1936లో ఇండియన్ ఆర్ట్ సినిటోన్ వారి ‘ప్రేమ విజయం” తొలి తెలుగు సాంఘిక చిత్రంగా విడుదలై తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చిత్ర దర్శకుడు ఆ కాలంలో కాలేజ్ గర్ల్ నాటకంతో ప్రసిద్ధుడైన కత్తివెంటి నాగేశ్వరరావు. ఐతే అప్పటివరకు నాటకాల ప్రభావంతో పౌరాణిక చిత్రాలకు అలవాటు పడిన మన తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ తొలి తెలుగు సాంఘిక చిత్రాన్ని అంతగా ఆదరించక పోవడం వల్ల పరాజయం పాలయింది.
అయితే ఈ ప్రేమ విజయం సినిమాలో ముగ్గ మోహన రూపంగల ఒక యువతి కోయవాడ చిట్టెమ్మ వేషంలో ‘చుక్కల కోక చుట్టుకుని, చుట్టూ గోటా రవికే తొడిగి’ అనే పాట పాడుతూ జానపద నత్య రూపంలో వేసిన గంతులను చూసిన తొలితరం సినిమా ప్రేక్షకుల స్మతిపథంలో ఆ పాత్ర శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంది. అలా అప్పటి నుండి గడిచిన ఈ యాభై ఏండ్ల కాలంలో దాదాపు రెండు వందల తెలుగు చిత్రాలలో చిన్నా పెద్దా పాత్రలలో కనిపించి తెలుగు ప్రేక్షక జనసామాన్యానికి అభిమాన నటిగా చేరువైంది.
తెలుగు తెరపై, రంగస్థలంపై, సుమారు 70 ఏండ్ల పాటు నటించిన గంగారత్నం సినిమారంగంలో ప్రవేశించే నాటికే రంగస్థలంపై మంచి పేరు గడించిన నటి. అవి స్త్రీలు వీధుల్లోకి రావడాన్నే తప్పు పట్టే రోజులు. అలాంటి కాలంలో గంగారత్నం రంగస్థలంపై కాలుమోపి నటనే వత్తిగా ఎంచుకున్నది. జీవితంలో ఎదురైన వ్యక్తిగత సమస్యలను అధిగమించడానికి, ఇంకా చెప్పాలంటే పొట్ట పోసుకోవడానికి ఒక ఒంటరి స్త్రీగాఎంతో పోరాడింది. తనకి ఎవరూ ఆలంబనగా లేకపోవడంతో రంగస్థలంపై నటించడమే మార్గంగా కనిపించి తన నట జీవితాన్ని మొదలుపెట్టింది.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గంగులకుర్తి అగ్రహారంలో పిప్పర కామాక్షమ్మ, సాంబశివరావు దంపతులకు 1892లో జన్మించిన గంగారత్నం చిన్నతనాన్నే తల్లిదండ్రులు మరణించడంతో పలు కష్టాలకు లోనయింది. సమీప బంధువుల సంరక్షణలో పెరిగిన ఆమె పదహారేళ్లయినా నిండకముందే జవ్వాది వెంకటరత్నంతో బాల్య వివాహం జరిగింది. 17వ ఏటనే భర్తమరణంతో బాల వితంతువుగా మారింది. అప్పటికే ఆమె ఇద్దరు బిడ్డల తల్లి. ఐతే గంగారత్నం కళ్ళు ముక్కు తీరుగా ఉండి ఎత్తుగా ఉండేది. రంగస్థలంపై నటించడానికి అవి ఆమెకు కొంత ఉపయోగపడినవి. జీవిక కోసం తనకు అభిరుచిగల నాటక రంగంలో కాలు మోపిన ఆమె జొన్నవిత్తుల శేషగిరిరావు ‘హరిశ్చంద్ర’ నాటకంలో మొదటిసారి ‘కలహకంఠి’ పాత్రలో విజయవాడలో జరిగిన ప్రదర్శనలో నటించింది. తరువాత ఇదే పాత్రను పలుసార్లు పోషించి మెప్పించిన ఆమె రంగస్థలంపై నాడు మహామహులైన స్థానం నరసింహారావు, యడవల్లి సూర్యనారాయణ, గోవిందరాజుల సుబ్బారావు, ఉప్పులూరి సంజీవరావు, నెల్లూరు నాగరాజారావు వంటి దిగ్ధంతులతో కలిసి నటించింది. ఇంకా ఆమె సక్కుబాయి నాటకంలో అత్తగా, కష్ణ తులాభారంలో నళిని పాత్రలకు జీవం పోసింది. కాళ్లకూరివారి చింతామణి నాటకంలో వేశ్యమాత శ్రీహరి వేషానికి అప్పట్లో గంగారత్నం పెట్టింది పేరు. వేశ్యమాతగా ఆమె మాట్లాడిన వగలమారి మాటలు, వయ్యారాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టేవి. ఈ పాత్రను ఆమె కొన్ని వందల సార్లు పోషించింది
.
