Wednesday, July 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసీఎంకు తెలిసింది ఒట్లు.. తిట్లే..

సీఎంకు తెలిసింది ఒట్లు.. తిట్లే..

- Advertisement -

కండ్ల ముందే గోదావరి ఎల్లంపల్లికి ఎత్తిపోయటంలో విఫలం
కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చినది : కేటీఆర్‌
పంటలను కాపాడుకునేందుకు వెళ్లి ప్రాణం కోల్పోయిన రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం

నవతెలంగాణ-లక్షెట్టిపేట
​‘‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తిట్లు.. ఒట్లు తప్ప ఏమీ చేతగాదు.. అబద్ధాలు, విద్వేషాలు, బూతులతో ప్రజలను రెచ్చగొట్టడమే పని. ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. ఇచ్చే వ్యవస్థ ఉన్నా జనాలకు అందించలేని అసమర్థ పాలన..’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. గోదావరి నీరు కండ్ల ముందే ప్రవహిస్తున్నా ఎల్లంపల్లికి ఎత్తిపోసే విషయంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, కన్నెపల్లి పంపులు కూడా ఆన్‌ చేయడం లేదని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అంటూ వ్యాఖ్యానించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మంగళవారం నిర్వహించిన రైతు సదస్సులో కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాగే, అకాల వర్షాల సమయంలో పంటలను కాపాడుకునేందుకు వెళ్లి ప్రాణం కోల్పోయిన నలుగురు రైతు కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఈ సహాయం చేస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వం పంటలను కొనుగోలు చేయకపోవడంతో వాటిని కాపాడుకునే క్రమంలో రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బాధిత కుటుంబాలను పూర్తిగా ఆదుకోలేదని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 32 నెలల్లో నాలుగు సార్లు రైతుబంధు నిలిపివేశారని అన్నారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందేదని తెలిపారు. ఇప్పుడు యాప్‌ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

మూడు పిల్లర్లు కుంగడం వాస్తవమే
కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, వేల కిలోమీటర్ల కాల్వల వ్యవస్థ అని కేటీఆర్‌ వివరించారు. 85 పిల్లర్లలో మూడు పిల్లర్లు కుంగిన విషయం వాస్తవమేనని, వాటిని మరమ్మతు చేయడం సాధ్యమేనని చెప్పారు. కరువుకు కాళేశ్వరం ప్రాజెక్టే శాశ్వత పరిష్కారమని తెలిపారు. రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని, నిరుద్యోగ భృతి, కౌలు రైతుల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కూడా తన విధానాన్ని మార్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు. పోలీసులు తమ విధులు నిర్వర్తించాలని, అతిగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ఉద్యమకారులకు తుపాకులు ఎక్కుపెట్టిన జాతి మాది కాదని సీఎం రేవంత్‌రెడ్డినుద్దేశించి కేటీఆర్‌ విమర్శించారు. ‘‘సమైక్యవాదుల సంకన చేరి, సంచులు మోసిన జాతి మాది కాదు. తెలంగాణలో రెండు జాతులే. ఒకటి ప్రేమించే జాతి.. మరొక్కటి వంచించే జాతి. ఇందులో ఎవరిది ఏ జాతో ప్రజలకు తెలుసు’’ అని చెప్పారు. యువత చేతికి రేవంత్‌ రెడ్డి దొరికితే పొట్టు పొట్టు కొట్టేటట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో మళ్లీ రైతు ప్రభుత్వం రావాలి అంటే కాంగ్రెస్‌ నాయకులను ఉరికించి తరమాలన్నారు. అప్పుడే తెలంగాణలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో రైతు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -