అంతరిక్ష ఆధారిత సేవలను అభివృద్ధి చేస్తూ ఇస్రో శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నాయి.
పెరిగిన కెరీర్ అవకాశాలు
ప్రయివేటు కంపెనీలు మెరుగైన వేతనాలు అందిస్తాయి. ఆవిష్కరణలకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తాయి. సంప్రదాయ ప్రభుత్వ సంస్థల మాదిరిగా కాకుండా శాస్త్రవేత్తకు కెరీర్ ప్రారంభ దశలోనే నాయకత్వ పాత్రను అందిస్తాయి. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని ఇస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా పదవీ విరమణ చేసిన పలువురు ఇస్రో సీనియర్ అధికారులు ఏరోస్పేస్ స్టార్టప్‌లను ఏర్పాటు చేయడమో లేదా వాటికి మార్గదర్శనం చేయడమో జరుగుతోంది. దీంతో మన ఏరోస్పేస్ ఇంజినీర్లకు గతంలో ఎన్నడూ లేని విధంగా కెరీర్ అవకాశాలు పెరిగాయి.
ప్రాజెక్టుల అమలులో జాప్యం
అంతరిక్ష కార్యక్రమాల అమలులో అసాధారణమైన జాప్యంతో ఇస్రో సతమతమవుతోంది. గగన్‌యాన్ జీ1 పరీక్షా ప్రయోగం, ఎస్‌ఎస్‌ఎల్‌వీ – ఎల్1, జీఎస్‌ఎల్‌వీ – ఎఫ్17, పీఎస్‌ఎల్‌వీ – ఎన్1 వంటి అనేక ప్రతిష్టాత్మక మిషన్ల అమలుకు నిర్దేశించుకున్న కాలపరిమితి ఇప్పటికే తీరిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలలో రెండు ఎదురుదెబ్బలు తగలడం ఇస్రో ప్రయోగ కార్యకలాపాలను మరింత ఆలస్యం చేశాయి. ప్రధానమైన సాంకేతిక, పరిపాలనా నిర్ణయాలు ఇప్పుడు చైర్మెన్ కార్యాలయంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని, దీంతో ఆమోద ప్రక్రియలో జాప్యం జరుగుతోందని మాజీ అధికారులు తెలిపారు.
సంఖ్య తక్కువే అయినా ప్రభావం ఎక్కువ
పరిస్థితిని చక్కదిద్దేందుకు సీనియర్ అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇస్రో తన ఉద్యోగ నమూనాల కోసం నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వంటి పాశ్చాత్య అంతరిక్ష సంస్థలను పరిశీలించాల్సి ఉంటుంది. గగన్‌యాన్ వంటి ప్రతిష్టాత్మక మిషన్లతో సంబంధం ఉన్న శాస్త్రవేత్తలు ఇస్రో నుంచి బయటికి వెళ్లాలని అనుకుంటే అందుకు అంతరిక్ష శాఖ అనుమతి తప్పనిసరి అవుతుంది. ఇస్రోలో 14,600 మంది ఉద్యోగులు ఉండగా వారిలో బయటికి వెళ్లిన వారి సంఖ్య ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం అధికంగానే ఉంటుంది. ఎందుకంటే
నిష్క్రమిస్తున్న వారిలో చాలా మందికి చంద్రయాన్ – 3, స్పాడెన్స్, గగన్‌యాన్ వంటి మిషన్లలో సంవత్సరాల తరబడి పనిచేసిన సుదీర్ఘ అనుభవం, నైపుణ్యం ఉన్నాయి. కొత్త వారిని నియమించడం ద్వారా వీరి స్థానాన్ని భర్తీ చేయడం సాధ్యపడదు. దేశంలోని అత్యంత మేధావులను ఆకర్షించడమే కాదు వారిని నిలుపుకోవడం కూడా ఇప్పుడు ఇస్రో ముందున్న పెద్ద సవాలు.



