– సైలు బంకర్ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తా
– బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకరరెడ్డి
నవతెలంగాణ-సత్తుపల్లి
మండల పరిధిలోని కిష్టారం గ్రామం, అంబేద్కర్ నగర్ కాలనీ వాసుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అక్కడే నిర్మించిన సైలో బంకర్ (రైలు బొగ్గు లోడింగ్ పాయింట్) నుంచి ఎగిసిపడుతున్న బొగ్గు ధూళితో స్థానిక ప్రజల ఊపిరి తిత్తులు మసిబారుతున్నాయి. తీవ్ర కాలుష్యం కారణంగా పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు నిత్యం అనారోగ్యంతో నరకం చూస్తున్నామని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ దయనీయ పరిస్థితిపై 34 రోజుల పాటు ప్రజలు శాంతియుతంగా పోరాటం చేశారు. ఆ సమయంలో పరామర్శించిన మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని తీపి మాటలు చెప్పారు. వారి నమ్మకమైన మాటలు విని నిరసన విరమించిన ప్రజలను, ఆ తర్వాత పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినప్పటికీ, ఆ హామీ కేవలం కాగితాలకే పరిమితమైంది.
స్థలాల ఎంపిక పేరుతో అధికారులు నెలల తరబడి కాలయాపన చేస్తూ తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని బాధితులు ఆక్రోశిస్తున్నారు. పలు స్థలాలను పరిశీలించి నివేదికలు అందించినా, అనుమతుల సాకుతో సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని సైలో బాధితులు లబోదిబోమంటున్నారు. ఏళ్లుగా కాలుష్య రొంపిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నా, ఏ ఒక్క అధికారికీ తమ ఆర్తి పట్టకపోవడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సైలో బంకరు బాధితుల సమస్యను కేంద్రమంత్రికి వివరించి పరిష్కరిస్తాం
తాజాగా సైలో బంకర్ బాధితుల గోడు తెలుసుకున్న బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకరరెడ్డి మంగళవారం వారి వద్దకు వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. తీవ్రమైన ఈ సమస్యను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తక్షణమే తీసుకెళ్లి, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సైలో బంకరు బాధితులకు తగిన న్యాయం జరిగేలా పోరాడతానని బాధితులకు భరోసా ఇచ్చారు.



