– సింగరేణిని 25 ఏండ్లుగా ఏలిన గుర్తింపు సంఘాల వైఫల్య ఫలితం
– 1.16 లక్షల నుంచి 39 వేలకు పడిపోయిన కార్మికుల సంఖ్య
– ఖజానా ఖాళీ చేసిన కేసీఆర్.. సంస్థనే మూసే పనిలో మోడీ
– కాపాడుకోవలసిన బాధ్యత కార్మికులదే..
– 27న సింగరేణి ఎన్నికలు
నవతెలంగాణ-ఇల్లందు
135 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిని బొందల గడ్డగా మార్చిన ఘనత గుర్తింపు సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ-ఐఎన్‌టీయూసీ, టీబీజీకెఎస్‌లకే దక్కింది. 1998లో తొలిసారిగా సింగరేణిలో ఎన్నికలు జరిగాయి. ఆనాటి నుంచి ఏఐటీయూసీ 3 సార్లు, ఐఎన్‌టీయూసీ ఒక్కసారి గెలిచింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన అనంతరం జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ 2012, 2017లో గెలుపొందింది.
బొగ్గు బ్లాకులను కాంట్రాక్టీకరణ చేసిన ప్రధాని మోడీ..!
1998 నుంచి 3 సార్లు దాదాపు పుష్కరకాలం సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ సంస్కరణలపై పోరాట బాట వదిలి పైరవీలు చేసుకుంటూ యాజమాన్యం తొత్తు సంఘంగా మిగిలింది. కార్మికులకు, సంఘాలకు వ్యతిరేకంగా సింగరేణి యాజమాన్యం ప్రవేశపెట్టిన సంస్కరణలకు తలూపింది. పైకి మాత్రం వ్యతిరేక పోరాటం అంటూ హల్‌చల్ చేసినా.. కోడ్ ఆఫ్ డిసిప్లేన్, ఓసీల ఏర్పాటు, వారసత్వ తొలగింపు, ప్రయివేటీకరణ ప్రవేశపెట్టినా నోరెత్తలేదు. కోడాఫ్ డిసిప్లేన్ వల్ల గుర్తింపు సంఘం తప్ప మిగతా సంఘాలకు యాజమాన్యంతో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. బొగ్గుబావులపై మీటింగ్‌లకు గుర్తింపు సంఘానికే అవకాశం ఉండేటట్టు చేశారు. కార్మికుల హక్కులు కాలరాశారు. దాంతో ఆ సంఘానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. గుర్తింపు సంఘం సూచించినవారికే సింగరేణిలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, క్వార్టర్స్, కోరుకున్న చోట బదిలీలు, తేలికపాటి పనులు తదితర అవకాశాలు కల్పించారు. వ్యతిరేకించిన కార్మిక సంఘాల నాయకులను ఇబ్బందులకు గురిచేశారు. కఠినమైన పనులకు పంపారు. సమస్యలపై కార్మికులు గుర్తింపు సంఘం దగ్గరికి వెళితే తమ సంఘంలో చేరితేనే సమస్య పరిష్కరింపజేస్తామని తేల్చిచేప్పేవారు. ఆ విధంగా కార్మికులను లోబరుచుకున్నారు. మాట వినని కార్మికులను తేలికపాటి పనుల నుంచి కఠినమైన పనిలో వేయడం, జనరల్ షిప్ట్ అయితే మూడు షిప్టుల్లోకి మార్చడం చివరికి ఆదిలాబాద్ జిల్లా గోలేటి మైన్‌కు బదిలీ చేయడం కార్మికులు చవిచూశారు. ఇదే బాటలో ఐఎన్‌టీయూసీ నడిచింది. టీబీజీకేఎస్ గెలిచిన అనంతరం ఒకడుగు ముందుకు వేసిన మాజీ సీఎం కేసీఆర్ సింగరేణిని తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ జోక్యానికి తెరలేపారు. రూ.29 వేల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న సింగరేణి ఖజానా ఖాళీ చేసి నిర్వీర్యం చేశారు. ప్రధాని మోడీ గారేమో.. కోల్ ఇండియాలో161 బొగ్గు బ్లాకులు, తెలంగాణలో 2 గనులను ప్రయివేటీకరణ చేశారు. గుర్తింపు సంఘాలేమో చోద్యం చూస్తూ గడిపేశాయి.
సింగరేణిలో సంస్కరణలతో దిగజారిన కార్మికులు, బావుల సంఖ్య
సింగరేణిలో గుర్తింపు సంఘాలు యాజమాన్యానికి బాసటగా నిలవడంతో సంస్కరణల బాట పుంజుకొంది. ఖమ్మం, వరంగల్, కరీంనగ్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో 56 భూగర్భ బావులు ఉండగా నేడు 22కు పడిపోయాయి. ఓసీల సంఖ్య 18కి చేరింది. 1.16లక్షల మంది ఉన్న కార్మికులు నేడు 39 వేలకు పడిపోయారు. యాంత్రీకరణతో పాటుగా బొగ్గు ఉత్పత్తి పెరిగింది. భూగర్భ గనుల స్థానంలో ఓసీల సంఖ్య పెరుగుతోంది. కాంట్రాక్టు కార్మికుల సంఖ్య 25 వేలకు చేరింది. సింగరేణి కార్మికులకు మినిమం రూ.28 వేల వేతనం కాగా కాంట్రాక్టు కార్మికులకు కేవలం రూ.8వేలు మాత్రమే. వారు శ్రమ దోపిడీకి గురౌతున్నారు. బొగ్గు గనులున్న పట్టణాలు నిర్వీర్యం అవుతున్నాయి. దీనికి నిదర్శనం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు. బ్రిటీష్ కాలంలో 1889లో బొగ్గుట్టగా పేరొందిన పట్టణం నేడు బొందల గడ్డగా మారింది. ఇక్కడ ఇండ్లకు, స్థలాలకు విలువ లేకుండా పోయింది. రాబోయే కాలంలో కొత్తగూడెం, మణుగూరు, సత్తుపల్లి, భూపాలపల్లి, గోదావరి ఖని, తదితర పట్టణాల గతీ ఇంతే కానుంది. దీనిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ లక్షలాది మంది ప్రజలు ఉపాధి కోల్బోయారు. దీనికి కారణం ఆనాటి గుర్తింపు సంఘాలేనని కార్మికులంటున్నారు.
నిశ్శబ్ద యుద్ధం ద్వారా సీఐటీయూను గెలిపించండి
ఈ నేపథ్యంలో డిసెంబర్ 27న సింగరేణి వ్యాప్తంగా బొగ్గుగునుల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. ‘నిశ్శబ్ద యుద్ధం ద్వారా సీఐటీయూను గెలిపించండి.. ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు చేయండి.. అంటూ ఆ సంఘం నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో 25 ఏండ్లుగా సీఐటీయూ గుర్తింపు సంఘంగా ఉంది. రామగుండం ఎన్‌టీపీసీ, హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్, మహేంద్ర అండ్ మహేంద్ర, ఐడీపీఎల్, బీడీఎల్, ఈఎల్‌ఎల్, రెడ్డి ల్యాబ్, అరవింద్ ల్యాబ్, ఎంఆర్‌ఎఫ్ టైర్స్, విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌లో సీఐటీయూనే కార్మికులు గెలిపించారు. రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పరిశ్రమల్లో ఇటీవల ఎన్నికలు జరిగితే స్వయంగా రాష్ట్ర మంత్రులు ప్రచారం చేసి పోటీలో పాల్గొన్నా వారిని కార్మికులు చిత్తుగా ఓడించి సీఐటీయూ నాయకులను గెలుపించుకున్నారు. కార్మికుల తరుపున సీఐటీయూ నికరంగా నిజాయితీగా నిలబడటం వల్లే కార్మికులు ఆదరిస్తున్నారు. సీఐటీయూ అంటే సింగరేణి కార్మికులకు కూడా నమ్మకం ఉంది. నీతి, నిజాయితీ, నిజాలే చెబుతారని మైన్స్‌పై ఎందరో కార్మికులు అంటుంటారు. ఆ నమ్మకం ఓటుగా మారాల్సిన అవసరం ఉంది.