Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‘బిస్లరీ’ యాజమాన్యం ఆటవిక చర్యలు

‘బిస్లరీ’ యాజమాన్యం ఆటవిక చర్యలు

- Advertisement -

నిరసనగా ‘చెట్టుకొమ్మలు కట్టుకుని’ 
కార్మికుల వినూత్న ఆందోళన
40 రోజులుగా సమ్మె పోరాటం
 చట్టాలను ఉల్లంఘిస్తున్నా కార్మిక శాఖకు పట్టదా?
ఈనెల 25న ‘చలో బిస్లరీ పరిశ్రమ’ ముట్టడి : సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్
నవతెలంగాణ-పటాన్‌చెరు

బిస్లరీ యాజమాన్యం ఆటవిక చర్యలు, మొండి వైఖరి వల్ల తాము రోడ్డున పడ్డామని నిరసిస్తూ కార్మికులు సోమవారం చెట్టు కొమ్మల్ని కట్టుకుని వినూత్న పద్దతిలో ఆందోళన నిర్వహించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధి పాశమైలారంలోని బిస్లరీ పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రోజుకో పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు, బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ మాట్లాడుతూ బిస్లరీ యాజమాన్యం కార్మికుల పట్ల ఆటవికంగా వ్యవహారిస్తున్న తీరును ఎండగట్టేందుకే చెట్టుకొమ్మలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశామన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ యాజమాన్యం కార్మికులను అన్యాయంగా విధుల నుంచి తొలగించిందన్నారు. న్యాయం కోసం కార్మికులు 40 రోజులుగా సమ్మె పోరాటం చేస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు, కార్మిక శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడంలేదని నిలదీశారు. 13 ఏండ్లుగా కార్మికులు బిస్లరీ పరిశ్రమ అభివద్ధి కోసం ఎంతో శ్రమించారన్నారు. ఒక్క ప్లాంట్ పెట్టిన యాజమాన్యం కార్మికుల శ్రమ ద్వారా లాభాలు సంపాదించిన ఎన్నో ప్లాంట్లను ఏర్పాటు చేసి వేల కోట్లను గడిస్తుందని విమర్శించారు. తమ హక్కులు, ఉద్యోగ భద్రత కోసం కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యం కక్ష సాధింపుతో ఐదుగురు యూనియన్ నాయకుల్ని అక్రమంగా తొలగించిందన్నారు. కార్మికుల్ని విధులోంచి తొలగించి తొమ్మిది నెలలైనా యాజమాన్యం మొండిగా వ్యవహారిస్తుందని ఆరోపించారు. చట్టాలను ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కార్మిక శాఖ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులోకి తీసుకోవాలన్నారు. వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు. ‌బిస్లరీ యాజమాన్యం మొండి వైఖరికి వ్యతిరేకంగా జులై 25న ‘చలో బిస్లరీ పరిశ్రమ’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ ముట్టడి కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రాజు, యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి, నాయకులు నాగరాజు, నవీన్, అజయ్, ప్రవీణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -