నా అవార్డూ ఇచ్చేస్తా..

My award too Will give..– ఖేల్‌ రత్న.. అర్జున పతకాలు వద్దు
– అవార్డులంటేనే అసహ్యం కలుగుతోంది
– రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌
న్యూఢిల్లీ : నిన్న రెజ్లర్‌ బజరంగ్‌ పునియా తన పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేశారు.. ఇప్పుడు వినేశ్‌ ఫోగట్‌ కూడా అవార్డులను ఇచ్చేస్తానంటూ ప్రకటన చేశారు. మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న, అర్జున్‌ అవార్డును వాపన్‌ చేయనున్నట్టు సోషల్‌ మీడియా పోస్ట్‌లో తెలిపారు.
ఇప్పటికే సాక్షి మాలిక్‌ కుస్తీకి గుడ్‌బై చెప్పగా, బజరంగ్‌ పునియా తన పద్మశ్రీని వాపస్‌ చేసిన విషయం విదితమే. తానూ అవార్డులను తిరిగి ఇచ్చేస్తున్నట్టు ప్రధాని మోడీకి వినేశ్‌ లేఖ రాశారు. ,,దేశం కోసం ఒలింపిక్‌ పతకాలు సాధించిన క్రీడాకారులను ఎందుకు హింసిస్తున్నారో.. దేశం మొత్తానికి తెలుసు. మీరు దేశానికి అధినేత, కాబట్టి ఈ విషయం మీకు(ప్రధాని మోడీ) కూడా తెలిసి ఉండాలి.గత ఏడాది కాలంగా ఉన్న పరిస్థితి గురించి తెలియజేయడానికే మీకు ఈ లేఖ రాస్తున్నాను.,,అని వినేశ్‌ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్లు ఎలాంటి కష్టాలు పడ్డారన్న విషయాలను వినేశ్‌ లేఖలో పేర్కొన్నారు. మనం ఎంత మానసికంగా వేదన పడుతున్నామో.. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాక్షి కూడా రిటైరైంది. అతను(రెజ్లర్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌) తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రకటించాడు. అతను చాలా క్రూరంగా నినాదాలు కూడా చేశాడు.
మీ జీవితంలోని ఐదు నిమిషాలు మాత్రమే తీసుకుని, మీడియాలో ఆ వ్యక్తి చెప్పే మాటలు వినండి. అతను ఏమి చేశాడో మీకే తెలుస్తుంది,, అని ఫోగట్‌ అన్నారు. అతను మహిళా రెజ్లర్లను ‘మంత్ర’ అని పిలిచాడు, మహిళా మల్లయోధులను అసౌకర్యానికి గురిచేస్తున్నట్టు టీవీల్లో బహిరంగంగా ఒప్పుకున్నాడు . మహిళలను కించపరిచే ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు. అంతకంటే తీవ్రమైన విషయం ఏమిటంటే అది ఎంత మంది మహిళా రెజ్లర్ల జీవితాలతో ఆడుకున్నాడో..తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది. భయమేస్తోందని వివరించారు. ,,ఈ సంఘటనలన్నీ మర్చిపోవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. అయితే అది అంత సులభం కాదు. సార్‌, మిమ్మల్ని కలిసినప్పుడు కూడా ఇవన్నీ చెప్పాను. న్యాయం కోసం ఏడాది కాలంగా వీధిన పడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. మా మెడల్స్‌, అవార్డుల విలువ రూ.15 అని చెబుతున్నారు. కానీ ఈ పతకాలు మా ప్రాణాల కంటే ప్రియమైనవి. మేం దేశానికి పతకాలు సాధించినప్పుడు దేశం మొత్తం మమ్మల్ని గర్వంగా భావించింది. ఇప్పుడు మా న్యాయం కోసం మేం గొంతు పెంచితే దేశద్రోహులంటున్నారు. పద్మశ్రీ అవార్డు తిరిగి ఇచ్చే నిర్ణయాన్ని బజరంగ్‌ ఏ పరిస్థితిలో తీసుకున్నారో నాకు తెలియదని వినేశ్‌ అన్నారు. ,,ప్రస్తుత పరిస్థితుల్లో నా అవార్డులపై నాకూ అసహ్యం మొదలైంది. నాకు ఈ అవార్డులు వచ్చినప్పుడు మా అమ్మ మా ఇరుగుపొరుగున మిఠాయిలు పంచి, టీవీలో వినేశ్‌ వార్త వచ్చిందని, ఇరుగు పొరుగు వాళ్ళు చూడాలని చెప్పింది. మా అత్త మా పరిస్థితిని టీవీలో చూసి మా అమ్మతో ఏం చెబుతుందో అని చాలా సార్లు భయపడిపోతుంటాను ,,అని వినేశ్‌ పేర్కొన్నారు. ,,భారతదేశంలోని ఏ తల్లీ తన కూతురు ఈ స్థితిలో ఉండాలని కోరుకోదు. ఇప్పుడు నేను అవార్డును అందుకున్నాననే ఇమేజ్‌ను వదిలించుకోవాలని అనుకుంటున్నాను, ఎందుకంటే అది ఒక కల, ఇప్పుడు జరుగుతున్నది వాస్తవం. నాకు మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న , అర్జున్‌ అవార్డులు ఇచ్చారు..కానీ ఇప్పుడు నా జీవితంలో ఎలాంటి అర్థం లేదు. ప్రతి స్త్రీ గౌరవప్రదంగా జీవించాలని కోరుకుంటుంది. కాబట్టి, ప్రధానమంత్రి సార్‌, గౌరవంగా జీవించే మార్గంలో ఈ అవార్డులు మాకు భారంగా మారకుండా ఉండేందుకు నా మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న, అర్జున్‌ అవార్డులను మీకు తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను.,,అని లేఖలో వినేశ్‌ ఫోగట్‌ పేర్కొన్నారు. వినేష్‌ ఫోగట్‌ 2016లో అర్జున్‌ అవార్డును, 2020లో మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ ఖేల్‌ రత్న అవార్డును అందుకున్నారు. ఖేల్‌ రత్న అనేది భారత క్రీడారంగంలో అతిపెద్ద అవార్డు. ఇండియన్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నికల్లో బ్రిజ్‌ భూషణ్‌ సింగ్‌కు సన్నిహితుడైన సంజరు సింగ్‌ గెలిచిన కొద్ది గంటల్లోనే, రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం విదితమే. ఆ తర్వాత మరుసటి రోజు బజరంగ్‌ పునియా కూడా తన పద్మశ్రీని తిరిగి ఇచ్చారు. గత శుక్రవారం ప్రధాని నివాసం ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌పై పతకాన్ని ఉంచి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇంతగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నా..కేంద్రం సార్వత్రికం వైపే చూస్తోందని క్రీడాపండితులు విశ్లేషిస్తున్నారు.

Spread the love