– చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్ రామాల
– వీవీ టెక్నో స్కూల్‌లో ఆరోగ్య అవగాహన కార్యక్రమం
నవతెలంగాణ-సత్తుపల్లి
శుచి, శుభ్రతను పాటించడం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ‘న్యూ స్టార్’ చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రధాన వైద్యులు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ సురేష్ రామాల పేర్కొన్నారు. శనివారం స్థానిక వీవీ టెక్నో స్కూల్‌లో న్యూ స్టార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సురేష్ రామాల 5 నుంచి 13 సంవత్సరాల వయసున్న విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించారు. చిన్నారులు ప్రతిరోజూ వేళకు నిద్రపోవడం, ఉదయాన్నే లేవడం, శుభ్రమైన నీటిని తాగడం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, రోజూ స్నానం చేయడం, ఉదయం రాత్రి రెండుసార్లు దంతాలను తోముకోవడం తప్పనిసరి అని తెలిపారు.
జంక్ ఫుడ్, శీతల పానీయాలు, అధిక చాక్లెట్లు, ప్యాకెట్ ఫుడ్స్ వంటి హానికర ఆహారాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని విద్యార్థులకు వివరించారు. పాలు, గుడ్లు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాల వంటి పోషకాహారాన్ని రోజువారీ డైట్‌లో భాగం చేసుకోవాలన్నారు.
ప్రతిరోజూ కొంత సమయం ఆటలు ఆడడం, శారీరక వ్యాయామం చేయడం శరీరానికి ఎంతో ఆరోగ్యకరమని తెలిపారు. మొబైల్ ఫోన్లు, టెలివిజన్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలే తప్ప, స్వయంగా మందులు వాడకూడదని హెచ్చరించారు.
కార్యక్రమంలో విద్యార్థులు తమకు ఉన్న పలు ఆరోగ్య సంబంధిత సందేహాలను వైద్యులను అడిగి నివృత్తి చేసుకున్నారు.ఈ అవగాహన సదస్సులో ఈఎన్టీ స్పెషలిస్ట్ మద్దిశెట్టి ఉమేష్ పాల్గొని విద్యార్థులకు ఆరోగ్య సూచనలు చేశారు. పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ సురేష్ రామాల తెలిపారు.



