అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి మృతి
ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా బంకర్ విధ్వంసక బాంబులు
బుషెర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో వైమానిక దాడి
లారిజానీ హత్యకు ప్రతీకారంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన టెహ్రాన్
ఇరాన్ ప్రభుత్వం బలహీనపడలేదు : అమెరికాకు ఇజ్రాయిల్ రహస్య నివేదిక
ఇరాన్‌పై అమెరికా..ఇజ్రాయిల్ యుద్ధం ప్రారంభమై..బుధవారానికి 19వ రోజుకు చేరింది. ఇరాన్‌ను దెబ్బ తీయటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నా.. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో ఖమేనీ బృందం శత్రుదేశాలను అణగదొక్కేందుకు ఎదురుదాడికి దిగుతోంది. యుద్ధంలో కీలకపాత్ర పోషిస్తున్న ముఖ్యనేతల్ని మట్టుబెడుతున్నా.. ఆత్మ విశ్వాసమే తమ ఆయుధంలా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇది ట్రంప్, నెతన్యాహులకు మింగుడు పడటం లేదు. రంజాన్ పండుగ తర్వాత ఇరాన్ మరింతగా ప్రతీకార దాడులకు దిగే అవకాశాలున్నాయని నిఘావర్గాలు హెచ్చరికలు చేస్తున్నాయి.
నవ తెలంగాణ – సెంట్రల్ డెస్క్
మధ్యప్రాచ్యంలో యుద్ధ బీభత్సం కొనసాగుతోంది. ఇరాన్ భద్రతా దళాల అధినేత అలీ లారిజానీ, బసిజ్ వాలంటరీ మిలిషియా ఫోర్స్ కమాండర్ జనరల్ సొలైమనీలను హతమార్చిన ఇజ్రాయిల్, అమెరికా సేనలు బుధవారం జరిపిన తాజా దాడులలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను చంపాయి. త్వరలోనే మరిన్ని ‘అనూహ్య పరిణామాలు’ చోటుచేసుకుంటాయని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఇరాన్ నేతలను, సైనికాధికారులను మట్టుపెట్టే అధికారాన్ని రక్షణ దళాలకు కట్టబెట్టామని ఆయన తెలిపారు.
గుడారంలో దాక్కున్న సొలైమనీని వైమానిక దాడిలో హతమార్చామని ఇజ్రాయిల్ సైనిక ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాలపై అమెరికా 2,200 కిలోల బంకర్ విధ్వంసక బాంబులను ప్రయోగించింది. జలసంధిలో ఉన్న నౌకలను ధ్వంసం చేసేందుకు ఇరాన్ క్రూయిజ్ క్షిపణులను మోహరించిందని, వాటిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిపామని అమెరికా సైన్యం తెలిపింది. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే చమురు ట్యాంకర్లకు రక్షణగా నౌకలను పంపాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన అభ్యర్థనను అనేక మిత్ర దేశాలు తోసిపుచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. ఇరాన్ దక్షిణ తీరంలోని బుషెర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో కూడా దాడి జరిగింది.
అయితే ఈ ఘటనలో ఎలాంటి రేడియేషన్ వెలువడలేదని, అలాగే నష్టం కూడా జరగలేదని రష్యా, ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ అసో సియేటెడ్ ప్రెస్ తెలియజేసింది. అణు విద్యుత్ ప్లాంటులో ఉన్న మెట్రోలజీ సర్వీస్ భవనం సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ దాడిపై తమకు ఇరాన్ సమాచారం ఇచ్చిందని ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చెప్పింది. పర్షియన్ గల్ఫ్ వెంబడి టెహ్రాన్‌కు దక్షిణంగా 750 కిలోమీటర్ల దూరంలో ఈ అణు శక్తి కేంద్రం ఉంది. ఇది ఇరాన్ నడుపుతున్న ఏకైక అణు శక్తి ప్లాంట్. రష్యా సాంకేతిక నిపుణుల సాయంతో దీనిని నిర్వహిస్తున్నారు. కాగా ఇరాన్‌లోని దొరుద్ నగరంపై జరిగిన తాజా దాడిలో ఏడుగురు చనిపోగా 56 మంది గాయపడ్డారు.