ఈమెకు ముందు ‘చింతామణి’లో ‘సుబ్బిశెట్టి’ పాత్రను కాళిదాస కోటేశ్వరరావు, శ్రీహరి పాత్రను సూరవరపు వెంకటేశ్వర్లు పోషించే వారు. వీరి ప్రదర్శన వైశ్యులను కించపరిచేలా ఉండేది. కానీ గంగారత్నం శ్రీహరి పాత్రలో కించపరిచే హాస్యాన్ని వదిలి సున్నితమైన హాస్యాన్ని ప్రదర్శించేది.
నాటకరంగంలో తెచ్చుకున్న గుర్తింపే ఆమెకు సినిమాల్లో అవకాశాలు కల్పించింది. ఆ రోజుల్లో ఎక్కువగా రంగస్థలం నుండే సినిమాలోకి వెళ్లే వారు. అలా కత్తివెంటి నాగేశ్వరరావు మద్రాసులో తీసిన తొలి తెలుగు సాంఘిక చిత్రం ‘ప్రేమ విజయం’లో ఒక పాత్రకుగాను ఆమెను ఎంపిక చేసుకోవడంతో ఆమె సినీ జీవితం ప్రారంభమైంది. అలా ఆమె నట జీవితంలో రెండో అంకం మొదలైందని చెప్పాలి.
అయితే 1999లో కొన్ని పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆమె తన తొలి చిత్రం గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ (1939)’గా చెప్పుకున్నారు. కానీ ‘ప్రేమ విజయం’ చిత్రమే గంగారత్నం తొలి చిత్రమని తొలి తెలుగు సినీ జర్నలిస్టు ఇంటూరి వెంకటేశ్వరరావు 1981లో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు.
ప్రేమ విజయం తర్వాత రెండో చిత్రం ఘంటసాల బలరామయ్య సతీ తులసి’ (1936)లో నటించిన గంగారత్నం కాలక్రమంలో వేశ్య, గయ్యాళి, వితంతువు పాత్రల్లో తనదైన విలక్షణ ముద్రను వేసింది. సినిమా రంగంలోకి రాకముందు ఆమె సర్కస్ ఫీట్లు చేసేది. అందుకే ఆవిడ విగ్రహం అలా ఉండేది. ఈ నేపథ్యంలో కనకతార (1937), మాలపిల్ల (1938), రైతుబిడ్డ, సతీతులసి(1939), విశ్వ మోహిని (1940 ), తెనాలి రామకష్ణ, తల్లి ప్రేమ (1941), బాలనాగమ్మ (1942), రేణుకా వారి భాగ్యలక్ష్మి (1943), మంగళసూత్రం, భక్త తులసీదాస్ (1946), యోగివేమన (1947), కీలుగుఱ్ఱం, రక్షరేఖ (1949), లక్ష్మమ్మ కథ, (1950), మల్లీశ్వరి, ఆకాశరాజు (1951), ప్రియురాలు (1952), పక్క ఇంటి అమ్మాయి (1953), సంతోషం, ఇద్దరు పెళ్ళాలు, వద్దంటే డబ్బు, అర్ధాంగి, శ్రీకష్ణ తులాభారం (1954), చింతామణి (1956) వరుడు కావాలి (1957), భక్త అంబరీష (1959), రుణానుబంధం, సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960), ఉషా పరిణయం (1961), పలనాటి యుద్ధం (1966), ఉమ్మడి కుటుంబం (1967) ఆమె నటించిన గుర్తుండిపోయిన సినిమాలు. ఆ తర్వాత ఒకటిన్నర దశాబ్దానికి జంధ్యాల తీసిన వ¶డు ముళ్ళు (1983), శ్రీవారి శోభనం (1985) ఆమె నటించిన చివరి చిత్రాలు. జంధ్యాల ‘నెలవంక (1983)’లో జె.వి.సోమయాజులు తల్లిగా నటించింది గంగారత్నమే. ‘శ్రీవారి శోభనం’ చిత్రంలో పాపులర్ అయిన ”అలకపానుపు ఎక్కనేల చిలిపి కోరిక” పాటలో గంగారత్నం 90 ఏండ్ల వయసులోనూ నర్తించడం చూడవచ్చు. తెలుగు సినీ కళామతల్లి గత వైభవానికి ఆనవాలుగా చెప్పుకోదగిన గంగారత్నం ఒక సురభి కమలాబాయి తర్వాత సినీ రంగంలోకి వచ్చిన ఛాయాదేవి, సూర్య కాంతం వంటి నటీమణులకు ముందు తరం నటిగా కనిపిస్తుంది.
గంగారత్నం తన 50 ఏండ్ల సినీ జీవితంలో 200కుపైగా చిత్రాల్లో నటించింది. ‘మంగళ సూత్రం’, ‘సంతోషం’ చిత్రాల్లో సురభి కమలా బాయి, గంగారత్నంల ముష్టియుద్ధం దశ్యాలు ఆతరం సినిమా ప్రేక్షకులకు మరుపురావు. ఘంటసాల బలరామయ్య, రామబ్రహ్మంల ప్రోత్సాహంతోనే సినిమాల్లో కొన సాగిందామె.
