– సమాజం, దేశం కోసం పనిచేయాలి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
– ఘనంగా ఐసీబీఎం 16వ స్నాతకోత్సవం
నవతెలంగాణ-రాజేంద్రనగర్
నేటి యువత ఏ రంగంలోనైనా రాణించడానికి అనేక సవాళ్లను ఎదుర్కోవాలని అప్పుడే అత్యున్నత స్థానంలో ఉంటామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. యువత సమాజం, దేశం కోసం పనిచేయాలని కోరారు. ఆదివారం రంగారెడ్ది జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఐసీబీఎం 16వ స్నాతకోత్సవానికి సజ్జనార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2021-2023 సంవత్సరానికి సంబంధించి 150 మంది విద్యార్థులకు ఐసీబీఎం చైర్మెన్ ప్రొఫెసర్ జరార్‌తో కలిసి సజ్జనార్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాన్ని సాధించడానికి నిరంతరం కృషి చేయాలన్నారు. 34 ఏండ్లుగా కాలేజీని విజయవంతంగా కొనసాగిస్తున్న చైర్మెన్ ప్రొఫెసర్ జరార్, రీతు జరార్, జితేందర్‌ను అభినందించారు.
విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. ఈ కాలేజీలో చదివిన ప్రతి విద్యార్థికీ వందశాతం జాబ్ గ్యారెంటీతో పాటు ఎంతో మంది వివిధ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. తాను ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పుడు అనేక సమస్యలు స్వాగతం పలికాయని, ఒక్కొక్క సమస్యను ఒక్కొక్క రీతిలో పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఆర్టీసీ మొత్తం దివాళా తీసి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు వాటన్నింటినీ అధిగమించి లాభాల్లోకి తీసుకొస్తున్నామని చెప్పారు. ప్రజల వద్దకు ఆర్టీసీ, గమ్యం యాప్, ఆర్టీసీ కార్మికుల కోసం ప్రత్యేక బీమా ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముందుకు సాగడంతో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.
అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు వివిధ రకాల శిక్షణా కార్యక్రమాలు ఇచ్చి ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేసినట్టు వివరించారు. ఆర్టీసీలోని 50 వేల మంది ఉద్యోగులకు యాప్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితి వివరించి భవిష్యత్తులో చేయవలసిన కర్తవ్యాల గురించి వివరించినట్టు తెలిపారు. అదేవిధంగా ఆర్టీసీ ద్వారా వివిధ రకాల వ్యాపారాలను కూడా ప్రారంభించి లాభాలు తీసుకొచ్చామన్నారు. నిత్యం విద్యార్థులు పుస్తకాలు బాగా చదవాలని సూచించారు.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. అనంతరం చైర్మెన్ ప్రొఫెసర్ జరార్ మాట్లాడుతూ.. ఐసీబీఎం కాలేజీ క్రమశిక్షణకు మారుపేరన్నారు. తమ కాలేజీలో మొదట క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తానని తద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఆ రంగాల్లో రాణించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో చదివిన ప్రతి విద్యార్థికీ కచ్ఛితంగా ఉద్యోగం లభిస్తుందని స్పష్టం చేశారు. తమ కాలేజీలో చదవడానికి ఇతర రాష్ట్ర విద్యార్థులు పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ కిరణ్ నేటి, సుమన్ సుగుణ, సురేష్, డైరెక్టర్లు రీతు జరార్, జితేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.