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో…
యుద్ధంలో నేతలు, సైనికాధికారులను కోల్పోతున్నప్పటికీ ఇరాన్ చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో పోరు సాగిస్తోంది. లారిజానీ హత్యకు ప్రతీకారంగా అనేక గల్ఫ్ దేశాలపై వివిధ రకాల వార్హెడ్లతో కూడిన క్షిపణులను, డ్రోన్లను ప్రయోగిస్తోంది. వాటిని అడ్డుకునేందుకు గల్ఫ్ దేశాలు ఆపసోపాలు పడుతున్నాయి. ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థల కన్నుగప్పి భారీ నష్టాన్ని కలిగించే ఓ ఆయుధాన్ని ఇరాన్ ప్రయోగించినట్టు సమాచారం. ఇరాన్ ప్రయోగించిన ఖొర్రంషెహర్-4, ఖ్వాద్ క్షిపణుల కారణంగా ఖతార్, కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిలలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి.
ఇరాన్ దాడులలో యూఏఈ బాగా దెబ్బతింటోందని, క్షిపణులు, డ్రోన్లు సహా ఇప్పటి వరకూ గల్ఫ్ దేశాలపై మూడు వేలకు పైగా దాడులు జరిగాయని అల్ జజీరా వార్తా సంస్థ ప్రతినిధి బస్రావీ తెలిపారు. వీటిలో సగం దాడులు యూఏఈని లక్ష్యంగా చేసుకొని జరిగినవే. దాడుల కారణంగా దుబాయిలోనే కాక గల్ఫ్ దేశాలలోని అనేక నగరాలలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. గల్ఫ్‌లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, ఆయా దేశాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలుస్తోంది. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ప్రాంగణాన్ని ఓ క్షిపణి తాకింది. అయితే ఈ దాడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సౌదీ అరేబియాలో అమెరికా దళాలు, యుద్ధ విమానాలకు ఆశ్రయం కల్పిస్తున్న ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడి జరిగింది. యూఏఈలోని ఆస్ట్రేలియా సైనిక స్థావరంపై కూడా దాడి జరిగింది. ఈ ఘటనలో స్వల్పంగా మంటలు చెలరేగాయి.
కువైట్ రాకుమారుడితో మాట్లాడిన మోడీ
మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ రాకుమారుడు సబహ్ అల్-ఖలీద్ అల్-హమద్ అల్-ముబారక్ అల్-సహబ్‌తో బుధవారం టెలిఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయనకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. కువైట్ సార్వ భౌమత్వంపై జరుగుతున్న దాడులను ఖండించారు. హార్ముజ్ జలసంధి మీదుగా చమురు నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించేలా చూసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
యుద్ధోన్మాదానికి బలవుతున్న చిన్నారులు
లెబనాన్‌లో హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులలో ప్రతి రోజూ అభం శుభం తెలియని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి ఇప్పటి వరకూ కనీసం 111 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా 334 మంది గాయాలపాలయ్యారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయిల్, అమెరికాల యుద్ధోన్మాదానికి 1,200 మంచి పిల్లలు చనిపోయారు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని ఇరు పక్షాలకూ యూనిసెఫ్ సూచించింది.
అమరులకు కన్నీటి వీడ్కోలు
అమెరికా, ఇజ్రాయిల్ దాడులలో మరణించిన భద్రతా దళాల అధిపతి అలీ లారిజానీకి, నౌకాదళానికి చెందిన ఇతర అమరవీరులకు ఇరాన్ ఘనంగా నివాళులు అర్పించింది. వారి త్యాగాన్ని దేశం ఎన్నడూ మరవబోదని, అది రాబోయే కాలంలో సాయుధ దళాలకు మరింత శక్తిని అందిస్తుందని అంత్యక్రియలకు హాజరైన నేతలు కొనియాడారు. మృతవీరుల ఆత్మశాంతి కోసం ప్రజలు పెద్ద ఎత్తున ప్రార్థనలు జరిపారు. వారి సేవలను, అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి వీడ్కోలు పలికారు.
ఇరాన్ ప్రభుత్వం బలహీనపడలేదు : అమెరికాకు ఇజ్రాయిల్ రహస్య నివేదిక
ఇరాన్ యుద్ధంపై అమెరికాకు ఇజ్రాయిల్ ఓ రహస్య నివేదికను అందజేసింది. ఇరాన్ ప్రభుత్వం బలహీనపడలేదని, తుది వరకూ పోరాడేందుకు సిద్ధంగా ఉన్నదని ఆ నివేదిక తెలిపిందని వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వెల్లడించింది. ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణచివేస్తున్నారని, నిరసనకారులను హతమారుస్తున్నారని ఆ నివేదిక ఆరోపించింది. ఇరాన్ నాయకత్వం ఇప్పుడప్పుడే అంతర్గతంగా కుప్పకూలే అవకాశాలు కానరావడం లేదని జెరుసలేంలోని అమెరికా రాయబార కార్యాలయానికి పంపిన నివేదికలో ఇజ్రాయిల్ అభిప్రాయపడింది. ఇరాన్ అంతర్గత భద్రతా యంత్రాంగం పటిష్టంగా ఉన్నదని తెలియజేసింది. ఆ నివేదిక ప్రకారం బసిజ్ వంటి దళాల మద్దతుతో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) బలంగా ఉంది.
గుజరాత్ చేరిన చమురు నౌక
భారత్‌కు చెందిన చమురు నౌక ‘జగ్ లాడ్కీ’ బుధవారం గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవుకు చేరుకుంది. ఎల్పీజీతో హార్ముజ్ జలసంధి మీదుగా ప్రయాణించిన నౌకలు శివాలిక్, నందాదేవి ఇప్పటికే దేశానికి చేరిన విషయం తెలిసిందే. జగ్ లాడ్కీ నౌకలో 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురు ఉంది.
నేతలను కోల్పోతున్నా వెనక్కి తగ్గని ఇరాన్
గత నెల28న మధ్యప్రాచ్యంలో మొదలైన యుద్ధం బుధవారం 19వ రోజుకు చేరింది. మొదటి రోజే సుప్రీం నేత అలీ ఖమేనీని, పలువురు సైనికాధికారులను ఇరాన్ కోల్పోయింది. ఇజ్రాయిల్, అమెరికా దాడులలో మంగళవారం భద్రతా దళాల అధిపతి లారిజానీ, బసిత్ దళాల కమాండర్ కమాండర్ సొలైమనీ చనిపోయారు. తాజాగా ఇంటెలిజెన్స్ మంత్రి ఖతీబ్నూ ఇరాన్ పోగొట్టుకుంది. అయినప్పటికీ అక్కడి నాయకత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలీ ఖమేనీ హతమైనా ఆయన కుమారుడు మొజ్తాబా సుప్రీం నేత అయ్యారు. ఆయన నేతృత్వంలో ప్రతీకార దాడులు ఉధృతమయ్యాయి. క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయిల్ పై, గల్ఫ్ దేశాలలోని అమెరికా ఆస్తులపై ఇరాన్ విరుచుకుపడుతోంది.
ఈ దాడులలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లకు ఆయువు పట్టయిన హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో పాటు దీర్ఘకాల పోరుకు ఇరాన్ సమాయత్తమవుతోంది. కనీసం ఆరు నెలల పాటు యుద్ధాన్ని కొనసాగించేలా సన్నాహాలు చేసుకుంటోంది. ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీని, ఐఆర్జీసీ సీనియర్ కమాండర్లను అమెరికా, ఇజ్రాయిల్‌లు యుద్ధం మొదటి రోజే హతమార్చి చంకలు గుద్దుకున్నాయి. వారి మరణంతో ఇరాన్ పని అయిపోయిందని అనుకున్నాయి. కానీ 19 రోజులు గడిచినా ఇరాన్ దాడులు ఆగిపోలేదు సరికదా మరింత తీవ్రమయ్యాయి. ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తారని ఆశించినా అది కూడా జరగలేదు.
అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం నేతగా ఎంపికైన ఆయన కుమారుడు మొజ్తాబాకు ఇరాన్ ప్రజానీకం పూర్తి మద్దతు తెలిపి అండగా నిలుస్తోంది. ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసేందుకు అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ విజయం సాధించ లేకపోతోంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు కేవలం పాక్షిక విజయాలు మాత్రమే సాధించగలిగాయి. కీలక నేతలు, అధికారులు చనిపోయినా ఇరాన్ రాజకీయ వ్యవస్థ కుప్పకూలిపోలేదు. అధికార మార్పిడి త్వరితగతిన జరిగిపోయింది. ప్రారంభంలో ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ సైన్యం కూడా త్వరగానే కోలుకొని సామర్ధ్యాన్ని పెంచుకుంది.
యుద్ధంలో ఇరాన్ సైన్యం సెజ్జిల్ బాలిస్టిక్ క్షిపణుల వంటి అత్యాధునిక వ్యవస్థలను, డ్రోన్లను ఉపయోగిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యుద్ధంలో ఇరాన్ అణు కేంద్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఇక హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో సాయపడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్ర దేశాలను వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. యుద్ధంలో విజయం సాధించలేకపోయినా ఓటమి చెందే అవకాశమే లేదని ఐఆర్జీసీ మాజీ కమాండర్-ఇన్-చీఫ్ అలీ జాఫరీ తేల్చి చెప్పారు. తమ దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ దేశాలను ఆర్థికంగా నష్టపరిచామని ఇరాన్ నేతలు అంటున్నారు.


