రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించండి
కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసులో సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
63 ధిక్కరణ కేసులున్నాయని తీవ్రంగా తప్పుపట్టిన న్యాయమూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
న్యాయస్థానాల ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తూ, కోర్టు ఎదుట స్వయంగా ఇచ్చిన హామీలను సైతం అమలు చేయకుండా న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్‌ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆయన స్థానంలో మరో అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కి ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాదిన్నర కాలంలో రంగనాథ్‌పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయనీ, అయినప్పటికీ ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొంది. చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వ అధికారులు కోర్టు ఆదేశాలనే విస్మరిస్తే ప్రజలు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఎలా ఉంచగలరని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడం ఒక అంశమైతే, కోర్టు ఎదుట ఇచ్చిన హామీని ధిక్కరించడం మరింత తీవ్రమైన కోర్టు ధిక్కారమని స్పష్టం చేసింది. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వ సంస్థలపై ఉన్నప్పటికీ, ఆ బాధ్యత పేరుతో చట్టాన్ని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామం సర్వే నెంబర్ 1, 2లోని 40 ఎకరాల భూమిలో ఈనెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్ చేస్తూ శాంతా శ్రీరాం కన్సస్ట్రక్షన్ ప్రయివేట్ లిమిటెడ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ సోమవారం విచారణ జరిపి పై విధంగా సమగ్ర ఉత్తర్వులను వెలువరించారు.
హైడ్రా కమిషనర్‌పై ఇప్పటికే 63 కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన నివేదికను ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. ఇన్ని కేసులు నమోదైనా సంబంధిత అధికారిలో మార్పు కనిపించకపోవడం ఆందోళనకరమని పేర్కొంది. ప్రస్తుతం విచారణలో ఉన్న కేసులోనే కోర్టు ఆదేశాలను వరుసగా మూడుసార్లు ఉల్లంఘించడం యాదృచ్ఛికం కాదనీ, అది ఉద్దేశపూర్వక చర్యగానే కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఈనెల 20న వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరైన రంగనాథ్, నగర ప్రయోజనాలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసమే చర్యలు తీసుకున్నామని చెప్పిన వివరణను కూడా హైకోర్టు తిరస్కరించింది. ఆ వాదన చట్టబద్ధమైన సమర్థన కాదని స్పష్టం చేసింది. కోర్టు ఎదుట ఇచ్చే హామీ కూడా కోర్టు ఉత్తర్వులతో సమానమేనని న్యాయస్థానం మరోసారి గుర్తు చేసింది. ఒకసారి హామీ ఇచ్చిన తర్వాత దానికి విరుద్ధంగా వ్యవహరించడానికి ఎలాంటి చట్టబద్ధమైన ఆధారం ఉండదని పేర్కొంది. ప్రజా ప్రయోజనం పేరుతో కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి చర్యలు తీసుకోవడానికి చట్టంలో ఎక్కడా అవకాశం లేదనీ, అలాంటి చర్యలను ఏ న్యాయస్థానమూ సమర్థించబోదని స్పష్టం చేసింది. కోర్టు తీర్పుల అమలే రాజ్యాంగబద్ధ పాలనకు పునాది అని, వాటిని అమలు చేయకపోవడం ఉద్దేశపూర్వక ధిక్కారంగానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. కోర్టును ఆశ్రయించే హక్కుతోపాటు, కోర్టు ఇచ్చిన ఉపశమనాన్ని సకాలంలో పొందే హక్కు కూడా ప్రతి పౌరుడికీ రాజ్యాంగం కల్పించిన హక్కేనని స్పష్టం చేసింది. హైడ్రా వ్యవహారశైలిపై కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గ్రీకు పురాణాల్లోని బహుశిరస్సుల జలరాక్షసి ‘హైడ్రా‘ను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రజల హక్కులను రక్షించాల్సిన ప్రభుత్వ సంస్థ చట్టానికే అతీతంగా వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతుందని పేర్కొంది. ప్రభుత్వ సంస్థలు తమను తాము స్వతంత్ర అధికార కేంద్రాలుగా భావించి కోర్టు ఉత్తర్వులను నిర్లక్ష్యం చేస్తే అది న్యాయపాలనకు ‘మృత్యు ఘంటిక‘ మోగించినట్టేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికార దుర్వినియోగాన్ని సహించే ప్రసక్తే లేదనీ, హైడ్రా కూడా చట్టం నిర్దేశించిన హద్దుల్లోనే పనిచేయాలని స్పష్టం చేసింది. రంగనాథ్ దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌ను కూడా హైకోర్టు అంగీకరించలేదు. నిజమైన క్షమాపణ అనేది శిక్ష తప్పించుకునేందుకు చివరి క్షణంలో చెప్పేది కాదనీ, తప్పు తెలుసుకున్న వెంటనే హృదయపూర్వకంగా వ్యక్తం చేయాల్సిందని పేర్కొంది. గత విచారణలో క్షమాపణ చెబితేనే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతించిన విషయాన్ని గుర్తు చేస్తూ, చివరి దశలో సమర్పించిన క్షమాపణను నిజాయితీతో కూడినదిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ‘‘ఎంవై షరీఫ్, ఎల్‌డి జైక్వాల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అశోక్ పేపర్ కామ్‌గార్ యూనియన్, కపిల్‌దేవో ప్రసాద్ సాహ్, అనిల్ రతన్ సర్కార్’’ తదితర కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను ప్రస్తావిస్తూ, కోర్టు ఎదుట ఇచ్చిన హామీని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం కూడా కోర్టు ధిక్కారమేనని పేర్కొంది. కోర్టు ఆదేశాలను అమలు చేయించడం, వాటిని ధిక్కరించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం న్యాయస్థానాల రాజ్యాంగబద్ధ బాధ్యత అని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించి, కొత్త అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
గత విచారణలో హైకోర్టు హెచ్చరిక
‘అన్ని చట్టాల్ని రద్దు చేసేయండి. హైడ్రా చట్టం ఒక్కటే తీసుకురండి, రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక శాఖలకు నిర్వీర్యం చేశారు, ఏ అధికారంతో హైడ్రా పెత్తనం చేస్తోంది. రెవెన్యూ చట్టంలోని 6, 7 సెక్షన్ల ప్రకారం భూ ఆక్రమణలపై చర్యలు తీసుకునే స్పష్టమైన అధికారాలు సంబంధిత శాఖలకు ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా పక్కనబెట్టి జీవో 99తో ఏర్పాటైన హైడ్రాకు అన్ని శాఖలూ దాసోహమన్నట్టుగా చేయడం ఏంటీ. బుల్డోజర్లు, జేసీబీలు, భారీ పోలీసు బలగాలతో అన్ని శాఖల తరఫున హైడ్రానే ఎలా ప్రత్యక్షం అవుతుంది. రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీ వంటి ప్రభుత్వ శాఖలు, వాటి చట్టాలు నిరర్థకంగా మారవా? అన్ని ప్రభుత్వ శాఖలూ హైడ్రావైపే ఎందుకు చూస్తున్నాయి. కీలక శాఖలను నిష్క్రియంగా మార్చేస్తారా? ఉన్న చట్టాలను పక్కనబెట్టి హైడ్రాకు పూర్తి అధికారం ఇచ్చినట్టుగా వ్యవహరించడం చట్టబద్ధ పాలనకు విరుద్ధం. రెవెన్యూ, ఇరిగేషన్ ఆఖరికి పోలీసులు కూడా హైడ్రాను ఆశ్రయించే దుస్థితి ఎందుకు వచ్చింది?, ఈ పరిస్థితిని ఎవరు కల్పించారు. కీలక ప్రభుత్వ శాఖలు పలుకుబడి లేనివిగా మార్చేస్తారా? ధిక్కార ధోరణి కలిగిన రంగనాథ్ లాంటి అధికారిని న్యాయ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. కోర్టుధిక్కరణ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటే పరిస్థితి ఎంతదూరమైనా వెళ్తుంది. బేషరతుగా క్షమాపణలు చెప్పి తీరాలి. ఆ తర్వాతే ఇతర విషయాల్లోకి వెళ్తాం. పదేపదే ధిక్కరించే అధికారులపై ఎక్కడో ఒకచోట కఠిన చర్యలు ప్రారంభం కావాల్సిందే. అది ఈ కేసుతోనే ప్రారంభమవుతుందని గుర్తుంచుకోవాలి. క్షమాపణ అనే పదం కూడా తొలి అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదే వైఖరితో ఉంటే సైనికుల జోక్యం చేసుకోవాలనే అసాధారణ ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుంది. ఈ మేరకు గతంలో జారీ చేసి సస్పెన్షన్‌లో పెట్టినదే అమలుకు ఉత్తర్వులు వెలువరిస్తాం’అని హైకోర్టు ప్రభుత్వాన్ని, హైడ్రాను ప్రశ్నలతో కూడిన హెచ్చరికలు చేసింది. ఈనేపధ్యంలో హైడ్రా కమిషనర్ బేషరతుగా క్షమాపణలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వుల్లో హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలను జారీ చేశారు. ఐజీ స్థాయి అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
క్షమాపణ చెబుతూ రంగనాథ్ అఫిడవిట్
హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ తనపై పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ కేసును కొట్టేయాలని సోమవారం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో హైకోర్టును కోరారు. బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. కోర్టుల పట్ల గౌరవం ఉందనీ, కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ ప్రయివేట్ లిమిటెడ్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో ఈ అఫిడవిట్‌ను సమర్పించారు. తన చర్యలు కోర్టు ప్రతిష్టకు భంగం వాటిల్లినట్టుగా భావించి ఉంటే అందుకు క్షమాపణలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. హైకోర్టు అధికారాన్ని, గౌరవాన్ని గౌరవిస్తామనీ, న్యాయస్థానం పట్ల తనకు సంపూర్ణ గౌరవం ఉందని స్పష్టం చేశారు. కోర్టు పట్ల ఉన్న అత్యంత గౌరవంతోనే ఈ క్షమాపణ చెబుతున్నట్టు తెలిపారు. పిటిషనర్ పేర్కొన్న రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్లు 1, 2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమిలో హైడ్రా ఎలాంటి జోక్యం చేసుకోలేదనీ, ప్రస్తుతం కూడా జోక్యం చేసుకోవడం లేదని అఫిడవిట్‌లో వివరించారు. అలాగే పిటిషనర్ ఆరోపణలను ఖండిస్తున్నట్టు తెలిపారు. తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని కోర్టుధిక్కరణ కేసును కొట్టేయాలని కోరారు.
హైడ్రా కమిషనర్‌ను తొలగించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



