Sunday, July 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చట్టాలు చదవండి.. తీర్పులను విశ్లేషించండి

చట్టాలు చదవండి.. తీర్పులను విశ్లేషించండి

- Advertisement -

నిరంతర అధ్యయనంతో పాటు వృత్తి నైతికత అలవర్చుకోవాలి
యువ న్యాయవాదులకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సూచనలు

నవతెలంగాణ-హైదరాబాద్
న్యాయవాదులు చట్టాలను లోతుగా చదవాలనీ, నిరంతర అధ్యయనంతో పాటు సామాజిక బాధ్యతతో వృత్తి నైతికతనూ అలవర్చుకోవాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు అన్నారు. పి.ఆర్. ఫౌండేషన్ ఫర్ సొసైటీ వెల్నెస్ అండ్ ఎంపవర్మెంట్ (ఎన్జీవో) ఆధ్వర్యం లో యువ న్యాయవాదుల కోసం శనివారం బాగ్ లింగంపల్లిలో ఉచిత వన్డే వర్క్ షాప్ నిర్వహించారు ఇందులో హైకోర్టు ప్రాక్టీస్ లో మెళకువలు, వృత్తిపరమైన నైపుణ్యాలపై హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు పలు కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ సూరేపల్లి నంద, జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ టి. మాధవి దేవి ముఖ్య అతిథులుగా హాజరై యువ న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగించారు.జస్టిస్ సూరేపల్లి నంద మాట్లాడుతూ.. న్యాయవాదులు సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని, క్లయింట్ల పట్ల నిబద్ధతతో పాటు న్యాయస్థానానికి సహక రించే బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. అడ్వకేట్స్ చట్టంతో పాటు వృత్తి నైతికతను ప్రతి న్యాయ వాది తప్పనిసరిగా పాటించాలని అన్నారు.

జస్టిస్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. మంచి న్యాయవాదిగా ఎదగాలంటే ముందుగా చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని, అనంతరం న్యాయస్థానాల తీర్పులను లోతుగా చదవాలని సూచించారు. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం వృత్తి జీవితంలో ఎంతో అవసరమని చెప్పారు. జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి తెలంగాణ రెవెన్యూ సంస్కరణలపై ప్రత్యేక సెషన్ నిర్వహించగా, జస్టిస్ టి. మాధవి దేవి సుప్రీంకోర్టు తీర్పుల విశ్లేషణ, మౌలిక హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశాలపై వివరించారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ రిట్ పిటిషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాల(పి ల్స్)పై అవగాహన కల్పించారు. స్పెషల్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సూరేపల్లి ప్రశాంత్ క్రిమినల్ అప్పీలు, పిటిషన్లపై ప్రసంగించగా, ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేశ్ చంద్ర గౌడ్ భూసేకరణ చట్టాలకు సంబంధించిన అంశాలను వివరించారు. కాగా ఈ కార్యక్రమానికి హాజరైన న్యాయమూర్తులు, వక్తలు, అతిథులకు పి.ఆర్.ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హైకోర్టు అడ్వకేట్ పోనంపల్లి రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డి.ఎల్. పాండు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు అరవింద్ కుమార్ గాడితో పాటు పలువురు సీనియర్, యువ న్యాయవాదులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -