హైదరాబాద్‌లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)లో తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్పులు వెలువడి నెలలు గడుస్తున్నా, ఆర్డర్ కాపీల విడుదలలో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై పిటిషనర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోర్టు హాల్లో కొందరు జడ్జీలు, అడ్మినిస్ట్రేటివ్ సభ్యులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారంటూ న్యాయవాదులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పరిస్థితులు ఎంతలా దిగజారాయంటే.. కోర్టు హాల్లో ప్రస్తుత న్యాయవాదులు, అడ్మినిస్ట్రేటివ్ సభ్యుల ప్రవర్తనకు నిరసనగా ‘క్యాట్’ న్యాయమూర్తులు అందరూ ఇటీవల ఒక రోజు కోర్టు విచారణలకు హాజరు కాకుండా ఏకంగా విధులను బహిష్కరించిన సంఘటన కూడా చోటుచేసుకుంది. న్యాయవ్యవస్థ చరిత్రలోనే ట్రిబ్యునల్ న్యాయమూర్తులే ఈ విధంగా నిరసన తెలపడం ఇక్కడి అసాధారణ పరిస్థితులకు, అంతర్గత వివాదాలకు అద్దం పడుతోంది. అధి కారుల తీరుపై న్యాయవాదులు, న్యాయవాదుల ప్రవర్తనపై జడ్జీలు పరస్పరం అసంతృప్తితో ఉండటంతో ట్రిబ్యునల్ వాతావరణం పూర్తిగా దెబ్బతిన్నదని, దీనివల్ల అంతిమంగా తామే నష్టపోతున్నామని పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది (2026) జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే పలు కేసుల్లో తుది తీర్పులు ఇచ్చినప్పటికీ.. దాదాపు ఐదారు నెలలు గడుస్తున్నా నేటికీ ఆర్డర్ కాపీలను విడుదల చేయకపోవడం అధికారుల అశ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. నమ్మశక్యం కాని విషయమేమిటంటే.. గతేడాది (2025) జూన్, జూలై నెలల్లో ఇచ్చిన తీర్పులకు సంబంధించిన ఆర్డర్లు ప్రస్తుతం టైప్ అవుతున్నట్లు సమాచారం. అంటే ఒక ఆర్డర్ కాపీ చేతికి రావడానికి దాదాపు ఏడాది కాలం పడుతుండటంతో పిటిషనర్లు ఏ స్థాయిలో మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురవు తున్నారో అర్థం చేసుకోవచ్చు. దీనిపై పిటిషనర్లు తమ న్యాయవాదులను ఆశ్రయిస్తే.. ‘‘ఇంకా ఆర్డర్స్ రిలీజ్ కాలేదు’’ అనే సమాధానమే వస్తుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు.
తీర్పులిచ్చిన తర్వాత కూడా ఆర్డర్ కాపీ సకాలంలో రావడం లేదని హైదరాబాద్ క్యాట్ ప్రస్తుత అధికారులపై ఉన్నతాధికారులకు అధికారికంగా కంప్లైంట్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని న్యాయవాదులు వాపోతున్నారు.
అన్ని సాక్ష్యాధారాలు ఉండి, నిబంధనలకు అనుగుణంగా బలంగా న్యాయవాదులు వాదించినా కూడా విచారణల సందర్భంలో కేసులు డిస్మిస్ అవుతున్నాయని కొందరు పిటిషనర్లు ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ ఎట్టకేలకు ఆర్డర్ కాపీ చేతికి వచ్చినా, దాంతోనే పని పూర్తికావడం లేదు. ఆ తీర్పుల అమలు కోసం తిరిగి సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. న్యాయం కోసం దరఖాస్తు చేసుకున్న తాము.. అటు ‘క్యాట్’ కార్యాలయం, ఇటు అధికారులు, అడ్వకేట్ల చుట్టూ తిరగలేక మానసికంగా, ఆర్థికంగా కుంగిపోతున్నామని, ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే ఆర్డర్ కాపీలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి పదేండ్లు దాటినా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేకంగా పూర్తిస్థాయి ‘క్యాట్’ బెంచ్‌ను ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఏపీకి సంబంధించిన కేసుల విచారణ కోసం హైదరాబాద్ క్యాట్ జడ్జీలే నెలలో సుమారు పదిహేను రోజుల పాటు విజయవాడ లోని తాత్కాలిక సర్క్యూట్ బెంచ్‌కు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ విడిగా శాశ్వత బెంచ్ లేక పోవడం వల్ల ఇటు హైదరాబాద్‌తో పాటు అటు ఏపీ కేసుల పరిష్కారం కూడా తీవ్రంగా ఆలస్యమవుతోంది.
ఈ అగచాట్లకు స్వస్తి పలకాలని, ఏపీలో తక్షణమే పూర్తిస్థాయి శాశ్వత ‘క్యాట్ బెంచ్’ ఏర్పాటు చేయాలని పిటిషనర్లు, న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ఎస్.ఎస్.ఆర్.ఎ. ప్రసాద్, 9490300867
తీర్పులు సరే… మరి ఆర్డర్లేవీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



