ఓదేశం నాశనం అవ్వా లంటే పెద్ద యుద్ధాలే జరగనవసరం లేదు, అణుబాంబులే పడాల్సిన పనిలేదు. ఆ దేశంలోని విద్యావ్యవస్థపై ప్రజలకు నమ్మకం సడలిపోతే చాలు. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థపై ఉద్భవించిన ఆగ్రహా నికి ప్రతీకగా నిలిచిన వ్యక్తి సోనమ్ వాంగ్ చుక్. ఆయన జూన్ 28న ఢిల్లీలో మొదలు పెట్టిన నిరాహార దీక్షకి ఎంతో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, విద్యార్థులు, మేధావుల నుంచి భారీ మద్దతు లభించింది. కానీ ఆయన చేపట్టిన దీక్ష పట్ల ప్రభుత్వం స్పందించిన తీరు మాత్రం అప్రజాస్వామికంగా ఉంది. ఆయన పోరాటం ముగియకముందే… జూలై 18న అక్రమంగా దీక్షా శిబిరం నుంచి తరలించింది. ఆయన ఎవర్నీ కొట్టలేదు, బంధించలేదు, హింసించనూ లేదు. ప్రభుత్వం దిగొచ్చి, చర్చలు జరిపి, సమాధానం ఇవ్వాల్సింది పోయి, ఇలా చెప్పాపెట్టకుండా ఆయన్ను బలవంతంగా లాకెళ్లి ఆస్పత్రిలో పడేసింది. తమ కోసం నిలబడి, ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రాణాన్ని పణంగా పెట్టిన వాంగ్‌చుక్ కోసం వేలాది మంది విద్యార్థులు తరలిరావడం మంచి పరిణామం. కానీ, వారు అనుకున్న తీరుగా సర్కార్ నుంచి ఆశించిచన స్పందన లేదు. ఇది నీతి,నిజాయితీ లేని చిత్తశుద్ధిలేని ప్రభుత్వం కదా! అందుకే పేపర్ లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని, నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని అంతకుముందే పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధర్యంలో యువత, విద్యార్థులు ఆదివారం చేపట్టిన శాంతియుత నిరసనపై పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపింది. విద్యార్థి, యువతను రక్తం కారేలా హింసించింది. ఇదంతా చూస్తే మనది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? లేక రాచరిక వ్యవస్థనా? అన్న ప్రశ్నలు సామాన్యపౌరుల్లో తలెత్తడం సహజం.
నేను చాలా వరకు విన్న ప్రశ్నలు ఏంటంటే… ‘అవును పేపర్ లీక్ ఎప్పుడూ జరిగేలా జరిగింది. క్షమాపణ కూడా ముగిసింది. అన్ని చోట్లా జరగలేదని తెలిసింది. ముందు ముందు జరగకుండా చూస్తామనే వాగ్దానం జరిగింది. మరెందుకీ దీక్ష? ఎందుకీ యాత్ర? ఎందుకు ఈ అన్యాయమనే అరుపులు? ఎందుకు ప్రభుత్వంపైన ఈ అసంతృప్తి?’ వీటన్నింటికీ సమాధానాలు లేకపోలేదు. నీట్ పేపర్ లీక్ జరగడం ఇది మొదటిసారి కాదు. మొట్టమొదటగా 2015లో జరిగింది. అప్పుడు నీట్ స్థానంలో ఉన్న ఎఐపిఎంటి ప్రశ్నా పత్రాలు లీక్ అవడం వల్ల సుప్రీం కోర్టు ఆ పరీక్షను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది. కొన్ని రాష్ట్రాల్లో కొంత మంది చేసిన తప్పుకి కొన్ని వేల మంది మళ్లీ పరీక్ష రాయాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా 2024 లో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ దేశంలోనే పెద్ద వివాదంగా మారింది. అప్పుడు మళ్లీ విచారణ జరిగింది. దాని సందర్భంగా కొందరిని అరెస్ట్ చేసి, Public Examinations ( Prevention of Unfair means) Act 2024 అనే ఓ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ముఖ్య ఉద్దేశ్యం పరీక్ష పత్రాల లీక్‌ని ఆపి, మరింత భద్రతగా పరీక్షలు నిర్వహించి, ఎటువంటి తప్పిదాలు జరగకుండా చూడడం. చట్టమైతే కొత్తది మొదలైంది కానీ ఇప్పుడు 2026 లో జరిగిన పేపర్ లీక్ చూస్తుంటే దాని అమలు ఎంతగా జరిగిందో స్పష్టంగా చెప్పనవసరం లేదు.
ఒక పరీక్షా పత్రం లీక్ అవడం వల్ల ఎవరికి నష్టం? కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు అది పూర్తి దేశానికి నష్టం. ఎందుకంటే ఇక్కడ ఓ పోటీ పరీక్షంటే కేవలం మూడు గంటల ప్రక్రియ కాదు, దాని వెనుక ప్రతీ ఒక్కరికి కొన్ని సంవత్స రాల శ్రమ ఉంటుంది. పండగలు పబ్బాలనీ లేకుండా, ఎన్నో సరదాలను కాదనుకున్న రోజులుంటాయి. తిండీ.. నిద్రను పక్కనపెట్టి, రేయింబవళ్లు పుస్తకాలను చూస్తూ గడిపిన కండ్లుంటాయి. తల్లిదండ్రులు చేసిన త్యాగాలుంటాయి. ఓ సీటు కోసం కన్న లక్షల కలలుంటాయి. ఓ పరీక్షే కదా రద్దయిపోయిందని చూసేవాళ్లనుకున్నంత తేలిక కాదు దాన్ని భరించడం. ఇదేదో సాధారణంగా మొదటిసారి జరిగిన పేపర్ లీక్ కాదు. మూడు సార్లు ఓడిన ఓ వ్యవస్థకు ఈ విద్యార్థి తరం ఇచ్చిన ఆఖరి అవకాశం. దాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతే… దీన్ని ఏ రకమైన ప్రజాస్వామ్యం అనగలం? ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్లను కోల్పయినవాళ్లు కుంగిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో రంగాల్లో స్కాములు జరిగాయి, ఎన్నో రకాల అవినీతులు మొదలయ్యాయి. ఇప్పుడు అందులో విద్యావ్యవస్థ కూడా చేరిపోవడం జీర్ణించుకోలేని నిజంలా మారింది. ఇప్పుడు దేశంలో చేపట్టిన శాంతియుత దీక్షలు, నిరసనలు, ఆందోళనలు వ్యవస్థలోని లోపాలకు, అన్యాయాలకు ప్రతీకలు. అయితే దేశంలోని అతి కొద్ది మంది కోరుకుంటున్నట్లు ఈసారి కూడా అన్యాయమే గెలవొచ్చు. విద్యార్థి ఓడిపోవచ్చు కానీ దాని వల్ల కేవలం విద్యార్థులకే నష్టం అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వమే. దేశం మీద, ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం గనుక కోల్పోతే… అది కచ్చితంగా దేశం మొత్తానికి ఓ తీరని శాపంగా మారుతుంది.
చదువుతున్న విద్యార్థులంతా… నేను ‘‘నిజాయితీగా చదివితే మాత్రం సరిపోతుందా? ఈ దేశంలో నా చదువుకి విలువుందా?’’ అన్న ప్రశ్న ఉదయిస్తే… ఒక దేశానికి ఇంతకంటే ప్రమాదకరమైన క్షణం మరొకటి ఉండదు. ప్రతీ వ్యవస్థలో పొరపాట్లు జరుగుతాయి. కానీ అలాంటి తప్పిదం జరిగినప్పుడు దాన్ని అంగీకరించి, విశ్లేషించి, తగిన చర్యలను తీసుకుని, నష్టపరిహారాలను భరించి, పోగొట్టుకున్న వస్తువుని జనానికి తిరిగివ్వడం మాత్రమే కాదు, అది మళ్లీ జరగదని హామీ ఇవ్వగలగాలి. ఇచ్చిన దాని మీద నిలబడగలగాలి. అంతే కానీ ప్రశ్నించిన వాళ్లను దేశద్రోహులనడం, ఆడపిల్లలూ… పిల్లలూ అని చూడకుండా, హక్కుల కోసం నిలబడిన వాళ్లను హింసించడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కేవలం చట్టాలు చేయడం మాత్రమే కాదు, వాటిని భద్రతగా అమలు చేయగలగాలి. అలా చేయలేనప్పుడు, వ్యవస్థ విఫలమై, దాన్ని ఒప్పుకోనప్పుడు ఎవరో ఒకరు ఇలా దేశం ముందుకొచ్చి నిలబడతారు. ఒక్కరిగా మొదలై, కోట్ల మందికి విస్తరిస్తారు. వాల్ల ఆకలి అన్నానికి అతీతమై ఉంటుంది. ఈ రోజు ఒక్క వాంగ్ చుక్ మాత్రమే కాదు. దేశం మొత్తం ఆకలితోనే ఉంది. న్యాయం కోసం, పారదర్శకత కోసం, జవాబుదారీతనం కోసం, ప్రజాస్వామ్యం కోసం దేశం మొత్తం ఆకలితోనే అలమటి స్తోంది. పరీక్ష పేపర్ లీక్ అయిన ప్రతీసారి కేవలం పరీక్ష మాత్రమే రద్దు కాదు, ప్రభుత్వం మీద విద్యార్థి ఉంచిన నమ్మకం కూడా అదేస్థాయిలో కరిగిపోతోంది. మంచి విద్యావ్యవస్థ లేని దేశం ప్రజాస్వామ్యంగా నిలబడలేదు. ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వం ఎన్నటికీ మనజాలదు. చరిత్ర చెబుతున్న సత్యమిదే.
వెన్నెల ఆరా, 8008861369