గంగారత్నం తాను సినిమాల్లో నటించే కాలంలోనే తన కూతురు సత్యవతికి పెళ్లిచేసి షూటింగుల నిమిత్తం మూడేళ్ల కాంట్రాక్టుతో కలకత్తా వెళ్లింది. కొంత కాలానికి అక్కడ భూకంపం రావడంతో తన వెంట వచ్చిన వాళ్ళంతా చెల్లాచెదురైపోయారు. తిరిగి రావడానికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేని గంగారత్నం నెల్లూరుకు ఉత్తరం రాసింది. అపుడు ఆమె తాతగారు పంపిన మనీ అర్డరు అందుకుని ఇంటికి చేరుకుందామె. నాటి నుంచి అవుట్ డోర్ షూటింగులు మానేసిన గంగారత్నానికి సినిమా అవకాశాలు సన్నగిల్లినవి. క్రమంగా పరిశ్రమకు దూరమైంది. జీవికకోసం తిరిగి రంగస్థలంపై ఆధార పడనారంభించింది.
చేతనైనంత కాలం నాటకాల్లో నటించిన ఆమె అవసాన దశలో తనకంటూ ఏమీ మిగిల్చుకోలేదు. అడిగినవారికేది లేదనకుండా ఉన్నదంతా ఇచ్చివేసింది. తిరిగి మళ్లీ ఇవ్వలేదెవరు. చివరికి నిలువ నీడ కోల్పోవలసి వచ్చింది. ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితి దాపురించింది. ఆ దశలో ఆంధ్ర దేశంలోని కళాభిమానులను తనను అందుకోవలసిందిగా పత్రికల ద్వారా విజ్ఞప్తి చేసుకోవలసి వచ్చిందామెకు. ఒక దశలో ఆమె కొంత కాలం మద్రాస్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి నెల్లూరు జిల్లాకు నివాసం మార్చాల్సి వచ్చింది. తోటపల్లి గూడూరు మండలం ఈడూరులో అనామకంగా తన కూతురు సత్యవతి వద్ద చివరి రోజులు గడిపారామె.
1999లో గంగారత్నం దీనస్థితి గురించి కొన్ని పత్రికలు వార్తలు రాయడంతో ఒక్కసారిగా పరిశ్రమ దష్టికి వచ్చారు. సినీ పరిశ్రమలో ఐదు దశాబ్దాల పాటు పరిశ్రమలో కొనసాగిన ఆమె మిగిల్చుకున్నది ఏమీ లేదు. ఆమెకు కనీసం నివసించేందుకు ఈడూరులోనైనా ఒక పక్కా ఇల్లు కూడా లేని పరిస్థితి. పత్రికల ద్వారా పరిశ్రమ వారికి తెలిసి 1999లో ‘మా’ ఆమెను సత్కరించింది. హీరోయిన్లు వాణిశ్రీ, శారద, నిర్మాత ఎమ్మెస్ రెడ్డి కొంత ఆర్థిక సాయం చేసి అప్పటికి ఆమెను ఆదుకున్నారు. ఈ సందర్భంగా పలువురు కలిసి 60వేల ఆర్థిక సాయం చేశారు. అంతకుముందు మద్రాసు సినీకళాకారుల సంఘంవారు నెలకు రూ.300, బెజవాడ గోపాలరెడ్డి సహాయనిధి నుంచి నెలకు 500, వాకాడ లలితమ్మ స్మత్యర్థం 500 రూ.ల ఆర్ధిక సాయం మాత్రం అందేది. అఖిలాంధ్ర కళాకారుల సాంస్కతిక సంక్షేమ సంఘం వారి కషితో 121 గజాల స్థలం ప్రభుత్వం ద్వారా ఆమెకు లభించింది. అనంతరం 2000 సంవత్సరంలో ఆమె నెల్లూరు జిల్లా వాకాటి రాధమ్మ సీమలో తొలి తరం మహనీయుల స్మారక సభలో సన్మానం పొందింది. ఇలా కడపటి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులను అనుభవిస్తూనే 2001 సెప్టెంబరు 24న 109వ ఏట పూర్వపు నెల్లూరు జిల్లా ఈదూరులో మతి చెందింది.
గూడవల్లి రామబ్రహ్మం, వేదాంతం రాఘవయ్య, నటీమణులు కాంచనమాల, బెజవాడ రాజరత్నం, కన్నాంబ, సురభి కమలాబాయి, దాసరి కోటిరత్నం. లక్ష్మీ రాజ్యం వంటి తొలినాటి నటీమణులకు ఒక మెరుపు గంగారత్నం. ఆ తర్వాత గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరైన సూర్యకాంతానికి గంగారత్నమే తొలిప్రేరణ. తొలి తరం సినిమాల్లో గయ్యాళి పాత్రలకు ప్రాణంపోసిన గంగారత్నం తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.
(రిఫరెన్స్ కర్టెసీ : ఊటుకూరి వెంకట సత్యనారాయణ)
హెచ్.రమేష్ బాబు,
7780736386



