Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం

వ్యవసాయానికి పరిశ్రమల తోడ్పాటుతోనే లాభం

- Advertisement -

రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుంది
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ఖమ్మంలో గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ 
ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభం
నవతెలంగాణ-కొణిజర్ల

వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేసి విలువ ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహిం చినప్పుడే రైతుల ఆదాయం స్థిరంగా పెరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురంలో తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన గోద్రెజ్ సమీకృత ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లా వ్యవసాయానికి చిరునామాగా నిలిచిందన్నారు. సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి అధిక ఆదాయం ఇచ్చే వాణిజ్య పంటల సాగులో రైతులు విస్తరించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు చేపట్టే రైతులకు నాలుగు సంవత్సరాల్లో ఎకరాకు సుమారు రూ.52 వేల వరకు ప్రోత్సాహకాన్ని అందిస్తోందని తెలిపారు. దేశంలో ప్రస్తుతం వంటనూనెల అవసరాల కోసం భారీగా దిగుమతులు చేసుకోవాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని మార్చేందుకు ఆయిల్ పామ్ సాగు విస్తరణ అవసరమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన సమీకృత ఆయిల్ పామ్ పరిశ్రమ రైతులకు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ పరిశ్రమలో సీడ్ గార్డెన్, మిల్లింగ్ యూనిట్, రిఫైనరీ వంటి సౌకర్యాలు ఒకే ప్రాంగణంలో ఉండటం విశేషమన్నారు. 113 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ గంటకు 60 నుంచి 120 టన్నుల ఆయిల్ పామ్ గెలలను ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఖమ్మం జిల్లాలో మరిన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని, కొణిజెర్ల మండలాన్ని భవిష్యత్తులో పారిశ్రామిక మండలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

10 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ విస్తరణ లక్ష్యం : మంత్రి తుమ్మల రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 3 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దానిని 10 లక్షల ఎకరాలకు విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలోనే తొలి ఆధునిక ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్‌ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రైతులకు నాణ్యమైన మొక్కలు, శాస్త్రీయ సాగు విధానాలు, సాంకేతిక సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రతి 10 వేల ఎకరాలకు ఒక ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. సూపర్ ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు రైతులకు స్థిరమైన ఆదాయం అందించే ప్రత్యామ్నా యాలుగా నిలుస్తాయని చెప్పారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ విధానమని తెలిపారు.

దేశంలో తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఖమ్మంలో తొలి సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశామని గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో సునీల్ కటారియా తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఖమ్మంలో ఏర్పాటు చేయనున్న సీడ్ గార్డెన్ ద్వారా రైతులకు నాణ్యమైన ఆయిల్ పామ్ మొక్కలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 3.36 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, గత మూడేండ్లలోనే 2 లక్షల ఎకరాల కొత్త విస్తీర్ణం పెరగడం దేశంలోనే అత్యధికమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ ఇండస్ట్రీస్ చైర్మెన్ నాదిర్ బి. గోద్రెజ్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఆయిల్ పామ్ రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -