Sunday, July 26, 2026
E-PAPER
Homeసోపతికేవలం భాష మాత్రమే కవిత్వం అవ్వదు

కేవలం భాష మాత్రమే కవిత్వం అవ్వదు

- Advertisement -

పడిదం రాజేందర్‌ పాట కవి. ఇప్పుడిప్పుడే వచన కవిత్వ రహస్యాల్ని ఛేదిస్తున్న వ్యక్తి. సాహిత్యాన్ని జీవితంతో పెనవేసుకున్న కవి. ‘అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నా నర్సంపేట’, ‘ఏమి సినిమాలు తీస్తున్నరయ్యా ఓ దర్శక నిర్మాతలారా’, ‘నా పేరు చీపురు గట్టరా’.. వంటి పాటలతో తన కలాన్ని, గళాన్ని పదునుపెట్టుకుంటూ ఎదిగి వస్తున్న ‘అక్కల్‌ చెడ’ గ్రామం ముద్దు బిడ్డ. తెలంగాణ పలుకుబడుల భాష అతని అక్షరానికి అదనపు విలువ. సాధారణ ప్రజల భాష, కవిత్వభాష పురాగ ఒకటి కాకపోయినా తెలంగాణ జానపదులు ప్రజల భాషకు పట్టంగట్టి కవిత్వతావిని అద్దినట్టే అనిపిస్తది.

ఒక కవిని యితరుల నుండి వేరుచేసి చెప్పగలిగేది అతని/ ఆమె వ్యక్తీకరణ సజన నైపుణ్యమని చెప్పవచ్చు. తిట్టు పదం అనిపించే ఊతపదాన్ని శీర్షికగా ప్రకటించడం (మొద్దు మొఖంల కట్టె), ప్రేమైక వ్యక్తీకరణగా ఒప్పించడం, పాఠకుల్ని మెప్పించే ప్రయత్నం చేయడం అంతా ఒక ‘విరోధాభాస’. తల్లిదండ్రుల మధ్య వున్న గాఢమైన, అనురక్తికి, పటిష్టమైన బంధానికి, పాయిరానికి సూచికగా ‘శీర్షిక’ను నిల్పడం కొత్తగా ధ్వనిస్తది. ఎత్తుగడను నేటుకర్రలా ఉపయోగించడం వ్యాఖ్యానపు సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తది. శ్రమజీవి గుణాల్ని పోతపోసిన ‘అయ్య’ వ్యక్తిత్వాన్ని, ‘కంకి ఇర్వని, పండు ముట్టని, కాయ దుస్సని’ వంటి నిర్దిష్ట అంశాల ఆధారంగా పదిలపరుస్తడు. ‘సెమట సిందంది తింటె ఒంటికి సేదైతదని’ సూత్రీకరణను బలపరుస్తడు. నీతి నిజాయితీలను ‘జీవితకాల మాల’గా చెప్పడం, సింగినేల నివ్వెర పోయేంత నియ్యతి మనిషి అని ప్రతిపాదించడం, అందుకు తగిన భావనల్ని ప్రవేశపెట్టడం కనిపిస్తది. బోలాకోరుతనం, బొంకని తనం, కుట్రబాజితనం లేకపోవడం మొదలైన వ్యక్తీకరణలు సాక్ష్యాలుగా నిలబడుతయి.

అసాధారణ పోలికలు అతిసాధారణం అనిపించే వ్యక్తిత్వ పాత్ర చిత్రణ కవిత్వపు వస్తు బలాన్ని చూపెడుతది. (కాడు గోసరిల్లి గొల్లుమనడం) ‘గజానికొక్కల భుజాలు మోసిన పాడె’ అనడం అయ్య బతికిన తీరును కండ్ల ముందుంచుతది. ‘కష్టాల కంటితీగలు’ వంటి ప్రతీకలు కవిత్వ నడకను తేట పరుస్తయి. ఒక వైపు తండ్రి ఔన్నత్యాన్ని చెప్పడంతో పాటు సమకాలీన రాజకీయాలకు చురకలు అంటించడం, గ్రామీణుల జీవన రీతుల్ని, స్వభావాల్ని గౌరవ ప్రదమైన స్థాయిల్ని, ఊరుమ్మడి బతుకుల్ని తడి తడిగా పలికించడం, ఆర్ద్రతను జోడించడం మూలంగా కవిత ఆసాంతం ఆధునిక మానవుని అస్తిత్వాన్ని ప్రశ్న గుర్తుకు వేలాడ దీస్తది. కవిగా కొనసాగగలిగే ప్రయాణానికి మునుంబట్టినందుకు ‘పడిదం రాజేందర్‌’కు శుభాకాంక్షలు.

– బండారి రాజ్‌ కుమార్‌, 8919556560

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -