ఆరుగ్యారంటీల అమలు ఇప్పట్లో అసాధ్యం

Implementation of six guarantees Impossible now– పార్లమెంట్‌లో దాడి భద్రతాలోపం
– తెలంగాణలో 4 జిల్లాలే కాంగ్రెస్‌కు అనుకూలం
– పార్టీ ఆదేశిస్తే నా కుమారుడు అమిత్‌ పోటీ : శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ టౌన్‌
కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలు ఇప్పట్లో అమలు సాధ్యం కాదని శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అదేశిస్తే నల్లగొండ లేదా భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి పోటీ చేస్తారని తెలిపారు. తెలంగాణలో నాలుగు జిల్లాల్లో మాత్రమే కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయన్నారు. మిగతా జిల్లాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని తెలిపారు. హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ ఆధిపత్యం కనిపించిందన్నారు. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపించిరా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోతుందని కలలో కూడా అనుకోలేదని చెప్పారు. ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని ప్రజలంతా అనుకున్నారని, కానీ ఎమ్మెల్యేలు ఓడిపోవడం వల్ల ఫలితం తారుమారైందని తెలిపారు. నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై కొత్తగా వచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయించాలని, తన వంతుగా ప్రాజెక్టులపై సూచనలు, సలహాలు అందించానని చెప్పారు. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం ప్రొటోకాల్‌ను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణలో సృష్టించిన ఆస్తుల మీద శ్వేతపత్రం విడుదల చేస్తుందని తెలిపారు. పార్లమెంట్‌లో పొగ బాంబ్‌ దాడి భద్రతా లోపాలను స్పష్టంగా చూపిస్తుందన్నారు. ప్రభుత్వాలు రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి కోసం పని చేయాలి కానీ పట్టుదలకు పోయి చతికలపడొద్దని సూచించారు.

Spread the love