నవతెలంగాణ-ఆలేరు టౌన్
క్రిప్టో పెట్టుబడుల పేరుతో ఆలేరు పట్టణానికి చెందిన వందలాది మంది నుంచి రూ.10 కోట్లు వసూలు చేసి పరారైన ప్రధాన నిందితుడు ఎం.డి. గౌస్‌ను వెంటనే అరెస్టు చేసి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆలేర్ పట్టణంలో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు బాధితులు వినతి పత్రం అందజేశారు. రామంతాపూర్‌కు చెందిన ఎం.డి. గౌస్, అతని భార్య వజీద కలిసి యూనిటీ మెటా (యూనిటీ మేట) కంపెనీ పేరుతో పెట్టుబడులు పెడితే తక్కువ కాలంలో భారీ లాభాలు వస్తాయని ప్రచారం చేసి, 2023 ఫిబ్రవరి నెల నుంచి ఆలేరు పట్టణానికి చెందిన దాదాపు 500 మంది డబ్బులు సేకరించారని, పెట్టుబడిదారులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరడంతో ప్రధాన నిందితుడు ఎం.డి. గౌస్ 2026 ఏప్రిల్ 10 నుంచి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.
ఈ వ్యవహారానికి సంబంధించి ఆలేరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయని, రెండో నిందితురాలు (ఎ 2) వజీదను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపగా, ప్రధాన నిందితుడు (ఎ 1) గౌస్ మాత్రం గత 100 రోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకుని బాధితులకు వారి సొమ్ము తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, మోసానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని బాధితులు వినతి పత్రం తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.డి. మహమూద్, బుషిగంపల శ్రీశైలం, సుంకరి ప్రదీప్, పల్లెకాడి శివ, బిట్కూరి రవి తదితర బాధితులు ఉన్నారు.



