Thursday, July 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆపరేషన్ కవచ్‌కు ఏడాది పూర్తి 

ఆపరేషన్ కవచ్‌కు ఏడాది పూర్తి 

- Advertisement -

–   నేరస్థులకు భయం
–   ప్రజలకు భరోసాగా కామారెడ్డి పోలీసులు
నవతెలంగాణ – కామారెడ్డి
:  కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఆపరేషన్ కవచ్’ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుందని జిల్లా ఎస్పీయం. రాజేష్ చంద్ర తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. 2025 జూలై 25న ప్రారంభమైన ఈ ప్రత్యేక నేర నియంత్రణ కార్యక్రమం ప్రజలకు రక్షణ కవచంగా, నేరస్థులకు భయంగా నిలిచిందని అయన  తెలిపారు. గత ఏడాది కాలంలో ఆపరేషన్ కవచ్ ద్వారా 5,16,984 వాహనాలను తనిఖీ చేయగా, 1,19,052 మందిని పాపిలాన్ పరికరం ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా 209 మంది అనుమానితులను గుర్తించి, 3,572 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. 
డ్రగ్స్ నియంత్రణలోను  ప్రత్యేకత…
డ్రగ్స్ నియంత్రణలో భాగంగా 6 ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు చేసి, 18 మందిని అరెస్ట్ చేశారు. సుమారు 403.405 కిలోల గంజాయి (రూ.2.01 కోట్ల విలువ) స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే అక్రమ ఇసుక రవాణాపై 11 కేసులు, అక్రమ పశువుల రవాణాపై 3 కేసులు, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై 3 కేసులు, గుట్కా రవాణాపై ఒక కేసు నమోదు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 18 దొంగిలించిన మోటార్ సైకిళ్లు, 5 దేశీయ తుపాకులు, ఒక ఎయిర్ గన్ స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆలయ చోరీలు, ఏటీఎం దొంగతనాలు, అంతర్‌రాష్ట్ర నేర ముఠాల కేసులను ఛేదించారు. అంతర్‌రాష్ట్ర నేర ముఠాల కార్యకలాపాలను 12 నుంచి 2కు తగ్గించడంతో పాటు, 5 మంది అంతర్‌జిల్లా నేరస్థులను గుర్తించారు. మానవీయ కోణంలోనూ పోలీసులు విశేషంగా స్పందించారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన 14 ఏళ్ల బాలుడిని సురక్షితంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించడం వంటి చర్యలు ప్రజల ప్రశంసలు అందుకున్నాయి.
రాత్రివేళ తనిఖీలతోనే నేరాలకు చెక్…
 రాత్రివేళల్లో నిర్వహించే వాహన తనిఖీలు ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కాదని, నేరస్థులను అడ్డుకోవడం, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడమే లక్ష్యమని తెలిపారు. “మీ భద్రత – మా బాధ్యత” అనే నినాదంతో పోలీసులు నిరంతరం సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. ఆపరేషన్ కవచ్‌లో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ నగదు పురస్కారాలతో సత్కరించారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.
ప్రజలు మొదట అపార్థం చేసుకున్న ప్రస్తుతం అర్థం చేసుకుంటున్నారు..
 తాము రాత్రిపూట వాహనాలను తనిఖీ చేస్తుంటే జిల్లా ప్రజలు మొదట అపార్థం చేసుకున్నారని ఆ తర్వాత పూర్తి విషయం అర్థమై కామారెడ్డి జిల్లా పోలీసులు చేస్తున్న తనిఖీలు సరైనవేనని ప్రస్తుతం పేర్కొంటున్నారన్నారు. గతంలో జిల్లాలో 12 అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ఉండగా ప్రస్తుతం అవి రెండు స్థానాలకు పరిమితమైన అన్నారు. దొంగతనాలు తగ్గడం జరిగాయని,  ట్రాక్టర్  పోయిన యజమానికి తెలవక ముందే రెండు గంటల లోనే పోలీసులు ఆపరేషన్ కావచ్చులో భాగంగా వాహనాలను తనిఖీ చేస్తుండగా అట్టి  వాహనాన్ని స్వాధీనం చేసుకుని సంబంధిత రైతుకు అందజేయడం జరిగిందన్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్ కేసులు పెరిగి ప్రమాదాలు తగ్గడం జరిగిందన్నారు. ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు సంఖ్య  చాలావరకు తగ్గించడం జరిగిందని, ప్రస్తుతం ప్రజల్లో సైతం అవగాహన పెరిగి మద్యం సేవించిన తర్వాత రోడ్లపైకి రావడం తగ్గిందన్నారు. గతంలో మద్యం సేవించి రోడ్డుపైకి రావడం వల్ల వారి కుటుంబం కాకుండా ఎదుటివారి కుటుంబం కూడా రోడ్డు పాడు కావలసి వచ్చేదన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు ఎస్సైలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -