దేశ సమైక్యతే మా ధ్యేయం

Unity of the country is our mission– రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న బీజేపీ
– ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని శక్తులూ ఏకం కావాలి
–  సీపీఐ నేతల పిలుపు
– హైదరాబాద్‌లో ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటమే తమ ధ్యేయమని సీపీఐ నేతలు అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నదని విమర్శించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. మతోన్మాద, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 99వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అరుణపతాకాన్ని ఎగురవేశారు. ‘జోహార్‌ అమరవీరులకు, లాంగ్‌లీవ్‌ సీపీఐ. వర్ధిల్లాలి ప్రజాపోరాటాలు, లాంగ్‌లీవ్‌ మార్క్సిజం లెనినిజం’ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు హిమాయత్‌ నగర్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్‌ నుంచి మఖ్దూంభవన్‌ వరకు రెడ్‌ షర్ట్‌ వాలంటీర్లు భారీ కవాతు నిర్వహించారు.
మోడీ-షా క్రిమినల్‌ గ్యాంగ్‌ : నారాయణ
ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా క్రిమినల్‌ గ్యాంగ్‌ అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదనీ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇండియా కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. వామపక్షాల భాగస్వామ్యం లేకుండా అది బలపడడం సాధ్యం కాదన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో నాటకీయంగా పొగబాంబు కుట్ర చేసి అందరి దృష్టిని మళ్లించి విపక్ష ఎంపీలను బహిష్కరించడం ద్వారా బీజేపీ తాను కోరుకున్న బిల్లులను ఆమోదించుకున్నదని విమర్శించారు.
పొగబాంబు ఘటనను ముందస్తు నాటకంగా ఆయన అభివర్ణించారు. దేశాన్ని కాపాడుకోవాలంటే ముందు రాజ్యంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. మోడీ సర్కారు అధికారంలో ఉంటే అది సాధ్యం కాదన్నారు. స్వాతంత్య్రోద్యమం, సాయుధ పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాల్గొనలేదనీ, బ్రిటీష్‌, నిజాం సర్కారుకు అనుకూలంగా వ్యవహరించిందని విమర్శించారు. దేశానికి వామపక్షాలు ప్రమాదమా?, సంఫ్‌పరివార్‌ శక్తులు ప్రమాదమా? తేల్చాలని డిమాండ్‌ చేశారు. సనాతన ధర్మంలో ప్రజలు పాటించే అంశాల్లేవన్నారు. హక్కుల కోసం రాజకీయ పోరాటం చేయాలనీ, గ్రామీణ, పట్టణాల వరకు కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
సమస్యలపై పోరాడేది ఎర్రజెండా : కూనంనేని
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడేది ఎర్రజెండా మాత్రమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారనీ, సృష్టి, గాలి, భూమి, నీరు, ఆకాశం, విశ్వం ఉన్నంత వరకు ఎర్రజెండా అజరామరం అని స్పష్టం చేశారు. శ్రామికులకు మార్క్సిజం వెలుగురేఖలు అందించిందని చెప్పారు. దేశంలో రైతు ఆత్మహత్యలు, మహిళలపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏండ్లయినా ప్రజలు ఇంకా దుర్భర స్థితిలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అడిగే వాడు లేకుంటే దోపిడీ యథావిధిగా కొనసాగుతుందని హెచ్చరించారు. కమ్యూనిస్టు పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు.
విప్లవం కోసం పుట్టిందే కమ్యూనిస్టు పార్టీ : సురవరం
కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల పుట్టింది కాదనీ, విప్లవం కోసం పుట్టిందని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి అన్నారు. డబ్బు, మద్యం, కులం ప్రభావం తీవ్రంగా ఉన్నందున ఎన్నికల్లో కమ్యూనిస్టులు అనుకున్న సీట్లు సాధించలేకపోతున్నారని చెప్పారు. దోపిడీని అంతమొందించడం కోసమే కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందన్నారు. ఉద్యమాల ద్వారానే వామపక్ష, లౌకిక, ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత సాధ్యమవుతుందని చెప్పారు. వివక్ష, దోపిడీని ప్రతిఘటించాలని కోరారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. హక్కుల కోసమే కాకుండా అధికారం కోసం కమ్యూనిస్టులు పోరాడాలని స్వాతంత్య్ర సమరయోధులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఏఐటీయూసీ సీనియర్‌ నాయకులు పి ప్రేంపావని మాట్లాడుతూ మనుధర్మం, సనాతన ధర్మం పేరుతో మహిళలను బీజేపీ ప్రభుత్వం మధ్యయుగాలనాటికి తీసుకెళ్తున్నదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటి నరసింహ నాయకులను వేదికపైకి ఆహ్వానించగా, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌ బాలమల్లేష్‌ వందన సమర్పణ చేశారు.
సీనియర్‌ నేతలకు సన్మానం
సీపీఐ 99వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ సీనియర్‌ నాయకులను సన్మానించారు. సురవరం సుధాకర్‌ రెడ్డి, కందిమళ్ల ప్రతాప్‌ రెడ్డి, ఏటుకూరి ప్రసాద్‌, ఏటుకూరి కృష్ణమూర్తికి శాలువాలు కప్పి సన్మానించారు. డాక్టర్‌ బివి విజయలక్ష్మి సోదరి, అమెరికాలో ఉంటున్న రాజ్యలక్ష్మి మనవరాలు రీమ, మనవడు రోషన్‌ రూ.25 వేల విరాళాన్ని చెక్కు రూపంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుకు అందజేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు మరో రూ.25 వేల విరాళాన్ని అందజేశారు. ప్రముఖ సాహితీవేత్త ఏటుకూరి ప్రసాద్‌ రూ.10 వేల విరాళాన్ని అందించారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు విఎస్‌ బోస్‌, హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఛాయాదేవి, రావినారాయణ రెడ్డి మనవరాలు రావి ప్రతిభ తదితరులు పాల్గొన్నారు.

Spread the love